ఎంఐఎం డబుల్ ధమాకా


సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఈ రెండు ఓట్ల సిద్ధాంతానికి ఎంఐఎం తెర లేపింది. మరో అడుగు ముందుకేసి... కాంగ్రెస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు మద్దతుగా ప్రచార శంఖం పూరించింది. జిల్లా కేంద్రంలోని 21వ డివిజన్‌లోని లక్ష్మీనగర్‌లో శుక్రవారం చల్మెడకు మద్దతుగా ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించింది. వేదికపై ప్రసంగించిన ఎంఐఎం ప్రతినిధులు తమ హైకమాండ్ ఆదేశాలను అనుసరించి సెక్యులర్ భావాలున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

 

 అందులో భాగంగానే అసెంబ్లీ అభ్యర్థి చల్మెడకు, పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంఐఎం జిల్లా కమిటీతో మాజీ కార్పొరేటర్లు, 25 డివిజన్లలో పోటీ చేసిన కార్పొరేట్ అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. పార్టీలను పట్టించుకోకుండా అభ్యర్థులను చూసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

 

 2004 ఎన్నికల్లోనూ ఇదే పంథాను అనుసరించినట్లు వెల్లడించారు. ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ వహజుద్దీన్, కార్యదర్శి గులాం అహ్మద్ హుస్సేన్, పట్టణ అధ్యక్షుడు అబ్బాస్ సమీ, కార్యదర్శి మీర్ బర్ఖత్ అలీ, జాయింట్ సెక్రెటరీ మొయిజోద్దీన్ ఖాద్రీ ఈ ప్రచార కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలో అయిదు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో దాదాపు 60 వేల ముస్లిం ఓట్లున్నాయి. కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సెగ్మెంట్లలో ఎంఐఎంకు పట్టుంది. కార్పొరేషన్‌తో పాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దింపింది. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఎంఐఎం మద్దతు ప్రధాన పార్టీల బలాబలాలకు కీలకంగా మారనుంది.

 

 ఈ తరుణంలో ఎంఐఎం తీసుకున్న నిర్ణయం.. అటు కాంగ్రెస్‌కు, ఇటు టీఆర్‌ఎస్‌కు అంతర్గతంగా చిచ్చు పెట్టినట్లయింది. స్వయంగా పార్టీలో కీలక నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు కరీంనగర్‌లో ఎంఐఎం ఈ రెండు పార్టీల ప్రచారాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, రామగుండంలో ఎంఐఎం అదే పంథాను అనుసరిస్తుందా.. ఎక్కడికక్కడే పోటీలో ఉన్న అభ్యర్థులను బట్టి తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా..? అనేది ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top