ముచ్చెమటలు

ముచ్చెమటలు - Sakshi


 సాక్షి, విశాఖపట్నం : గడువు దగ్గరపడుతున్నకొద్దీ టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మరికొద్ది గంటలే సమయం ఉంది. ఎన్ని ప్రలోభాలు పెడుతున్నా తిరుగుబాటు అభ్యర్థులు దారికి రావడంలేదు. బుధవారం మధాహ్నంలోగా వీరు పోటీ నుంచి వైదొలగకపోతే పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు.



భీమిలి,పాడేరు,అరకు, విశాఖ ఉత్తరం సీట్లలో పరిస్థితి కొరకరానికొయ్యగా మారింది. రెబల్స్‌ను ఎంత బుజ్జగిస్తున్నా వీరు మాటవినడం లేదు. అవసరమైతే పార్టీని వీడిపోయి స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటామని హెచ్చరిస్తున్నారు. ఇది బీజేపీకి కంగారుపుట్టిస్తోంది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉన్నా రెబల్స్ అసలు ఖాతరుచేయడంలేదు సరికదా టీడీపీ నిలబెట్టిన అభ్యర్థికి  వ్యతిరేకంగా ప్రచారం తీవ్రతరం చేస్తున్నారు.

 

భీమిలిలో అనిత సకురు పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గంటాశ్రీనివాసరావుతో సైఅంటే సై అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను ఆయన్ను ఓడించి తీరుతానని భీష్మించుకుకూర్చున్నారు. పార్టీ తనకు విశాఖ పార్లమెంట్ స్థానం ఇవ్వక, తన   భర్త ఎప్పటినుంచో భీమిలిలో పనిచేస్తున్నా అక్కడా టిక్కెట్ ఇవ్వక అవమానించారని రగిలిపోతున్నారు.  రాజకీయ వలస పక్షి గంటాకు టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టి ఇప్పటికే నామి నేషన్ దాఖలుచేశారు.  తడాఖా చూపిస్తానంటూ అధిష్ఠానానికే చెమటలు పోయిస్తున్నారు. అరకులో చివరి నిమిషంలో కుంబారవిబాబుకు ఇచ్చిన బీఫారం రద్దుచేసి సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు ఇవ్వడంతో రవిబాబు రగిలిపోతున్నారు. ఈయన బరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా ఈయన మాటవినడంలేదు.

 

 ఉత్తరంలో చీలిక గుబులు

 విశాఖ ఉత్తరంలో టీడీపీ మద్దతుతో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు వ్యతిరేకంగా దువ్వారపు రామారావు వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఆయన ససేమిరా అంటున్నారు. అంతేకాదు ఇక్కడినుంచి టిక్కెట్‌రాని పలువురు నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇక్కడ పార్టీ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉండడంతో బీజేపీ  గుండెలు బాదుకుంటోంది.



ఎంవీవీఎస్‌మూర్తి,నారాయణ తదితర నేతలు జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. పాడేరులో టీడీపీ నేతలు ప్రసాద్,సుబ్బారావుల్లో ఒకరు దారికివచ్చినా సుబ్బారావు తిరుగుబాటుదారుడిగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకి ముచ్చెమటలు పడుతున్నాయి. అయితే టీడీపీ నేతల ధోరణితో ప్రసుత్తం కమలనాథులు రగిలిపోతున్నారు. తమకు ఇచ్చిన విశాఖ ఉత్తరం,పాడేరు సీట్లలో తమ నేతలనే దారికితెచ్చుకోకపోవడం వలన అంతిమంగా నష్టపోతామని బెంగపెట్టుకుంటున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top