సానుభూతి సరే... ఓట్లురాలే దారేది?

సానుభూతి సరే...  ఓట్లురాలే దారేది? - Sakshi


టీ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ క్లాస్

తెలంగాణలో పార్టీ హస్తవ్యస్తం

ఎన్నికల ప్రచారంపై తీవ్ర అసంతృప్తి

రాహుల్ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆదేశం

కీలకమైన ‘పోల్ మేనేజ్‌మెంట్’    సంగతైనా చూడండి

 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు, ఎన్నికల ప్రచార సరళిపై కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలకు ఆయన క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఈ ప్రాంత నేతలు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. నాలుగురోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్ గురువారం కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ పరిశీలకులు వయలార్ రవి, కేబీ కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం ఛైర్మన్ కొప్పుల రాజులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రచార సరళి, తెలంగాణ కాంగ్రెస్ పెద్దల తీరు, బహిరంగ సభలకు జనసమీకరణ వంటి అంశాలను సమీక్షించారు.

 

 ఎన్నికల  ప్రచారంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని దిగ్విజయ్‌సింగ్ సహా సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగురోజులే మిగిలిన ఉన్నందున కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్, కొప్పులరాజు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో సుమారు 30 నియోజకవర్గాల్లో పర్యటించిన విషయాన్ని, అక్కడ పార్టీ నేతల్లో నెలకొన్న విబేధాలు, పార్టీ పరిస్థితిని వివరించారు. ఇటీవల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ హాజరైన బహిరంగ సభలకు జనం ఏ విధంగా వచ్చారని దిగ్విజయ్ వారిని ఆరా తీయగా, ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరగలేదని జైరాం, కొప్పుల వివరించారు. ఒకవైపు కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున జనసమీకరణలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమనే భావనను ప్రజలకు కలగజేస్తుంటే,  కాంగ్రెస్ నేతలు కనీసం జిల్లాకో బహిరంగ సభను కూడా విజయవంతంగా నిర్వహించలేకపోతున్నారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.

 

 వెంటనే దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరికీ ఫోన్ చేసి ఎన్నికల ప్రచార సరళి, జన సమీకరణపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే నాలుగురోజులు అత్యంత కీలకమైనందున సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు హాజరయ్యే బహిరంగ సభలను ఈసారైనా సక్సెస్ చేసి ప్రజల్లోకి విజయసంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం వరంగల్, హైదరాబాద్‌లలో నిర్వహించే బహిరంగ సభలకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లో తగిన మూల్యం చెల్లించుకుందనే భావన ప్రజల్లోకి వెళ్లే ప్రమాదముందని దిగ్విజయ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏదేమైనా పోలింగ్ దగ్గర పడుతున్నందున పోల్ మేనేజ్‌మెంట్ కీలకమని, తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

 

 సబిత, రాజగోపాల్‌రెడ్డిలకు ఫోన్: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు దిగ్విజయ్‌సింగ్ ఫోన్ చేసినట్టు తెలిసింది. పొత్తులో భాగంగా మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. వెంటనే మల్‌రెడ్డిని ప్రచారం నుంచి తప్పుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ రెబెల్‌గా రంగంలో ఉన్న మల్‌రెడ్డి రాంరెడ్డిని ప్రచారం నుంచి తప్పించేలా చర్యలు తీసుకోవాలని రాజగోపాల్‌రెడ్డికి సూచించారు. దీంతోపాటు భువనగిరిలో ఈనెల 26న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హాజరయ్యే బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని పేర్కొన్నారు.

 

 కేసీఆర్‌ది సొంత ఎజెండా: ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. గురువారం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రలోనూ రాహుల్‌గాంధీ పర్యటిస్తారని చెప్పారు. వరంగల్, హైదరాబాద్‌లో శుక్రవారం జరిగే బహిరంగ సభల్లో రాహుల్‌గాంధీ నిర్మాణాత్మకంగా చేయబోయే ప్రసంగం చారిత్రాత్మకమవుతుందన్నారు. ఎన్నికలు ముగిసే వరకు తాను ఇక్కడే ఉంటానని, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తానని చెప్పారు.

 

 26న ఆసిఫాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ

 

 కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈనెల 26న ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి కె.జానారెడ్డి సహా సీనియర్ నేతలంతా ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ మీడియాకు వివరించారు.

 

 రెబెల్స్ వివరాలు అందించిన కోదండరెడ్డి: టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఎన్నికల్లో ఏయే స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ పోటీ చేస్తున్నారని, వారి వెనుక ఎవరెవరున్నారనే వివరాలను దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. నాగర్‌కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు అజ్మతుల్లా హుస్సేన్, పద్మ, సూరీడు తదితరులు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

 

 ఎల్‌బీ స్టేడియానికి దిగ్విజయ్‌సింగ్: మరోవైపు దిగ్విజయ్‌సింగ్ మాజీమంత్రి దానం నాగేందర్, టీపీసీసీ ప్రోటోకాల్ చైర్మన్ హెచ్.వేణుగోపాల్‌రావుతో కలిసి ఎల్‌బీ స్టేడియానికి వెళ్లారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, వరంగల్  జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ఫోన్‌లో మాట్లాడారు.

 

 ‘రెబెల్స్’ మద్దతుదారులకు నోటీసులు!

 

 తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై గురువారం సమీక్ష జరిపిన పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ రెబెల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎం. కోదండరెడ్డితో భేటీ సందర్భంగా ఆయన ఈ అంశంపై చర్చించారు. తిరుగుబాటు అభ్యర్థులకు అండగా నిలుస్తున్న పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ప్రధానంగా మునుగోడు బరిలో రెబెల్‌గా నిలిచిన తన కుమార్తె పాల్వాయి స్రవంతికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని, అలాగే నిజామాబాద్‌లో పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. శుక్రవారంలోగా సరైన సమాధానం రాకుంటే పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేసే అవకాశముంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top