కాంగ్రెస్‌కు ఓట్లడిగే అర్హత లేదు: కేసీఆర్

కాంగ్రెస్‌కు ఓట్లడిగే అర్హత లేదు:  కేసీఆర్ - Sakshi


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/గోదావరిఖని: సెటిలర్లకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. సీమాంధ్రకు చెందిన కేవీపీ ఆశీస్సులతో టీపీసీసీ అధ్యక్షుడైన పొన్నాల లక్ష్మయ్య.. కేవీపీ చెప్పిన వారికే ఈ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలు, కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. భైంసా, నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ చుట్టూ అన్యాక్రాంతమైన 1.50 లక్షల ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన న్యాయాధికారాలను వక్ఫ్‌బోర్డ్‌కు కల్పిస్తామని చెప్పారు. కుర్చీ వేసుకుని కూర్చొనైనా ప్రాజెక్టులు పూర్తి చేయిస్తానన్నారు. తెలంగాణ గురించి ఏ మాత్రం అవగాహన లేని జైరాం రమేష్ దుర్మార్గుడని వ్యాఖ్యానించారు. ఆయన సర్పంచ్‌గా కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని టీఆర్‌ఎస్ చీఫ్ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నాయకులు ఒక్క రోజైనా జైలులో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

 

 అసదుద్దీన్ ఒవైసీ మనవాడే..

 

 ‘కాంగ్రెస్, టీడీపీల పాలనలో తెలంగాణ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఈ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలు, 16 ఎంపీ సీట్లు మనమే గెలుచుకుంటాం. మిగిలిన ఒక్క ఎంపీ సీటు అసదుద్దీన్ ఒవైసీది. ఆయన కూడా మనవాడే’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న పోలీసులకు పనివేళలు అమలు చేస్తామని, వారికి వారాంతపు సెలవులు, ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక అలవెన్సులు ఇస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామని పునరుద్ఘాటించారు. ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా సీసీఐ, అజంజాహీ, ఐడీపీఎల్ వంటి ప్రభుత్వరంగ పరిశ్రమలను తెరిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. ‘రానున్న మూడేళ్లలో 15వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తాం. రెండేళ్ల తర్వాత రెప్పపాటు వ్యవధి కూడా అంతరాయం కలగకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. అర్హులైన నిరుపేదలకు పిల్లర్లతో కూడిన రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తాం. పింఛన్లు పెంచుతాం. గిరిజనులకు, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతాం’ అని కేసీఆర్ హామీలిచ్చారు. ఆటోలకు, ట్రాక్టర్లు వంటి వ్యవసాయ సంబంధిత వాహనాలకు పన్ను మినహాయింపు ఇస్తామని, ఉద్యోగులపై వేధింపులు ఏమాత్రం ఉండవని చెప్పారు.

 

 బాసరను టీటీడీలా చేస్తా..

 

 జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న ఆదిలాబాద్ జిల్లా బాసరను తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్, టీడీపీలు గాలికొదిలేశాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును దగ్గరుండి నిర్మిస్తామని చెప్పారు. కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు గొడం నగేష్(ఆదిలాబాద్), బాల్క సుమన్(పెద్దపల్లి), ఎమ్మెల్యే అభ్యర్థులు ఎస్.వేణుగోపాలాచారి(ముథోల్), కె. శ్రీహరిరావు(నిర్మల్), రాథోడ్ బాపురావు(బోథ్), జోగు రామన్న(ఆదిలాబాద్), రేఖా శ్యాంనాయక్(ఖానాపూర్), కోవ లక్ష్మీ(ఆసిఫాబాద్), కావేటి సమ్మయ్య(సిర్పూర్), దుర్గం చిన్నయ్య(బెల్లంపల్లి), నడిపెల్లి దివాకర్‌రావు(మంచిర్యాల), పార్టీ జిల్లా తూర్పు, పశ్చిమ అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 ఆ పార్టీలతో జర జాగ్రత్త: టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా టీడీపీ-బీజేపీ నేతలు చీకటి పొత్తు పెట్టుకున్నారని, రూ. రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒకవేళ టీడీపీ, బీజెపీలను గెలిపిస్తే ప్రజలంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు సార్థకత ఉండదన్నారు. తెలంగాణలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సీమాంధ్రులు డబ్బులిస్తున్నారని, ఒకవేళ వారు గెలిస్తే సీమాంధ్రులు చెప్పినట్టే నడుచుకుంటారని కేసీఆర్ అన్నారు.  

 

 విలీనం చేస్తానని కాగితమేమైనా రాసిచ్చిన్నా..!

 

 ‘టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఎవరికీ మాటివ్వలేదు. కాగితం కూడా రాసివ్వలేదు. ఈ విషయంలో మాట తప్పినట్లు పెద్ద రాద్దాంతం చేస్తున్నారు’ అని బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో  కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కేవీపీ డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రకు చెందిన చంద్రబాబునాయుడు, బీజేపీ నేత వెంకయ్యనాయుడు చీకటి ఒప్పందం చేసుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top