మొదట హరికృష్ణ, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్...

హరికృష్ణ-జూనియర్ ఎన్టీఆర్ - Sakshi


మొదట అన్నగారి కొడుకు హరికృష్ణను వాడుకున్నారు. ఆ తరువాత అందలం అందీ అందగానే ఆయనను అటకెక్కించారు. తర్వాత అబ్బాయ్‌ జూనియర్ ఎన్టీర్ను  వాటేసుకున్నారు. సుబ్బరంగా  ప్రచారం చేయించేసుకున్నారు. తర్వాత సేమ్ సీన్ రిపీట్.  గతంలో తండ్రిని ఏ విధంగా పక్కన పెట్టారో కొడుకునూ ఇప్పుడు అదే విధంగా సైడ్ చేశారు. మళ్లీ తాజాగా తండ్రికి మరోసారి హ్యాండిచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.



 టీడీపీలో హరికృష్ణ-జూనియర్ ఎన్టీఆర్‌లకు ప్రాధాన్య ఇవ్వడంలేదని  తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు.  అన్నగారు స్థాపించిన పార్టీలోనే అన్నగారి కొడుకుకు, మనవడికి చెప్పుకోలేని కష్టం వచ్చిందని గుసగుసలాడుతున్నారు. ముఖ్యంగా సీటు విషయంలో సీతయ్యతో బావ చంద్రబాబు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి.



 హరికృష్ణ మొదట హిందూపురంపై మనసు పడ్డారు. ఆ విషయాన్ని పొలిట్‌బ్యూరో సమావేశంలోనే ఆయన చెప్పారు. అయితే అదే స్థానాన్ని  తమ్ముడు బాలకృష్ణ కొట్టుకుపోయారు.  ఆయన అట్టహాసంగా నామినేషన్ కూడా వేసేశారు. హిందూపురం పోవడంతో హరికృష్ణ కన్ను ఈసారి కృష్ణా జిల్లాపై పడింది. అక్కడ ఏదో ఒక నియోజవకర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.  పెనమలూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.  అదీ కూడా అందని ద్రాక్షే అయింది.



హరికృష్ణ సీటు అడగలేదు, అడిగితే ఇచ్చేవాళ్లమే... అంటూ టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఈ వ్యాఖ్యలపై సీతయ్య మండిపడ్డారు. హిందూపురం లేదా పెనమలూరు ఇవ్వాలని పాదయాత్ర సమయంలోనే బాబును అడిగానని కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం సృష్టించాయి.  పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టిన చంద్రబాబు  విజయవాడ తూర్పు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఇస్తానంటూ హరికృష్ణను బుజ్జగించేప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఐతే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఇక విజయవాడ తూర్పు స్థానం నుంచి సీనియర్ నేత గద్దె రామ్మోహన్ తన తరపున భార్య అనూరాధతో నామినేషన్ వేయించారు. ఈ నేపథ్యంలో సీతయ్యకు సీటు కేటాయింపు పెద్ద సస్పెన్స్‌గా మారింది.



ఇదిలా ఉంటే,  గత ఎన్నికలలో ఉధృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్  ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అవసరానికి బాగా వినియోగించుకున్న పార్టీ ఇప్పుడు ఆయనను పట్టించుకునే పరిస్థితిలేదు. అంతే కాకుండా  టీడీపీ తరపున ప్రచారం చేయమని ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదని బాబాయి బాలకృష్ణ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top