22న మోడీ రాక


కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు దీటుగా ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఈ నెల 22న కరీంనగర్ రానున్నారు.

 

 ఇటీవల సోనియాగాంధీ సభ జరిగిన అంబేద్కర్ స్టేడియంలో మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ ఎత్తున మోడీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్, సోనియాగాంధీ సభలను తలదన్నేలా లక్షమందిని సమీకరించేందుకు బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షమైన టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

 

 నరేంద్రమోడీ 2009లో కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కరీంనగర్‌కు రావడం ఇది రెండవసారి. గుజరాత్‌లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్మారక స్తూపం ఏర్పాటు కోసం ఏక్‌తా ట్రస్టు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు గ్రామాల్లో ఇనుము, మట్టిని సేకరించారు.

 

 ఈ కార్యక్రమంతో ఊరూరా నరేంద్రమోడీకి గుర్తింపు వచ్చింది. దీంతో పాటు పార్లమెంట్‌లో బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందని, జిల్లా ప్రజల్లో సైతం ఆయన పట్ల సానుకూలత వ్యక్తమవుతోందని, ఇది గెలుపునకు దోహదం చేస్తుందని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top