బాబు దేశద్రోహి

బాబు దేశద్రోహి - Sakshi


బీజేపీతో పొత్తు... దేశానికే హాని

*   ఇది మత శక్తులకు కొమ్ముకాయడమే

*   మత ఘర్షణలకు ఊతమివ్వడమే

*  జగన్ భయంతోనే ఈ ఎత్తుగడ


 

 చంద్రబాబు కేవలం స్వప్రయోజనాల కోసమే బీజేపీతో అంటకాగుతున్నారంటూ ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య ధ్వజమెత్తారు. పైగా అది దేశ ప్రయోజనాల కోసమేనంటూ పచ్చి మోసానికి దిగుతున్నారని విమర్శిం చారు. గుజరాత్‌లో ‘మోడీ మారణకాండ’పై కనీసం నోరైనా మెదపని బాబు తీరును జనం మర్చిపోలేదని హెచ్చరించారు. బీజేపీతో పొత్తు ద్వారా దేశాన్ని మతవాదం చేతుల్లో పెట్టాలన్న బాబు యత్నాలను ప్రజాస్వామ్యవాదులెవరూ క్షమించబోరన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు, టీఆర్‌ఎస్ వైఖరి తదితరాలపై ‘సాక్షి’తో ఆయన తన మనోగతాన్ని పంచు కున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 

మైనారిటీల గుండె మంటల సాక్షిగా చంద్రబాబు ద్రోహే! కన్నీరు పెడుతున్న ప్రజాస్వామ్యం సాక్షిగా చంద్రబాబు దేశద్రోహే! బడుగు జీవితాలను బీజేపీ బలిపీఠం మీదికి ఎక్కించిన బాబు క్షమార్హుడా?తాజా ఎన్నికల చిత్రంలో ఇదో భయానక దృశ్యమనే చెప్పాలి. బీజేపీ, టీడీపీ పొత్తు అన్ని వర్గాలనూ ఆందోళన పరుస్తున్న వాస్తవమని గుర్తించాలి. గుజరాత్ మారణకాండ గుర్తున్న ప్రతి గుండె వేసే ప్రశ్నకు బాబు ఇచ్చే సమాధానం ఏమిటి? ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆలింగనం చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటి? మోడీని భుజానికెత్తుకున్న బాబు... జరగబోయే నరమేధానికి ఇచ్చే బదులేమిటి? ఓటేసే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరముంది.

 

 కల్లబొల్లి మాటలెందుకు?

 దేశ ప్రయోజనాల కోసమే ‘మోడీ’ నామస్మరణ చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకోవడం అవకాశవాదమే. కాంగ్రెస్‌ను వ్యతిరేకించడమే అజెండా అనడం పచ్చిమోసమే. దేశ ప్రయోజనాలే బాబు లక్ష్యమైతే గుజరాత్‌లో నరేంద్ర మోడీ సృష్టించిన మారణకాండను ఎందుకు ఖండించలేదు? కనీసం నోరు కూడా మెదపని బాబు వైఖరిని ప్రజలింకా మరచిపోలేదు. రక్తం ఏరులై పారించిన వ్యక్తిని ప్రధాని చేయాలనుకోవడం టీడీపీ చరిత్రాత్మక తప్పిదమే. ఆర్‌ఎస్‌ఎస్ పునాదులపై ఎదిగిన బీజేపీతో, నరేంద్రమోడీతో ఏకమవడం పెను ప్రమాదమని బాబుకు తెలియదా? తెలిసీ వారి అడుగులో అడుగేయడం స్వప్రయోజనాలకే కాదా? యావత్ ప్రజాస్వామ్య దేశాన్ని అపహాస్యం చేస్తూ, దేశాన్ని మతవాదానికి అప్పగించాలనుకోవడం దుర్మార్గ చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎంతమాత్రమూ క్షమించరు.

 

జగన్ భయం పట్టుకుందా?

 టీడీపీ ఈ ఎన్నికల్లో నైతికంగా దిగజారింది. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూసి బెంబేలెత్తుతున్నట్టు కన్పిస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయపడుతోంది. దాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. కానీ, ఇదెంత ప్రమాదకరమో ఊహించకపోవడం దారుణం. దేశానికి ఎంత నష్టం కలిగిస్తుందో పట్టించుకోకపోవడం ఘోరాతిఘోరం. వైఎస్సార్‌సీపీ విజయావకాశాలను టీడీపీ కేవలం సామాజికవర్గ విశ్లేషణల నుంచే చూస్తోంది. దాంతో తమ సామాజికవర్గం పట్టు కోల్పోతుందని భావిస్తోంది. కానీ పొత్తులతో క్రైస్తవులు, ఇతర మైనారిటీలకు పెనుముప్పు వాటిల్లుతుందని ఎంతమాత్రం ఆలోచించడం లేదు.

 

ఈ ప్రశ్నలకు బదులేది?

 బీజేపీ బాట పట్టిన బాబు ఈ దేశంలో అణగారిన వర్గాల ఆందోళనకు బదులు చెప్పాలి. మత హింసకు కేంద్ర బిందువైన బీజేపీ రేపు తమ ఎజెండాను అమలు పరిచే ఆస్కారముంది. అప్పుడు మైనారిటీలకు భద్రత ఉండదు. అనునిత్యం దాడులతో హడలిపోయే పరిస్థితి వస్తుంది. ఏకస్వామ్య విధానంలో నోరెత్తలేని దుస్థితి ఎదురు కావచ్చు. క్రైస్తవుల స్వేచ్ఛ హరించే ప్రమాదముంది. బీజేపీని వెనుక నుంచి నడిపించేది ఆర్‌ఎస్‌ఎస్ అనేది సుస్పష్టం. అందుకే ఈ తరహా ఆందోళనలు సమాజంలో కన్పిస్తున్నాయి.

 

 ఇదే భవిష్యత్‌లో నిజమైతే, పాకిస్థాన్ కేంద్రంగా కత్తులు దూసే ఉగ్రవాదానికి కారణమెవరు? బంగ్లాదేశ్‌తో కలిసి కొన్ని శక్తులు యుద్ధానికి సిద్ధమైతే అడ్డుకునేదెవరు? దీనికి బాబే జవాబుదారీ కావాలి. స్వయంగా మద్దతిస్తున్నందుకు ఆయనే దోషిగా నిలబడాలి. అనుక్షణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బాబు, ప్రమాదకరమైన పార్టీలతో మమేకమవడం నేరం కాదా? ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ప్రతినిధిగా, ప్రజాస్వామ్య విలువలు ఏమాత్రం లేని మోడీని సమర్థించడం బాబు తప్పిదం కాదా? బీజేపీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించింది? కార్గిల్ యుద్ధం దాని స్వీయ ప్రయోజనాలకు కాదా?

 

 మోడీ బీసీ కార్డు బూటకం

 మోడీకి బీసీ కార్డు తగిలించడం ఓ బూటకం. పెట్టుబడిదారుల గుప్పిట్లోంచి వచ్చిన ఆయన, ఆ ముసుగుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడివర్గాలు తమ అవసరాల కోసమే మోడీని నెత్తికెత్తుకున్నాయి. నిరంకుశ విధానాలే తెలిసిన మోడీ ప్రజల పక్షం ఉండరనేది జగమెరిగిన సత్యం. పైగా కొన్ని వర్గాలను శత్రువులుగా భావించే ఆయన నైజం దేశంలో అభద్రతకు, అశాంతికి కారణం కావచ్చు.

 

వసూళ్ల పార్టీ టీఆర్‌ఎస్

 తెలంగాణ సాకారమైనప్పటికీ... దాని వెంటే ప్రమాదం పొంచి ఉంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలనే తపనతో ఉంది. అదే జరిగితే పది జిల్లాల తెలంగాణకు పాతర పెట్టినట్టే. తెలంగాణ మరో 40 ఏళ్లు వెనక్కు పోతుందనే భయముంది. సాంఘిక, ఆర్థిక, సామాజిక సంక్షోభానికి తెర తీసినట్టే. నిజానికి టీఆర్‌ఎస్‌కు, ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరి పోలికలున్నాయి. బెదిరింపులు, వసూళ్లే ఈ రెండు పార్టీల నైజం. ఇది నిజం కాకపోతే టీఆర్‌ఎస్‌కు అన్ని వందల కోట్లెక్కడివి? ఉద్యమంలో ఉండి అంత సంపాదించడం సాధ్యమా? ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఒక్కో నేతా కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నాడు? నాలాంటి వాళ్లు మాట్లాడితేనే టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి బెదిరించే స్థాయికి దిగారంటే, ఇది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి దగ్గరగా ఉన్నట్టే కదా! అలాంటి పార్టీ గెలిస్తే  ప్రశ్నించే అవకాశముంటుందా? కేసీఆర్ కుటుంబంలోని ప్రతి వ్యక్తీ నాయకుడయ్యారు. ఇదెలా సాధ్యం? తెలంగాణ కోసం ఎంతోమంది బలయితే, బడుగు, బలహీనవర్గాలు ఆహుతైతే, వాళ్లంతా ఏమయ్యారు? ఇలా కేసీఆర్ తన ఇంటిల్లిపాదికీ టికెట్లు ఇచ్చుకోవడం రాజకీయ దిగజారుడుతనం కాదా? ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న ఒక్కళ్లనయినా టీఆర్‌ఎస్‌లో చూపించండి.

 

మైనారిటీలకు జగన్ భరోసా ఇవ్వాలి

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ విలువలతో ముందుకెళ్తోందనే చెప్పాలి. తాజా మేనిఫెస్టోను బట్టి చూస్తే దళిత, ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం అభినందనీయం. సంక్షేమాన్ని విస్మరించకపోవడం ముదావహం. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో సంక్షేమమే ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ఏలుబడి నుంచే ప్రగతి మొదలైంది. ప్రజల జీవన వికాసం వైఎస్ కాలం నుంచే కన్పిస్తోంది. ఇప్పటికీ పేదవాళ్లు ముద్ద తింటున్నారంటే ఆయన చలవనే చెప్పాలి. అవే తమ ఎజెండా అని చెబుతున్న జగన్ కొన్ని విషయాల్లో ప్రజలకు భరోసా ఇవ్వాల్సి ఉంది.


వైఎస్ పాలనలో 6,400 ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఇది అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు చేసింది. వాటిని ఆ తర్వాతి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఆ పాఠశాలలను తిరిగి నడిపిస్తానని జగన్ భరోసా ఇవ్వాలి. అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయాన్ని జనం కోరుతున్నారు. మైనారిటీలు, క్రిస్టియన్లు బీజేపీని చూసి భయపడుతున్నారు. ఆ పార్టీతో టీడీపీ అంటకాగడంతో వారిలో మరింత ఆందోళన ఎక్కువైంది. అండగా నిలబడే పార్టీల కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవబోమని వైఎస్సార్‌సీపీ భరోసా ఇస్తే వారికెంతో ఊరటగా ఉంటుంది. ఈ దిశగా రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని ఆశిద్దాం.

 

సత్తా లేని జేపీకి మీడియా బాకా

శక్తి లేని నేతను కొన్ని పత్రికలు ఆకాశానికెత్తడం దారుణమైన విషయమే. అలాంటి వాళ్లలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయనకు జన బలమేది? కొందరు ఎన్నారైలతో పాటు కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ఆయనను బలవంతంగా లేపుతున్నాయి. భుజానికెత్తుకోవాలని చూస్తున్నాయి. ఆయా పత్రికలు స్వప్రయోజనాల కోసమే ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఆదర్శాలు చెప్పి, అసెంబ్లీ దాకా వెళ్లిన ఆయన ఈ ఐదేళ్లల్లో ఎవరిని కాపాడినట్టు? ఏనాడైనా జేపీ మైనారిటీల పక్షాన మాట్లాడారా? దళిత ప్రయోజనాలు కాపాడారా? ఏ పార్టీకైనా సామాజిక మార్పు తేగల శక్తి ఉండాలి. అలాంటి లక్షణాలు జేపీలో ఏ కోశానా కనిపించడం లేదు.

 

 ఆ పవనం.. అసందర్భపు గాలివాన

ఈసారి ఎన్నికల్లో మరో వ్యక్తి తెరమీదకొచ్చారు. అతనే పవన్ కళ్యాణ్. నిజానికి అదో గాలివాన మాత్రమే. అసందర్భంగా వచ్చిపోతుంది. ఉనికి కూడా లేని ఇలాంటి గాలివాన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. అన్న మీద కోపంతో రాజకీయాల్లోకి వచ్చినా... ఇతరత్రా కారణాలేమైనా... బీజేపీతో చేతులు కలపడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఆలోచించే యువత దీన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top