సోనియా దేవతా?: కేటీఆర్

సోనియా దేవతా?: కేటీఆర్ - Sakshi


ఇంటర్వ్యూ:  కల్వకుంట్ల తారకరామారావు

* వందలమంది బలిదానాలకు సోనియానే కారణం

* తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి


 

బోరెడ్డి అయోధ్యరెడ్డి:
తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని, అధికారంలోకి రాగానే  నెరవేరుస్తానని కరీంనగర్ సభలో పదేళ్ల కిందట చెప్పిన సోనియాగాంధీ ఆ తర్వాత ఆ విషయంలో జాప్యం చేయడం వల్లే 12వందల మంది ఆత్మత్యాగం చేసుకున్నారని టీఆర్‌ఎస్ నేత, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా ఉన్న ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణకు జరిగిన అన్యాయం, పార్టీని విలీనం చేయకపోవడానికి కారణాలు, తెలంగాణ పునర్నిర్మాణం.. తదితర అంశాలపై వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.

 

 తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దేవతని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 12వందల మందిని బలితీసుకున్న సోనియాని దేవత అని ఎలా అనాలి. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గడం వల్లే ఇంతమంది ప్రాణం త్యాగం చేసుకున్నారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ బిడ్డ యాదిరెడ్డి సాక్షాత్తూ పార్లమెంటు ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మబలిదానాలకు కారణమైన సోనియాగాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ విషయంలో సోనియాగాంధీకి సోయి తెచ్చింది టీఆర్‌ఎస్సే. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్, కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగం వృథాపోవు. తెలంగాణ ఆకాంక్షలు, దు:ఖం, ఆర్తి తెలిసిన టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

 

 షరతుల మధ్య విలీనమెలా?

 తెలంగాణ అంశంలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ తీవ్రంగా కలత చెందారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే తెలంగాణను ఏర్పాటు చేసి ఆత్మహత్యలు ఆపాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అందుకు అవసరమైతే పార్టీని విలీనం చేస్తానని ఏడాదిన్నర క్రితమే మాటిచ్చారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఆ పార్టీ నయవంచనతో ఆత్మహత్యల పరంపర కొనసాగింది. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేశారు.

 

 అందులోనూ ఎన్నో షరతులు. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం, స్థానికత ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన వంటి మెలికలు పెట్టారు. ఇన్ని షరతుల మధ్య పార్టీని ఎలా విలీనం చేస్తాం. నెలల శిశువులాంటి తెలంగాణను కాంగ్రెస్ నేతల చేతుల్లో పెడితే భావితరాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరమని ప్రజలే భావిస్తున్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలంటే టీఆర్‌ఎస్ మనుగడ సాగించాల్సిందే. తెలంగాణ కష్టం, నష్టం తెలిసిన పార్టీ.. పునర్నిర్మాణంలో ఉండాలని ప్రజలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్.

 

 వసూళ్ల పార్టీ అని నిరూపించగలరా..

 టికెట్ల కోసం టీఆర్‌ఎస్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్నవారు ఆ విషయం నిరూపించగలరా? టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత లెక్కలేనని బహిరంగ సభలు, కార్యక్రమాలు చేపట్టాం. ఉప ఎన్నికల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చాం. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ 13ఏళ్లలో పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నిరసనలకు, పోరాటాలకు వాటిని వేదికలుగా చేసుకుంది. ఇందుకోసం విరాళాలను ప్రజల నుంచే సమీకరించాం. పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా ముఖ్యనేతలంతా కూలి పనులు చేసి విరాళాలు సేకరించాం. తెలంగాణ వ్యతిరేక వర్గాలే టీఆర్‌ఎస్ వసూళ్ల పార్టీ అని దుష్ర్పచారానికి దిగుతున్నయ్. మరి కాంగ్రెస్, టీడీపీ నిధులు ఎలా సమకూరుస్తున్నయ్, వాటి గురించెందుకు మాట్లాడరు.

 

 వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఒక్కటీ లేదు

 రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణపై మమకారంతో మా కుటుంబమంతా ఉద్యమంలో మమేకమైంది. ఉద్యమంలో కేసీఆర్, హరీష్‌రావు, నేను, కవిత జైలుకు కూడా వెళ్లొచ్చాం. ఉద్యమానికి అడ్డురాని కుటుంబ నేపథ్యం.. ఎన్నికలకు మాత్రం అడ్డెలా అవుతుంది. కుటుంబ పెద్ద రాజకీయాల్లో ఉంటే వారి వారసులకు కొంత అడ్వాంటేజీ అవుతుందనేది కాదనలేని నిజం. అయినా దేశంలో వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఏది చెప్పండి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీవి వారసత్వ రాజకీయాలు కావా? డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, శివసేన వంటి అన్ని పార్టీల్లోనూ వారసులు ఉన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్లినవారు చేసే ఇటువంటి విమర్శలు అర్థం లేనివి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top