తిన్నదంతా కక్కిస్తాం: కేసీఆర్

తిన్నదంతా కక్కిస్తాం: కేసీఆర్ - Sakshi


 సాక్షి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్: తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. టీఆర్‌ఎస్ మాత్రం అధికారంలోకి రాకూడదని ఆంధ్రా పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు పంతం పట్టాయని, తమ ప్రభుత్వం వస్తే తిన్నదంతా ముక్కుపిండి వసూలు చేస్తామని ఆ పార్టీలు భయపడుతున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కబ్జా పెట్టిన భూములు వాపస్ తీసుకుంటామనే తెలంగాణ ఉద్యమాన్ని ఆపేందుకు కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. ‘ఎక్కడి ఉద్యోగులు అక్కడే పని చేయాలని చెబుతున్నా. దీన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. నన్ను కొట్టినా.. తిట్టినా సరే తెలంగాణ దిక్కే మాట్లాడతా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించిన ‘చేవెళ్ల గర్జన’ సభతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ బహిరంగ సభలోనూ, శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆల్వాల్ సభలోనూ  కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని హామీలను గుర్తుచేస్తూనే.. కాంగ్రెస్, టీడీపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

 ఆంధ్రా పార్టీలతో జర జాగ్రత్త

 

 తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అయితే ఆంధ్రా పార్టీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఇక్కడొక ప్రమాదముంది. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు.. ఇద్దరు నాయుళ్లు చీకట్లో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నరు. వద్దురా నాయనా పొత్తు అని ప్రజలంటుంటే ఢిల్లీలో కూర్చుని వెంకయ్య జబర్దస్తీ పొత్తు కుదిర్చిండు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా 20 సీట్లు గెలిచి తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలని టీడీపీ, బీజేపీ చూస్తున్నయి. వారి పాచికలు పారవు. నిన్ననే ఒక రిపోర్టు చూశా. తెలంగాణలో 90 సీట్లు కచ్చితంగా గెలుస్తం’ అని కేసీఆర్ అన్నారు. ‘రాష్ట్రం విడిపోయినా ఆంధ్రా చంద్రబాబు ఇక్కడే ఉంటడంట. ఏం చంద్రబాబు అక్కడికే పో. ఇక్కడెందుకు మాకో శని. ఇక పొన్నాల గురించి మాట్లాడాలంటే బాధనిపిస్తోంది. ప్రజలకు ఏం జెప్తలేరు. ఏం చేస్తలేరు. ఇది వరకు నాయకత్వం చేసిన అనుభవం ఆయనకు లేదు. ఒక సభ లేదు మన్ను లేదు. రోజూ రెండు ప్రెస్‌కాన్ఫరెన్స్‌గలు పెట్టడం కేసీఆర్‌ను తిట్టడం. కేవీపీ భేతాళమాంత్రికుడు. ఆయన పైరవీతోనే పొన్నాల పీసీసీ పదవి తెచ్చుకున్నారు. నిధులిచ్చేది కూడా కేవీపీనే. వాళ్లు డబ్బులిస్తే పని చేసోటోళ్లు.. రేపు ఆంధ్రాకు చేస్తరా? తెలంగాణకు చేస్తరా? కొట్టినా కోసినా, సచ్చినా నేను తెలంగాణ దిక్కే మాట్లాడతా. ఆంధ్రోళ్ల వల్ల పదవులు తెచ్చుకున్నవాళ్లు మనకేం చేస్తరు’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.

 

 అన్ని విధాలా దోపిడీ: ‘ఆంధ్రోళ్లు ఉద్యమం చేస్తే కేసీఆర్ బొమ్మే తగలబెడ్తరు. పొన్నాలదో, జానారెడ్డితో తగలబెడుతుండ్రా. నన్ను కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, సినీ హీరో నాగార్జున కబ్జాకోర్లు. రేపు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే భూములన్నీ కక్కిస్తమని వారి బాధ. రంగారెడ్డి జిల్లాను ఆంధ్రోళ్లు అన్ని విధాలా దోపిడీ చేశారు. ఇక్కడి భూములు, నీళ్లు, నిధులు దోచుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్ భూములను లగడపాటి కబ్జా చేసిండు. అవన్నీ గుంజుకుంటం. ఎంత పెద్దోళ్లయినా వదిలిపెట్టం. ఇవన్నీ జరగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలె. ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో, ఎంపీలు కూడా అంతే ముఖ్యం. కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే ఎంపీలు కావాలె. అప్పుడే ముక్కుపిండి అనుమతులు తెచ్చుకోగలం. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించాలె’ అని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

 మరో రెండు హైదరాబాద్‌లు అతికిస్తం!

 

 ‘తెలంగాణ వస్తే రంగారెడ్డి, హైదరాబాద్‌లలో భూముల ధరలు పడిపోతాయని ఆంధ్రోళ్లు దుష్ర్పచారం చేసిండ్రు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టు వచ్చింది. మరో రెండు కోట్ల మంది హైదరాబాద్ రానున్నారు. వీరందరి కోసం హైదరాబాద్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో మరో రెండు హైదరాబాద్‌లను అతికిస్తం. అమెరికాలోని సాఫ్ట్‌వేర్ నగరం సిలికాన్ వ్యాలీ, చైనాలోని హార్డ్‌వేర్ నగరం షాంఘైలను కలిపి హైదరాబాద్‌లో నిర్మిస్తాం. అప్పుడు ప్రస్తుతం రూ. 2 కోట్లు ఎకరమున్న భూమి రేపు రూ. 20 కోట్లు పలుకుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మాకు సహకరించాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వారి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం తరఫున అనేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆల్వాల్ లోతుకుంటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని ఖండాంతరాలకు విస్తరింప జేస్తామని, కంటోన్మెంట్ ప్రాంతాన్ని మరో బంజారాహిల్స్‌గా మారుస్తామని అన్నారు. ఇందుకు మిలటరీ అడ్డుపడినా సరే కుర్చీ వేసుకుని కాపలా ఉండి కంటోన్మెంట్ అభివృద్ధికి పాటుపడతానని కేసీఆర్ అన్నారు. మల్కాజ్‌గిరిలో టీఆర్‌ఎస్ గెలుపు తెలంగాణ ఆత్మగౌ రవానికి మరింత బలాన్ని ఇస్తుందన్నారు.

 

 అంతర్జాతీయ స్థాయిలో యాదిరెడ్డి స్మారకం

 

 తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన యాదిరెడ్డి కోసం స్మారక స్తూపం నిర్మిస్తామని టీఆర్‌ఎస్ అధినేత చెప్పారు. ‘నా తమ్ముడు యాదిరెడ్డి తెలంగాణ కోసం ఢిల్లీకి పోయి చనిపోయిండు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే మరణానికి కారణమైన టీడీపీ, కాంగ్రెస్ ఓడిపోవాలి. టీఆర్‌ఎస్ గెలవాలి. మొయినాబాద్ మండలంలో 5 ఎకరాల్లో యాదిరెడ్డికి అంతర్జాతీయ స్థాయి స్మారక స్తూపం నిర్మిస్తాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

 వక్ఫ్ బోర్డుకు న్యాయాధికారం: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియరీ పవర్ కట్టబెడతామని ఆయన తెలిపారు. తమది పూర్తిగా సెక్యులర్ పార్టీ అని, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటామని పరిశ్రమల్లో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన పెడతామన్నారు. ఐకేపీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. గ్రామైక్య సంఘాల్లో పనిచేస్తున్న 18 వేల మంది వీఏవోల వేతనాన్ని రూ. 2వేల నుంచి రూ. 5 వేలకు పెంచుతామన్నారు. చేవెళ్ల గర్జనలో పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం, సంజీవరావు, స్వర్ణలతారెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, నరేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ బహిరంగ సభకు మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్, టీఆర్‌ఎస్ నేత వీర్లపల్లి శంకర్, విఠల్‌రావు ఆర్య తదితరులు హాజరయ్యారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top