వైఎస్‌ఆర్ పాలన మళ్లీ రావాలంటే.. జగన్ సీఎం కావాలి


దర్శి, న్యూస్‌లైన్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో పరిపాలనను ఓసారి గుర్తుచేసుకోండి.. అలాంటి రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది... అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పార్టీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బుధవారం దర్శిలో భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా నామినేషన్ వేశారు.



ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2004లో వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారని గుర్తుచేశారు. ఆయన పాలనలో అన్నిరంగాలు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించారన్నారు. 2009 ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకున్నారని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన మరణించారని, అనంతరం రాష్ట్రంలో పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, వైఎస్‌ఆర్ పథకాలను అటకెక్కించారని, రాష్ట్రాన్ని కూడా విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేశారని ఆందోళన చెందారు.



 ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ మహానేత సంక్షేమ పాలనను అందించగల సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జగన్ చేసిన పోరాటాలు, ఇటీవల ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే అందుకు నిదర్శనమన్నారు. కుమ్మక్కు కుట్రలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని, వైఎస్‌ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్‌ను సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.



 అండగా నిలబడేది వైఎస్‌ఆర్ సీపీనే : బూచేపల్లి

 బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు అండగా నిలబడేది వైఎస్‌ఆర్ సీపీ మాత్రమేనన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు..ప్రజలను కూడా మోసం చేస్తున్నారని, ఆయన్ను నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ప్రసంగించారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top