ఇచ్ఛాపురం టీడీపీలో నిరసన జ్వాల

ఇచ్ఛాపురం టీడీపీలో  నిరసన జ్వాల - Sakshi

శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: అగ్గి రేగింది.. అసమ్మతి భగ్గుమంది.. ఢీ అంటే ఢీ అని సవాల్ చేసింది... వెరసి ఇచ్ఛాపురం టిక్కెట్ వ్యవహారం జిల్లా టీడీపీలో నిరసన జ్వాల రగిల్చింది. పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇంటిపై దాడికి పురిగొల్పింది. ‘మా ఇచ్ఛాపురం సీటు ను బెందాళం అశోక్‌కు కాకుండా బీజేపీకి ధారాదత్తం చేయడం దారుణం. 2009లో వైఎస్ హవాలో కూడా మా నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకున్నాం. 

 

 అలాంటి స్థానాన్ని బీజేపీకి ఇచ్చేస్తారా.. మా అశోక్‌ను కాదని అక్కడెలా పోటీ చేస్తారో.. ఎంపీగా మీరెలా గెలుస్తారో చూస్తాం..’ అని ఆ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రగిలిపోయారు. ఇచ్ఛాపురాన్ని  బీజేపీకి కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించడం, దానికి కింజరాపు నేతలు మద్దతి చ్చినందుకు నిరసనగా సోమవారం మధ్యాహ్నం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని (కింజరాపు రామ్మోహన్నాయుడు గృహం) ఇచ్ఛాపురం టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. సుమారు 200 వాహనాల్లో వందలాది మంది బెందాళం అశోక్ మద్దతుదారులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన నినాదాలతో హోరెత్తించారు. 

 

 ఇచ్ఛాపురాన్ని బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని. అశోక్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేస్తామం టూ నినదించారు. సుమారు గంటన్నర సేపు వారి నిరసన కొనసాగింది. అనంతరం వారు ఒక్కసారిగా రామ్మోహన్‌నాయుడి కార్యాల యంలోకి చొచ్చుకుపోయారు. అక్కడున్న కుర్చీలను విరగ్గొట్టారు. నియోజకవర్గంలోని నాలుగుమండలాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నేతలు సీపాన వెంకటరమణ, జి.కె.నాయుడు, జట్లు జయప్రకాష్, సదానంద రౌళొ, పొందల కృష్ణారావు, మణిచంద్ర ప్రసాద్, బెందాళం రమేష్, సూరాడ చంద్రమోహన్, వానుపల్లి కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

 

 స్వతంత్రులుగా పోటీ

 ఇచ్ఛాపురం అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇందుకు జిల్లా కీలక నేతలు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు సీపాన వెంటకరమణ ఈ సందర్భం గా హెచ్చరించారు. బెందాళం అశోక్‌కు టిక్కెట్ ఇవ్వకపోతే.. ఈనెల 19న ఎంపీ సీటుకు బెందా ళం ప్రకాష్, ఎమ్మెల్యే సీటుకు అశోక్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తారన్నారు. 

 

 అన్ని స్థానాలు ఇచ్చేయండి

 ఇచ్ఛాపురంలో పార్టీకి జరిగిన అన్యాయానికి నిరసనగా మిగిలిన నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొని ఆ సీట్లనూ బీజేపీకి ఇచ్చేయాలని సోంపేట టీడీపీ నేత జి.కె.నాయుడు సూచించారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు చిన్నవాడు కావడంతో పార్టీ అధిష్ఠానం వద్ద గట్టిగా వాదించలేకపోయారన్నారు. ఇచ్ఛాపురంలాంటి బలమైన నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడమేమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవన్నారు.

 

 నరసన్నపేటను తప్పించడానికే ఈ కుట్ర

 నరసన్నపేటను తప్పించడానికే కుట్ర పన్ని ఇచ్ఛాపురాన్ని వదిలేశారని మరో టీడీపీ నేత జయప్రకాష్ ఆరోపించారు. పార్టీకి కంచుకోటలాంటి ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ గెలుస్తారని భావిస్తున్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం శ్రీకాకుళం ఎంపీతో పాటు రెండుమూడు నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top