ఏటికి ఎదురీత

ఏటికి ఎదురీత


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కింజరాపు బాబాయ్, అబ్బాయ్‌ల ఆరాటానికి రాజకీయ పరిణామాలు ఏమాత్రం సహకరించడం లేదు. టెక్కలిలో పట్టుకోసం అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దాంతో నిర్వేదానికి గురవుతున్న ఆయన బెదిరింపులు, దాడులకు పురికొల్పుతూ మరింత వివాదాస్పదంగా మారుతున్నారు. మరోవైపు.. పార్టీ లో ముదిరిపోయిన వర్గ రాజకీయాలు రామ్మోహన్ నాయుడుకు ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా ఆధిక్యం సాధించలేని స్థితిని కల్పిస్తున్నాయి. ప్రతికూలంగా ఉన్న సామాజికవర్గ సమీకరణలు, వెన్నాడుతున్న ‘థర్మల్’ పాపాలు, సహకరించని సీనియర్లు, జారిపోతున్న జూనియర్లతో కింజరాపు కుటుంబం రాజకీయంగా పట్టు కోల్పోతోంది.

 

 అచ్చెన్నకు కొరుకుడుపడని టెక్కలి

 ఐదేళ్లవుతున్నా టెక్కలి నియోకజవర్గంలో కింజరాపు అచ్చెన్నాయుడుకు ఏమాత్రం పట్టు చిక్కడం లేదు. పైకి ఎగబాకాలని ఎంత ప్రయత్నిస్తున్నా మరింత కిందకు జారిపోతున్నారు. సామాజికవర్గ సమీకరణలు ఆయనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. థర్మల్ ప్లాంటుకు మద్దతిచ్చి రైతులు, మత్స్యకారుల ఆగ్రహానికి గురయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి గడప ఎక్కి దిగుతున్నా అచ్చెన్న రాజకీయ కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు.

 

 బెడిసికొడుతున్న ప్రయత్నాలు

 అచ్చెన్న ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఉద్యోగులు, వ్యాపార  వర్గాలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆనాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ వర్గాలు ఇప్పటికీ ఆయన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇక కాళింగ, మత్స్యకారవర్గాలు అచ్చెన్న అంటేనే మండిపడుతున్నాయి. ఇటీవల ఆయన తన సన్నిహితుడు ఎల్.ఎల్.నాయుడు ద్వారా కాళింగ సామాజిక వర్గాన్ని బుజ్జగించేందుకు యత్నించారు. టెక్కలి, నందిగాం మండలాల్లోని ఆ వర్గీయులతో మంతనాలు సాగించారు. అయ్యిందేదో అయిపోయింది ఈసారి తనకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై కాళింగ వర్గ నేతలు తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. కాళింగ సామాజికవర్గానికి కింజరాపు కుటుంబం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని వారు విరుచుకుపడ్డారు. టెక్కలి, నందిగాం మండలాల్లో తమ సత్తా చూపుతామని.. అచ్చెన్నను ఓడిస్తామని తెగేసి చెప్పారు. దాంతో విచక్షణ కోల్పోయిన అచ్చెన్న ఆ వర్గీయుతో ఘర్షణకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

 

 ఆ తర్వాత రెండ్రోజుల్లోనే అచ్చెన్న వర్గీయులు నందిగాం మండలంలో దాడులకు పాల్పడ్డారు. అంతేకాదు మున్ముందు కాళింగ వర్గీయుల సంగతి తేలుస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంతబొమ్మాళి మండలంలో అచ్చెన్నకు ఉన్న అంతో ఇంతో పట్టును థర్మల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం తుడిచిపెట్టేసింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందినప్పటికీ అచ్చెన్న నిర్భీతిగా థర్మల్ ప్లాంట్‌కు మద్దతిచ్చారు. అంతేకాదు థర్మల్ వ్యతిరేక ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయింపజేసి వేధించారు. దాంతో మత్స్యకారులు, రైతులు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో వీరిని బుజ్జగించేందుకు అచ్చెన్న, రామ్మోహన్‌లు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇటీవల సంతబొమ్మాళి మండలంలో నిర్వహించిన సమావేశంలో మత్స్యకారులు తమ వైఖరిని తెగేసి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కింజరాపు కుటుంబానికి మద్దతివ్వమని తేల్చేశారు. ఈ పరిణామాలతో టెక్కలి నియోజకవర్గంపై ఆశ వదిలేసుకోవచ్చని కింజరాపు కుటుంబం దాదాపు నిర్ధారణకు వచ్చేసింది.

 

 రామ్మోహన్‌ను చుట్టుముట్టిన ప్రతికూలత

 భారీ అంచనాలతో విడుదలైన సినిమా.. బాక్సాఫీసు వద్ద ఢమాల్ మన్నట్లుగా ఉంది రామ్మోహన్‌నాయుడి పరిస్థితి. ఎర్రన్నాయుడి రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయనకు లోక్‌సభ నియోజకవర్గంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టాయి. గతంలో ఎర్రన్నాయుడు నడిపిన వర్గ రాజకీయాలు, అచ్చెన్న దుందుడుకు విధానాలు రామ్మోహన్‌కు శాపంగా పరిణమించాయి. అప్పుడే తండ్రి స్థాయిలో వర్గ రాజకీయాలు నడపాలన్న రామ్మోహన్ ఆత్రుత కూడా కొంప ముంచుతోంది.  పలాసలో శివాజీకి పొగబెట్టాలన్న ఎత్తుగడ ఇప్పటికే బెడిసికొట్టింది. శివాజీని ఓడించేందుకు వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్యను అచ్చెన్న ప్రోత్సహించారు. దాంతో గౌతు, మద్దిల మధ్య విభేదాలు పూడ్చలేని స్థాయికి చేరాయి. ఫలితం.. మద్దిల చిన్నయ్య జైసమైక్యాంధ్ర పార్టీలో చేరారు. దాంతో పలాస నియోజకవర్గంలో రామ్మోహన్‌నాయుడు ఓట్లకూ గండిపడుతోంది.

 

   శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవికి వ్యతిరేకంగా టీడీపీలోని మాజీ కౌన్సిలర్లను కింజరాపు కుటుంబం ప్రోత్సహిస్తోంది. వారు లక్ష్మీదేవితోపాటు ప్రచారంలో పాల్గొనడం లేదు. దీన్ని గుర్తించిన గుండ వర్గం అరసవల్లి, గుజరాతీపేట తదితర ప్రాంతాల్లోని తమ వర్గీయులతో రామ్మోహన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.   పాతపట్నం నియోజకవర్గంలో రామ్మోహన్‌నాయుడుకు ఏమాత్రం ఆశలు లేకుండాపోయాయి. ఇటీవల పార్టీలో చేరిన శత్రుచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మాత్రమే ఓటు వేయాలని.. ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ చెప్పేస్తున్నారు. అంటే రామ్మోహన్‌కు వేయాల్సిన అవసరం లేదని పరోక్షంగా తేల్చేస్తున్నారు.   ఆమదాలవలసలో కూన రవిపై పెట్టుకున్న ఆశలు ఫలించేలా లేవని కింజరాపు శిబిరం నిర్ధారణకు వచ్చేసింది. సొంత మండలం పొందూరులోనే పట్టు కోల్పోయిన కూన ఇక తమకు ఉపయోగపడడని గ్రహించి డీలా పడుతోంది.

 

   నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ విజయాన్ని అడ్డుకోలేమని గుర్తించిన టీడీపీ, ఆయనకు భారీ మెజార్టీ రాకుండా అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవని తేలిపోయింది. నియోజకవర్గంలో ఏ ఒక్క మండలంలో కూడా వైఎస్సార్‌సీపీకి కనీసం పోటీ ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ కూరుకుపోయింది.   ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది టీడీపీ పరిస్థితి. నానా యాగీ చేసి మరీ బీజేపీకి కేటాయించిన స్థానాన్ని టీడీపీకి సాధించారు. కానీ పార్టీ అభ్యర్థి బెందాళం అశోక్ సొంత మండలం కవిటిలో కూడా పట్టు సాధించలేకపోతున్నారు. దీనిపై రామ్మోహన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.ఈ పరిణామాలతో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీ ఆధిక్యం సాధిస్తుందన్న నమ్మకం లేకుండాపోతోంది. అటు టెక్కలి ఎమ్మెల్యే సీటు ఎలాగూ పోతోంది.. కనీసం శ్రీకాకుళం ఎంపీ స్థానాన్నైనా సాధించాలన్న లక్ష్యం నెరవేరదని స్పష్టమవటంతో కింజరాపు కుటుంబం ఆందోళన చెందుతోంది. ఏం చేయాలో తెలియని స్థితిలో తప్పుల మీద తప్పులు చేస్తూ నిర్వేదంలో కూరుకుపోతోంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top