కొత్త సంసారం.. ఆగం చేసుకోవద్దు

కొత్త సంసారం.. ఆగం చేసుకోవద్దు - Sakshi


 గజ్వేల్ బహిరంగ సభలో కేసీఆర్

 

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మనది కొత్త సంసారం.. కొత్త కుండలో ఈగలు పడ్డట్టు చేసుకోవద్దు.. ఇంకా మనం అనుకున్న తెలంగాణ రాలేదు, ఆంధ్రోళ్లతోటి పంచాయితీ ఒడవలేదు.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పంపకాల్లో కిరికిరి పోలేదు.. మనం కోరుకున్న తెలంగాణ మనకు కావాలంటే అధికారం మన చేతిల్నే ఉండాలె..’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్లే ఉండాలని, ఆంధ్ర ప్రభుత్వంలో ఆంధ్రావాళ్లు ఉండాలని.. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని స్పష్టం చేశారు. ఆంధ్రోళ్ల డబ్బుతో ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. తెలంగాణ కోసం ఏం నిలబడతారని మండిపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.

 

 ‘‘మనకు నీళ్లలో అన్యాయం జరిగింది, నిధుల్లో.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది.. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇప్పటికైనా మనం అనుకున్న తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణకు కొద్దిగా నత్తి ఉంది. ఆంక్షలతో కూడిన తెలంగాణ వద్దని మొత్తుకున్నా ఢిల్లీ ఏఐసీసీ వినలేదు. మనం కోరుకున్న సంపూర్ణ తెలంగాణ మనకు కావాలె. సంపూర్ణ తెలంగాణ సిద్ధించాలె. నీళ్లు.. నిధులు.. నియామకాలు ఇదే ఉద్యమ ట్యాగ్‌లైన్. జనాభా లెక్కన ఉద్యోగులను పంచుడు బాధాకరం. సచివాలయంలో 90 శాతం మంది ఆంధ్రోళ్లే ఉన్నరు. జనాభా లెక్కన పంచితె అన్యాయం జరుగుతది. ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు. తెలంగాణ ప్రభుత్వంల తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్ర ప్రభుత్వంల ఆంధ్రా వాళ్లు ఉండాలె’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

 ఇంకా పంచాయితీ ఉంది..

 

 ఇంకా ఆంధ్రావాళ్లతో పంచాయితీ అయిపోలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘జూన్ 2 తరువాత పంపకాల పంచాయితీ ఉన్నది. నీళ్ల పంపకం, ఉద్యోగాల పంపకం ఉన్నది.. ఆస్తులు, అప్పుల పంపకం ఉన్నది. మనకు రావాల్సింది మనం తీసుకున్నప్పుడే సంపూర్ణ తెలంగాణ వచ్చినట్టు. ఈ పంపకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే అధికారం మన చేతిల్నే ఉండాలె. మనది కొత్త సంసారం.. కొత్త కుండల ఈగలు పడ్డట్టు మన పరిస్థితి ఉండకూడదు. తెలంగాణ సంగతి ఏంది? మన కొంప సంగతి మనం చూసుకోవాలె. మన కొంప బాగుండాలంటే అధికారం మన చేతిలో ఉండాలె. ఏమరుపాటుగా ఉండకుండా రెండు ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కు వేయాలని మనవి జేసుకుంటున్న.. ఆంధ్ర ఎంపీలు 25 మంది ఉన్నరు. అదే మనకు ఎంపీలు 17 మందే ఉంటరు. అందుకని మన ఎంపీ స్థానాల్లో మనోళ్లనే గెలిపించుకోవాలి.  ప్రాజెక్టులకు క్లియరెన్స్ రావాలంటే, నీళ్లు పారాలంటే కేంద్రమే క్లియరెన్స్ ఇవ్వాలె. మనకు ఎంపీల బలం ఉంటేనే కేంద్రం మెడలు వంచి మన నీళ్లు మనం తెచ్చుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.

 

 ఆంధ్రోళ్ల డబ్బుతో కాంగ్రెస్ నేతలు..

 

 ఆంధ్రా నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఆశీస్సులతో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ పదవిని తెచ్చుకున్నాడని కేసీఆర్ పేర్కొన్నారు. కేవీపీ రామచంద్రరావే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు సరఫరా చేస్తున్నాడని, ఆ ఆంధ్రోళ్ల డబ్బుతో గెలిచే  టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం నిలబడతరా? అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రోళ్లకు సద్ది కడతరా? మనోళ్లకు ఓటేస్తరా? దయచేసి ఆలోచన చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి దేశమంతటికీ ఎగుమతి చేస్తుందని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, డ్వాక్రా మహిళలకు రూ. 8 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని, రూ. 3 లక్షల వ్యయంతో ప్రతి పేదవానికి 125 గజాల జాగాలో పక్కా ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

 

 చంద్రబాబు అడ్డుకోవాలని చూసిండు..

 

 ‘‘చంద్రబాబునాయుడు మెడలు పట్టి నూకినా తెలంగాణ వదిలిపోడట.. ఆత్మగౌరవం లేని వాళ్ల వల్లనే తెలంగాణలో ఇంకా ఆంధ్ర పార్టీలు చలామణీ అవుతున్నయి. ఉద్యోగులకు ఆప్షన్లు, పోలవరం వంటి వాటి మీద చంద్రబాబు మాట్లాడాలే. టీఆర్‌ఎస్‌ను ఓడించటానికి చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కుట్రలు చేస్తున్నరు. తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి కూడా ఈ ఇద్దరే చివరిదాకా పోరాడారు. బీజేపీ-టీడీపీ పొత్తుల మధ్య భయంకరమైన కుట్ర ఉంది. కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా సెటిలర్ల ఓట్లు కోసం పాకులాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top