నమో.. నమః


కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పర్యటన కమలనాథుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభ విజయవంతం కావడంతో ఆ పార్టీలో జోష్ రెట్టింపైంది.

 

 అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా వచ్చినా.. స్టేడియం ప్రజలతో నిండిపోవడం, మోడీ ప్రసంగానికి విశేష స్పందన లభించడంతో బీజేపీ నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇటీవల ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సభ జరిగిన అంబేద్కర్ స్టేడియంలోనే మోడీ సభ  నిర్వహించి కాంగ్రెస్‌కు సవాల్ విసిరినట్లు భావిస్తున్నారు.

 

 ఆకట్టుకున్న మోడీ ప్రసంగం

 బహిరంగసభలో నరేంద్రమోడీ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన తన ప్రసంగంలో తెలంగాణ అంశంతోపాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలను ఎండగట్టడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని 2009లో కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో తాను చెప్పిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు. కానీ తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి నెగ్గించిన ఘనత తమేదనని వివరించారు.

 

 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తీరును తల్లిని చంపి బిడ్డకు పురుడుపోసినట్టు ఉందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలో అధికారంలోకి రానున్న కేంద్ర ప్రభుత్వం ఆ తల్లి పాత్రను పోషిస్తుందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుటుంబపాలన తెలంగాణకు అవసరం లేదని పలుమార్లు ప్రజలతో అనిపించారు. తల్లీకొడుకులు (సోనియా, రాహుల్), తండ్రీకొడుకుల (కేసీఆర్, కేటీఆర్) పాలన తెలంగాణకు వద్దన్నారు. పలుమార్లు సభికులకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టి ఉత్సాహాన్ని నింపారు.

 

 తరలివచ్చిన అభ్యర్థులు

 జిల్లాలోని పదకొండు నియోజకవర్గాలు, ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లు, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన మిత్రపక్షాల అభ్యర్థులు సభకు హాజరయ్యారు. జగిత్యాల టీడీపీ అభ్యర్థి, టీటీడీపీ ప్రచార కమిటీ చైర్మన్  ఎల్.రమణ, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు గైర్హాజరయ్యారు. నరేంద్రమోడీ రావడానికి ముందు అభ్యర్థులు ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామగుండం అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రసంగానికి దూరంగా ఉన్నారు.

 

 అధినేత పేరెత్తని తమ్ముళ్లు

 నరేంద్రమోడీ సభకు టీడీపీ అభ్యర్థులు హాజరైనప్పటికీ ఎవరూ తమ ప్రసంగంలో తమ అధినేత చంద్రబాబునాయుడు పేరు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. తమ ప్రసంగాల్లో టీడీపీ గురించి మాట్లాడినప్పటికీ బాబు పేరును ఉచ్చరించడానికే వెనుకంజవేశారు. పెద్దపల్లి అభ్యర్థి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు మాత్రమే తన ప్రసంగంలో చంద్రబాబు పేరును ప్రస్తావించారు.

 

 ర్యాలీలతో

 హోరెత్తిన నగరం

 నరేంద్రమోడీ బహిరంగసభ సందర్భంగా జిల్లా కేంద్రం ర్యాలీలు, భారత్‌మాతాకి జై అనే నినాదాలతో హోరెత్తింది. జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి ప్రజలు సభకు తరలివచ్చారు. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ర్యాలీగా వచ్చారు. ఆయా డివిజన్ల నుంచి పార్టీ నాయకులు ఊరేగింపుగా స్టేడియంకు చేరుకున్నారు. ఓవైపు మోడీ ఫొటో, మరోవైపు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ ఫొటో ముద్రించిన టీషర్ట్‌లు ధరించిన యువకులు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top