పచ్చని పాలమూరు


 ‘గులాబీ దళపతి’ కేసీఆర్  జిల్లాకు వచ్చి హామీల వాన కురిపించారు. ‘సార్వత్రిక’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కడితేనే ప్రజల స్వప్న సాకారమవుతుందన్నారు. పచ్చని పాలమూరుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో రెండు జిల్లాలుగా విభజించి పాలనలో ప్రత్యేకతను చాటుతామన్నారు. ఇక్కడి వారు వలసలు వెళ్లడం కాదనీ...ఇతర ప్రాంతాల వారే ఇక్కడకు వచ్చేలా మహబూబ్ నగర్‌ను తీర్చిదిద్దుతామన్నారు. సాగు,తాగు నీరు అందించడం లక్ష్యంగా చెప్పారు. అదే సమయంలో ప్రత్యర్థులనూ ఏకిపారేశారు.   

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ న్యూస్‌లైన్, వనపర్తి: ‘వలసలు, కరువుతో పాలగారే పాలమూరు జిల్లా ఆగమైంది. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా అంటూ ఇక్కడి కవులు ప్రజల కడగండ్లకు అద్దం పట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కథ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి పచ్చని పాలమూరుగా తీర్చిదిద్దుతామని’ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ‘ఎన్నికల జనభేరి’ పేరిట వనపర్తి, మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘పాలమూరు నుంచి ముంబైకి వలస వెళ్లడం కాదు.

 

 ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు జనం వలస వచ్చేలా చూస్తామంటూ’ కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆర్‌డీఎస్ నీటిని అక్రమంగా తరలించడాన్ని నిరసిస్తూ అలంపూర్ నుంచి పాదయాత్ర చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ‘కృష్ణా నది నుంచి నీటికి అక్రమంగా తరలించి నిర్మించి హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన సీమాంధ్ర మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన యాత్రకు పొన్నాల లక్ష్మయ్య జెండా ఊపారని విమర్శించారు. వీర తిలకం దిద్దిన వ్యక్తి డీకే అరుణ’ అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. షాద్‌నగర్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

 మహబూబ్‌నగర్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన నీరు అందిస్తామని ప్రకటించారు. ‘తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏనాడూ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు రుచి చూడలేదు. పదవులు పట్టుకుని వేలాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ భాగస్వాములు కాలేదని’ విమర్శలు గుప్పించారు. ‘దేశంలో రాజకీయాలు చూసేందుకు లక్షా తొంభైమంది ఉన్నారు. ముందు మన కొంప సంగతి చూసుకుందాం. కేంద్రంలో సంకీర్ణ యుగం నడుస్తోంది. పార్లమెంటులో 17 మంది ఎంపీలుంటే డిమాండ్లు సాధించుకోవచ్చు.’అంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

 

 మరో రెండు జిల్లాలు

 మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా వనపర్తి, నాగర్‌కర్నూలు కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రభుత్వంలో లేకపోతే అన్ని సమస్యలు పరిష్కరించలేము. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని’ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్, పేదలకు సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూం ఇల్లు వంటి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను కేసీఆర్ పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, బెక్కం జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, షాద్‌నగర్ కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్, పీసీసీ సంయుక్త కార్యదర్శి సాధు వెంకటరెడ్డి తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు మంద జగన్నాధం, ఏపీ జితేందర్‌రెడ్డి , ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, గురునాథ్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, ఎల్లారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మంద శ్రీనాథ్, నిరంజన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కృష్ణమోహన్‌రెడ్డిని  కేసీఆర్ సభకు పరిచయం చేశారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top