బాలయ్య తొడగొడతారా?

బాలయ్య తొడగొడతారా? - Sakshi


నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకుతున్నారు. సిక్కోలు నుంచి ఆయన ప్రచారం మొదలు పెడుతున్నారు.  గత ఎన్నికల్లోనూ బాలయ్య సందడి చేశారు. అయితే ఈసారి ఆయన స్వయంగా ఎన్నికల బరిలో ఉన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తున్నారు. తన తండ్రి, సోదరుడు ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం బాలయ్య బరిలో ఉండడంతో అంచనాలు పెరిగాయి.



ఇదిలావుంచితే గత ఎన్నికల ప్రచారంలో అలరించిన బాలయ్య ఈ పర్యాయం తెలుగు తమ్ముళ్లను ఎలా ఆకట్టుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.  మీసం మీలేస్తూ, తొడ గొడుతూ గత ఎన్నికలప్పుడు బాలయ్య 'సింహా'నాదం చేశారు. సోదరి పురేందశ్వరి ఇంటి ముందు తొడ గొట్టి అభాసుపాలయ్యారు. అదేసమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి ప్రచారం చేయడంతో ఎక్కువగా ఆయనపైనే దృష్టిసారించారు. తనదైన శైలిలో బాలయ్య అక్కడక్కడ మెరుపులు మెరిపించారు. నందమూరి వారసులు ఎంతమంది ప్రచారం చేసినా టీడీపీకి విజయం దక్కలేదు.



తన నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య ఇప్పటివరకు మీసం తిప్పలేదు. కనీసం తొడ కూడా కొట్టలేదు. గతంలో కంటే బాలయ్య ఈసారి కాస్త సీరియస్ గా ఉన్నట్టు కనబడుతున్నారు. స్వయంగా పోటీ చేస్తున్నందన ఆయనలో సీరియస్ నెస్ పెరిగిందంటున్నారు. బాలయ్య ఈసారి హుందాగా ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. మీసం మేలేయడాలు, తొడగొట్టడాలు ఉండబోవని అంచనా వేస్తున్నారు.  అవి చేసినా టీడీపీ గట్టెక్కదని గత ఎన్నికలతో తేలిపోవడంతో బాలయ్య కూడా ఈ విన్యాసాల జోలికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. బాలయ్య ఏం చేస్తారో చూడాలి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top