కండువాలు మార్చారు.. కలిసొస్తుందా!


 సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్‌ఎస్ నుంచి ‘హరి’గురి జిల్లాలో అధికంగా తెలుగుదేశం నుంచి వలస పోయారు. వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో టీడీపీకి గెలిచే సీన్‌లేదని డిసైడైన ఆయన కారెక్కారు. స్థానికంగా తెలంగాణ సెంటిమెంటు, దశాబ్ధాలుగా వెన్నంటి నడిచిన అనుచరుల బలంతో మరోసారి శాసన సభ మెట్లెక్కుతాననే ధీమాతో ఉన్నారు. వరుసగా ఎన్నికవుతున్నందున సహజంగానే ప్రజావ్యతిరేకత ఉన్నా.. ఎప్పటికప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న హరీశ్వర్ ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంత తీవ్రపోటీని ఎదుర్కొంటున్నారు.



 మహేందర్‌రెడ్డిదీ అదేదారి

 టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన మరోనేత తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి. ప్రస్తుతం అదే అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశంలో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి మేనల్లుడే ఈయన. కాలక్రమంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా మహేందర్‌రెడ్డి టీడీపీని వీడలేదు. కానీ రాష్ట్రవిభజన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ మునిగిపోయే పడవ అని గుర్తించిన మహేందర్.. గులాబీ గూటికి చేరారు. సహజ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొటున్న ఆయన తెలంగాణ సెంటిమెంటుపైనే ఆశలు పెట్టుకున్నారు.  



 కేఎస్ రత్నం.. మరో యత్నం

 చేవెళ్ల శాసనసభా స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న కేఎస్ రత్నం కూడా తొలుత పసుపు పార్టీకి చెందినవారే. అనంతరం పలు పార్టీలు మారినా గత ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచే చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కారులోనే ప్రయాణిస్తున్న ఆయనకు ఎదురీత తప్పడం లేదు. నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభ కొడిగట్టడం, తెలంగాణ వాదం పెరగడం కలిసొచ్చే అంశాలైనా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో కాస్త సహజ వ్యతిరేకత కూడా ఉంది. ఇక చేవెళ్ల స్థానంలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణం క్షేత్ర స్థాయిలో బలంగా లేకపోవడం రత్నానికి ఓ ప్రతికూలత. ఈ సారి సెంటిమెంటే గట్టెక్కిస్తుందని గట్టి నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.  



 మైనంపల్లి.. అలా వెళ్లి..

 ఇక మల్కాజిగిరి పార్లమెంటుకు టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్న మైనంపల్లి హనుమంతురావు కొద్ది రోజుల క్రితం వరకూ టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరి మనిషి. గతంలో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి ఈ సారి కోరిన టికెట్ లభించని కారణంగా వయా కాంగ్రెస్.. గులాబీ గూటికి చేరారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ కోసం పార్టీలు మారిన ఆయన.. చివరికి టీఆర్‌ఎస్ నుంచి లోక్‌సభ అభ్యర్థి అయ్యారు. ఏ పార్టీ అయినా ఫర్వాలేదు.. మల్కాజిగిరి నుంనే పోటీ చేయాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకున్నారు.



 అయితే లోక్‌సభ అభ్యర్థిగా విజయం సాధించడం మైనంపల్లికి కత్తి మీదసామే. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజిగిరిలో తెలంగాణ సెంటిమెంట్ తక్కువ. కేవలం దాన్ని మాత్రమే నమ్ముకుంటే విజయం దక్కదని తెలిసే హనుమంతు అనేక వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. సెటిలర్ల ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఎదురీదుతున్న హనుమంతుకు.. తాజాగా టీఆర్‌ఎస్ కీలక నేతలు సెటిలర్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మరింత తలనొప్పిగా మారింది.



 అదేవిధంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున పోటీలో ఉన్న చింతల కనకారెడ్డి గత ఎన్నికల్లో పీఆర్పీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి ఆ పార్టీ తరఫున పోటీ చేసినవారే. విజయంపై అనేక లెక్కలు వేసుకుని జెండాలు మార్చిన వీరంతా విజయభావుటా ఎగురవేస్తారో లేదోనన్నది ఎన్నికల ఫలితాలు వెలువడితేగానీ తేలదు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top