దారిలోకొచ్చిన కేసిఆర్

కెసిఆర్ - Sakshi


అనేక విషయాలలో చెప్పిన మాట తప్పాడని టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావు(కెసిఆర్)పై ఎడాపెడా విమర్శల దాడి జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగే సమయంలో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలుత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చెప్పారు. ముస్లీంలను ఆకట్టుకోవడం కోసం ముస్లీంని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని కూడా చెప్పారు. మరో ముఖ్య అంశం ఏమిటంటే తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆ ఊసులేమీలేవు. కాంగ్రెస్లో విలీనం గానీ, ఆ పార్టీతో పొత్తుగానీ లేకుండా టిఆర్ఎస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి  దిగింది. దళిత ముఖ్యమంత్రి అంశమే ప్రస్తావించడంలేదు.



కాంగ్రెస్లో విలీనం ప్రసక్తేలేదని, స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు కెసిఆర్  ప్రకటించారు. తెలంగాణ పునర్మిర్మాణంలో తాము ప్రధాన భాగస్వాములుకావాలన్నది తమ ఆకాంక్షగా చెప్పారు. ఉద్యమం ఇంతటితో ఆగలేదని, పునర్మిర్మాణం ప్రధానమైనదన్నారు. దళిత ముఖ్యమంత్రి మాట గాలికి వదిలేశారు. ఈ నేపధ్యంలో కెసిఆర్పైన, టిఆర్ఎస్పైన తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. దాదాపు అందరూ ఆయనపై ధ్వజమెత్తారు. కెసిఆర్ మాటమీద నిలబడరని తేల్చారు.



ఈ పరిస్థితులలో ఇలా అయితే కెసిఆర్ కష్టమనుకున్నారో ఏమో  తెలియదు. తాను అన్న మాటలు అక్షరాల నిజం. ఆ అంశాలను ఎత్తని మాట కూడా నిజమే. ఎన్నికల సమయం గదా జాగ్రత్తగా ఉండాలనుకున్నట్లు ఉన్నారు. చివరకు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లీలకు ఇస్తామని ఈ రోజు  కరీంనగర్ సభలో కెసిఆర్ ప్రకటిచారు. విమర్శల దాటికి తట్టుకోలేక కనీసం ఏదో ఒక్క మాటైనా నిలబెట్టుకోవాలని అనుకున్నారో ఏమో ఈ ప్రకటన చేశారు. ఆ రకంగా ఆయన కొంతలో కొంత దారిలోకి వచ్చినట్లుగా భావిస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top