బాలకృష్ణ సినిమాలను నిషేధించరా?

బాలకృష్ణ సినిమాలను నిషేధించరా? - Sakshi


ఎన్నికల బరిలో నిలిచిన హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు లక్నోలో ఎన్నికల అధికారులు  ప్రకటించారు. ఇక్కడ మన టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలు నిషేధించరా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.  బాలీవుడ్  హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మ,స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బార్తోపాటు జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు లక్నోలో అధికారులు  తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఆ హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు భావించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్ బబ్బార్, నగ్మా, రాష్ట్రీయ లోక్ దళ్ తరపున జయప్రద, బిజెపి తరపున హేమమాలిని, స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ తరపున జావేద్ జాఫ్రీ లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు.



అక్కడ ఓటర్లపై వారి సినిమాలు ఎలా ప్రభావం చూపుతాయో ఇక్కడ మన హీరోహీరోయిన్ల  సినిమాలు కూడా అదేవిధమైన ప్రభావం చూపుతాయి కదా! మన టాలీవుడ్ నుంచి బాలకృష్ణతోపాటు కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధ, బాబూమోహన్, నరసింహరాజు పోటీ చేస్తున్నారు.  తాను కూడా జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థినిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు  హేమ కూడా ప్రకటించారు. మరికొందరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇలా అయితే  ఎంతమంది సినిమాలపై, ఎన్ని సినిమాలపై నిషేధం విధిస్తారన్న సందేహం రావచ్చు.  



నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ అనంతపురం జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ ఆదినారాయణలు ఇప్పటికే  ఆ జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ సినిమా కథానాయకుడైన బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. లెజెండ్ సినిమా టీడీపీకి అనుకూలంగా ఉందని, అందులోని డైలాగులు, కథనం ఆ పార్టీకి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో  ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని వారు కోరారు. 




ఈ నేపధ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో ముఖ్యహీరోల చిత్రాలపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top