బాబు ఆస్తుల లెక్కల్లో పొంతనేదీ?

బాబు ఆస్తుల లెక్కల్లో పొంతనేదీ? - Sakshi


వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ధ్వజం

 

, హైదరాబాద్: ఆస్తులను వెల్లడించే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఏడు నెలల క్రితం బాబు ప్రకటించిన ఆస్తుల విలువకు, తాజాగా ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలకు పొంతనే లేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి దుయ్యబట్టారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 2009 ఎన్నికల అఫిడవిట్‌లో ఓ రకంగా, 2013 సెప్టెంబర్‌లో మరో రకంగా ఆస్తులు ప్రకటించారని.. తాజా అఫిడవిట్‌లోని వివరాలు ఈ రెండింటికీ సంబంధం లేనివిధంగా ఉన్నాయని విమర్శించారు. గతేడాది సెప్టెంబర్‌లో తన ఆస్తులు రూ.42 లక్షలని చెప్పిన చంద్రబాబు.. తాజా అఫిడవిట్‌లో వాటిని రూ.10.6 కోట్లుగా పేర్కొన్నారన్నారు.



ఏడు నెలల్లోనే ఆయన ఆస్తులు 24.23 రెట్లు పెరిగాయని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తులను రూ.48.85 కోట్లుగా చూపారని, ఇపుడు రూ.166.86 కోట్లుగా వెల్లడించార ని, అంటే ఆమె ఆస్తులు 241 శాతం మేరకు పెరిగాయని నాగిరెడ్డి వివరించారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు పక్కపక్కనే ఉన్న ఇంటి ప్లాట్ల విలువను కూడా మోసపూరితంగా చూపారని పేర్కొంటూ, అందుకు సంబంధించిన సర్వే ప్రతిని ప్రదర్శించారు. జూబ్లీహిల్స్‌లో 1,123 చదరపు గజాలు గల 1,110 నెంబరు ప్లాటులో చంద్రబాబు నివాసం ఉంటున్న 17 గదుల భవంతి విలువను కేవలం రూ.23 లక్షలుగా చూపారని, దానిపక్కనే తన కుమారుడు లోకేష్ పేరుమీద ఉన్న 1,309 నెంబర్ ప్లాటు విలువను రూ.2.36 కోట్లుగా చూపారని, ఇంతకంటే మోసం ఏముంటుందని నాగిరెడ్డి ప్రశ్నించారు.



అంతేకాక లోకేష్‌కు తన నాయనమ్మ బహుమతిగా ఇచ్చిందని చెప్పిన ఐదెకరాల పొలం తాలూకు విలువ కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. బహుమతిగా వచ్చిన ఆస్తికి విలువ ఉండదా అని ఆయన ప్రశ్నించారు. మాదాపూర్‌లో చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పేరు మీద ఉన్న 924 చదరపుగజాల భూమి విలువ కేవలం రూ.3.37 లక్షలుగా చూపారని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో గానీ, మున్సిపాలిటీల్లో గానీ ఇంత పెద్ద స్థలం విలువ ఇంత తక్కువగా ఉందా? అని విస్మయం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిత్యం ఆడిపోసుకునే ఓ పత్రికకు, మీడియాకు చంద్రబాబు ఆస్తుల విషయంలో చేస్తున్న మోసం ఏమాత్రం పట్టదని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top