చివరి బంతికి హిట్ వికెట్

చివరి బంతికి హిట్ వికెట్ - Sakshi


చేతులెత్తేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి

ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మాజీ సీఎం

 

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులెత్తేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి క్రికెట్ పరిభాషలో మాట్లాడి, రాష్ట్ర విభజనలోనూ అదే భాష ఉపయోగిస్తూ.. చివరి బంతి మిగిలే ఉందని అంటుండేవారు. తీరా చివరి బంతి వచ్చేసరికి ఆయనంతట ఆయనే హిట్ వికెట్‌తో ఔటైపోయారు. నామినేషన్ల చివరి రోజున ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి తన సోదరుడిని పోటీకి దింపి, ఆయన వెనక్కొచ్చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడున్నరేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించి, సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్ తీరా ఎన్నికలొచ్చేసరికి తప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటమి తప్పదనే ఆందోళనతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కిరణ్ వాయల్పాడు నుంచి మూడుసార్లు గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పీలేరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. రోశయ్య తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇటీవలి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జేఎస్పీ అభ్యర్థులను బరిలోకి దించాలని భావించారు. తాను పీలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య శనివారం ఉదయం పీలేరు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన తమ్ముడు కిషన్‌కుమార్‌రెడ్డి (కిశోర్‌కుమార్‌రెడ్డి)తో నామినేషన్ వేయించి వెనుదిరిగారు. అక్కడి నుంచి రోడ్‌షోగా బయల్దేరారు. తాను రాష్ట్రమంతా తిరగాల్సి ఉన్నందున, పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. కిరణ్ రాజకీయ భవితవ్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న సంకేతాలున్న కారణంగానే ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈసారిపోటీ చేయకూడదని ఆయన కొద్ది రోజుల కిందటే నిర్ణయానికొచ్చినప్పటికీ, ఓ పార్టీ అధ్యక్షుడిగా పోటీలో లేకపోతే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతోనే నామినేషన్ల చివరి రోజున సోదరుడిని బరిలో దింపి, ఆయన తప్పుకున్నట్లు సమాచారం. జై సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటే కిరణ్ ఎన్నికల బరిలో నిలిచేవారేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేయడంలోని ఉద్దేశమే వేరని, అలాంటప్పుడు ఎందుకు పోటీ చేస్తారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీని స్థానించారని, ఓట్ల చీలిక ద్వారా టీడీపీకి ప్రయోజనం చేకూర్చాలన్నది కిరణ్ ఆలోచన అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 అయోమయంలో జేఎస్పీ అభ్యర్థులు

 

 సమైక్య ఛాంపియన్లుగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, సీపీఎంతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. చివర్లో పార్టీకి కెప్టెన్‌లాంటి కిరణ్ బ్యాటొదిలేసి క్రీజు నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కిరణ్ తీరుపై మండిపడుతున్నారు. పలువురు అభ్యర్థులు రంగం నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top