నేతల ఎజెండా.. నారింజ!


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘నారింజ’ రుచి పులుపు. పుల్లని పండును చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఆదే సూత్రాన్ని జహీరాబాద్ నేతలు ఎన్నికలకు అపాదించారు. నారింజ వాగు పులుపు చూపించి ‘ఓట్లు’ పారించే ప్రయత్నం చేస్తున్నారు. 1970 నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. జహీరాబాద్ బిలాల్‌పూర్‌లో పుట్టిన నారింజ వాగు కర్ణాటకకు తరలిపోయి అక్కడ కరంజే ప్రాజెక్టును నింపిన తర్వాత మళ్లీ తిరిగి జహీరాబాద్‌కే వచ్చి మంజీరాలో కలుస్తుంది.



ఈ వాగు గుండా ఏడాదికి 3 టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయి. వాగు కర్ణాటక రాష్టం చేరక ముందే నీళ్లను ఒడిసిపట్టుకోవాలని వైఎస్సార్ సంకల్పించారు. ఏం చేయాలో సర్వే చేసి, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులను 2009లో ఆదేశించారు. పాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైఎస్సార్ అప్పటి కప్పుడు నారింజ  వాగును మైనర్ ఇరిగేషన్ విభాగం నుంచి మేజర్ ఇరిగేషన్ విభాగం స్థాయికి పెంచారు. అధికారులు ఉరుకులు పరుగుల మీద సర్వే పూర్తి చేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు.



 అధికారులు పంపిన ప్రతిపాదనలు ఇవే..

     వాగు వద్ద వరద ప్రాంత వైశాల్యం 143.8 స్కోయర్స్‌మైల్స్, గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు.

     ఈలెక్కన నారింజ వాగు నుంచి ఏడాదికి 3 టీఎంసీల నీరు వృథాగా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది.



 వాగు కర్ణాటకలోకి ప్రవేశించడానికి ముందే సింగూరుకు మళ్లిస్తే కనీసం ఒక టీఎంసీ నీళ్లను జహీరాబాద్ నియోజకవర్గం రైతులక అందించవచ్చని అధికారులు నిర్ధారించారు.



 వాగును  మళ్లించడానికి  జహీరాబాద్ మండలం అల్గొల్ గ్రామం అనువైన ప్రాంతంగా  గుర్తించారు.



 అల్గొల్ గ్రామం నుంచి  కాల్వ తవ్వకాలు మొదలు పెట్టి  ఝరాసంగం  మండలం మేదపల్లి గ్రామంలోని కొత్త చెరువులకు కలపాలి..  అక్కడి నుంచి జీర్లపల్లి చెరువు మీదుగా దుబ్బవాగును కలపాలి. అక్కడి నుంచి నీటిని సింగూరులోకి మళ్లించాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు.



ఈ మొత్తం కాల్వ దూరం కేవలం 15.35 కిలోమీటర్లు మాత్రమే  ఉంటుందని నిర్ధారించారు.  



 {పాజెక్టు పనులు, కాల్వ నిర్మాణం కోసం రూ. 67.66 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు.



 ఇలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులు  వైఎస్సార్ ప్రభుత్వానికి పంపారు. అనుకోని ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఈ ప్రతిపాదనల ఫైల్‌ను అటకమీద పెట్టారు. ఆ తరువాత వచ్చిన నాయకులు ఎవరూ కూడా నారింజ వాగు వైపునకు చూడలేదు.



  2009లోనే నారింజ వాగుపై వంతెన కట్టి ఆ నీళ్లను సింగూరుకు పంపాలని  వైఎస్సార్ ప్రభుత్వం సిద్దం చేసిన ప్రతిపాదనలను ఆయన మరణం తరువాత  చెత్త బుట్టలో వేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ నారింజ తొనలను వలిసి ఆ ప్రాంత రైతుల నోళ్లు ఊరించేందుకు అన్ని పార్టీల నేతలు సిద్దమయ్యారు. నారింజ నీళ్ల పులుపెంతో మేం రుచి చూపిస్తామంటే... మేమె రుచి రుపిస్తామని రైతుల నోళ్లు ఊరిస్తున్నారు.



  వృథాగా జలం....

 జహీరాబాద్ మండలం బిలాల్‌పూర్ గ్రామంలో పుట్టిన నారింజ వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా నేరుగా కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్లి.. తిరిగి మళ్లీ తెలంగాణలోకే వస్తుంది. వృథాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకుని సాగు అవసరాలను తీర్చుకోవడం కోసం 1970లో జహీరాబాద్ మండలం కొత్తూరు వద్ద రూ. కోటి వ్యయంతో రెగ్యులేటర్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జీ కట్టిన రెండేళ్లకే గేట్లు తెరిచి నీళ్లు  బయటికి వదిలారు.



తరువాత గేట్లకు కొద్దిపాటి రిపేర్లు చేయించి  భూగర్భ జలాలు  మట్టం పెరిగే విధంగా నీళ్లు నిల్వ చేస్తున్నారు. ఇలా వెళ్లిన జలాలను ఒడిసిపట్టుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం నారింజ వాగు మీద కరంజా ప్రాజెక్టు కట్టింది. అది నిండిన తరువాత అదనపు నీళ్లను వదిలితే అవి మళ్లీ మన రాష్ట్రం వైపే ప్రయాణం చేస్తాయి. ఈ నీరు తిరిగి మంజీరాలో కలిసి సింగూరు చేరుతాయి.  నీళ్లు కరంజాకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి మంజీరాకు వచ్చి సింగూరును నింపే బదులు నేరుగా సింగూరుకు తరలించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top