ఓడిపోతా.. గిన్నిస్ బుక్ ఎక్కేస్తా!!

ఓడిపోతా.. గిన్నిస్ బుక్ ఎక్కేస్తా!! - Sakshi


గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే అందరికీ ఇష్టమే. అయితే దాన్ని సాధించడానికి ఒక్కొక్కళ్లు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఎన్నికలు కూడా గిన్నిస్ రికార్డ్స్కు దగ్గర దారి అనే విషయం మీకు తెలుసా? నరేంద్రనాథ్ దూబే అనే ఆయన ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకున్నాడు. ఎన్నికల్లో అత్యంత ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా తాను గిన్నిస్ రికార్డులలోకి ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ ఆయనకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడో.. 1984లో. వచ్చిందే తడవుగా అమలుచేయడం మొదలుపెట్టాడు. మునిసిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఏ ఒక్క ఎన్నికనూ వదలకుండా ప్రతిదాంట్లో పోటీ చేయడం.. వరుసపెట్టి ఓడిపోవడం ఇదే ఆయనకు బాగా అలవాటైపోయిన విషయం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పొరపాటునైనా గెలవని నరేంద్రనాథ్, ఈసారి కూడా అదే మాటకు కట్టుబడి ఉంటానని ఘంటాపథంగా చెబుతున్నాడు.



ఈయన మొట్టమొదటిసారిగా 1984 ఎన్నికల్లో వారణాసి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని చెరాల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఆ తర్వాత మునిసిపాలిటీ స్థాయి నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పలు ఎన్నికల్లో పోటీచేసి, అప్రతిహతంగా తన పరాజయ పరంపరను ఏమాత్రం వదలకుండా కొనసాగించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి జనశక్తి ఏకతా పార్టీ అభ్యర్థిగా దూబే బరిలోకి దిగారు. గిన్నిస్ రికార్డు సాధించడమే తన ఏకైక లక్ష్యమని, ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే ఓడి తీరుతానని ఈ ఓటు వీరుడు ధీమాగా చెబుతున్నారు.



ఇప్పటివరకు అత్యంత ఎక్కువ సార్లు ఎన్నికల్లో పోటీచేసి, ఓడిపోయిన రికార్డు మాత్రం కెనడాకు చెందిన జాన్ టర్మెల్ అనే పెద్దమనిషి పేరుమీద ఉంది. 63 ఏళ్ల ఈ పెద్దమనిషి ఇంతవరకు 80 ఎన్నికల్లో పోటీచేసి, 79 సార్లు అప్రతిహతంగా ఓడిపోయాడు. ఒక్కసారి మాత్రం పొరపాటున ఎలాగోలా గెలిచేశారు. అయినా కూడా ఎక్కువసార్లు పోటీచేసి, ఓడిపోయిన గిన్నిస్ రికార్డు ఈయన పేరుమీదే ఉంది. 28 ఏళ్ల వయసులో తొలిసారి ఒటావా వెస్ట్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు కేవలం 193 ఓట్లు మాత్రమే లభించాయి. మొన్న కూడా 2014 ఫిబ్రవరి నెలలో జరిగిన ప్రొవిన్షియల్ ఉప ఎన్నికల్లో పాపర్ పార్టీ తరఫున పోటీచేసి 49 ఓట్లు సాధించి ఓడిపోయాడు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top