మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి


 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘ తెలంగాణ ప్రజలు దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డికి తమ గుండెల్లో స్థానం ఇచ్చారు... అలాంటి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వాలి’’- అని వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ అన్న ఒక్క పదం రాష్ట్ర గతినే మార్చివేసిందని, రాజకీయాలకే  కొత్త అర్థాన్ని చెప్పిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ‘వైఎస్‌ఆర్ జనభేరి’లో భాగంగా ఆదివారం ఆమె జిల్లాలోని పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తొలి ప్రచార సభ నిర్వహించిన కూసుమంచితో పాటు పలు చోట్ల చేసిన షర్మిల ప్రసంగం...



 ఆమె మాటల్లోనే....

 ‘ ఖమ్మం జిల్లా.. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల.. అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, అవ్వలకు, తాతలకు.. మీ రాజన్న కూతురు, జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. వైఎస్‌ఆర్ అన్న ఒక్క పదం రాష్ట్ర గతినే మార్చేసింది. వైఎస్‌ఆర్ అన్న ఒక్క పదం రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది. సీఎం అంటే ఇలా ఉండాలి.. సీఎం అంటే ఇలాంటి ఆలోచనలు చేయాలి.. సీఎం అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలనే విధంగా వైఎస్ పాలన భావితరాలకు మార్గదర్శకంగా నిలిచింది.



కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీ తంగా అందరూ సమానులే అన్న ఆలోచనతో వైఎస్ పరిపాలించారు. తెలంగాణను, సీమాం ధ్రను వేరుచేసి ఎప్పుడూ చూడలేదు. రెండు ప్రాంతాలను రెండు కళ్లుగా చూశారు. అందరూ నాబిడ్డలేనంటూ అందరి అభివృద్ధినీ సమానంగా కాంక్షించారు. వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో రైతులకు రుణమాఫీ, విద్యుత్ కనెక్షన్లు, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ విషయంలో తెలంగాణకే పెద్ద పీట వేశారు. వైఎస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాదయాత్ర ను మొదలు పెట్టింది కూడా తెలంగాణలోనే. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇలా ఎన్నో పథకాలను తెలంగాణలోనే మొ దలు పెట్టి తెలంగాణ ప్రాంతం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.



వైఎస్‌ఆర్  అన్న మహావృక్షం కింద తెలుగు ప్రజలందరూ సేదతీరారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరపలేని స్థానాన్ని వైఎస్‌కు ఇచ్చారు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఆయన చనిపోయినపుడు ఆబాధని తట్టుకోలేక తెలంగాణలోనే ఎక్కువ మంది చనిపోయారు. అది తెలంగాణ బిడ్డలకు, వైఎస్‌ఆర్‌కు ఉన్న చెరగని అనుబంధం. తెలంగాణ బిడ్డల గుండెల్లో వైఎస్‌ఆర్‌కు ఉన్న సుస్థిర స్థానం. అందుకే ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని రెండు నెలల క్రితం హెడ్‌లైన్స్ టుడే అడిగితే తెలంగాణ ప్రజలు 60 శాతం మంది వైఎస్‌ఆర్‌కు ఓటేశారు. అంటే తెలంగాణ ప్రజల్లో 60శాతం మంది ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ చోటు సంపాదించుకున్నారు. మన జీవితాన్ని పంచుకున్న వాళ్లకు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు, తల్లితండ్రులు, తోడబుట్టినవారు, కాపాడే దేవుడికి మాత్రమే గుండెల్లో చోటిస్తాం.



అలాంటి చోట తెలంగాణ ప్రజలు వారి గుండెల్లో చోటిచ్చారు. ఆ అభిమానాన్ని ఈరోజు వరకు చెక్కు చెదరకుండా ఉంచుకున్నారంటే అది సామాన్య విషయం కాదు. మీరు గుండెల్లో పెట్టుకోవటం వల్లే వైఎస్‌ఆర్ ఇంకా చెరిగిపోలేదు. మీరు కాదు మేం మీకు రుణపడి ఉన్నాం.. వైఎస్‌ఆర్ కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆరుణం తీర్చుకోవాడానికి మేం ముందుకు వస్తున్నాం. ఎంత కష్టం నష్టం వచ్చినా.. కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని ైవె ఎస్ కుటుంబం నిలబడింది, పోరాడుతోంది మీ రుణం తీర్చుకోవడానికే. గత  ఐదేళ్లలో వైఎస్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది.



వైఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజూ విద్యుత్ ఛార్జీలు, ఏఒక్క పన్ను పెంచలేదు. కానీ వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని ఛార్జీలు, పన్నులు పెంచి పేదల నడ్డి విరిచింది. ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీని భుజాలపైన మోసి ఐదేళ్లు కాపాడారు చంద్రబాబు. చివరకు అన్ని పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే.. అవి శ్వాసానికి వ్యతిరేకంగా విప్ జారీ చేసి మరీ ప్రభుత్వం కుప్ప కూలిపోకుండా కాపాడాడు చంద్రబాబు.



 మంచివాడని ఎన్‌టీఆర్ చంద్రబాబుకు పిల్లనిచ్చాడు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు ఓడిపోయినా.. పాపం అల్లుడు కదా అని చంద్రబాబును పిలిచి టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవిని ఇచ్చాడు. అయితే చంద్రబాబు కన్ను ముఖ్యమంత్రి కుర్చీపై పడింది. ఐతే క్షణం ఆలోచించలేదు.  సొంతమామ అని చూడలేదు. సీఎం పదవి కోసం పట్టపగలే వెన్నుపోటు పొడిచాడు. చివరకు ఎన్‌టీఆర్‌పై చెప్పులు వేయించేందుకు వెనుకాడలేదు చంద్రబాబు. మద్యపాన నిషేధం, రెండు రూపాయలకే కిలోబియ్యంలాంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు.



1999లో మహిళలకు బంగారు మంగళసూత్రాలు, ఆడబిడ్డ పుడితే *5వేలు నగదు, పదో తరగతి బాలికలకు ఉచిత సైకిళ్లు, పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య, యువతకు కోటి ఉద్యోగాలు.. అంటూ హామీలిచ్చి.. ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, జపాన్‌లా మారుస్తానంటూ దొంగహామీలిస్తున్నాడు. మూడున్నర కోట్ల ఉద్యోగాలు, ఫ్రీసెల్‌ఫోన్‌లు, ఆల్‌ఫ్రీ అంటున్నాడు చంద్రబాబు. మరి మీరు సీఎంగా ఉన్నపుడు ఇవన్నీ ఎందుకు చేయలేదంటే చంద్రబాబు దగ్గర  సమాధానం లేదు. 20వేల ఉద్యోగాలు బాబు పీకించాడు.



అప్పుడు చేయకుండా ఇప్పుడెలా చేస్తావు ? చంద్రబాబును గురించి వైఎస్ ఒకప్పుడు అనే వారు.. ‘అమ్మకు అన్నం పెట్టడు కానీ.. పిన్నమ్మకు పట్టుచీర పెడతానంటాడు ఒకడు.. దటీజ్ చంద్రబాబు’. ఆయన చెప్పే మాటలు, వాగ్దానాలు నిజంకాదు. బీజేపీతో పొత్తు జీవితంలో పెద్ద తప్పు అని మైనారిటీలకు క్షమాపణ చెప్పి ఇదివరకే మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల కోసం మాటమార్చి తన స్వార్థం కోసం అదే బీజేీపీతో అంటకాగుతున్నాడు. మైనారిటీలను వెన్నుపోటు పొడిచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు.



సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మైనారిటీలు, ప్రజలకు వెన్నుపోటు పొడవటం ఒక లెక్కా..? నేను సూటిగా అడుగుతున్నా..  ఐదేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలలో ఏక్కరయినా.. ఏఒక్క రోజయినా  ప్రజల సమస్యలపై పోరాడారా..? రైతులు, చేనేత, విద్యార్థుల పక్షాన, కార్మికులు పక్షాన  పెంచిన ఛార్జీలను తగ్గించాలని ఏఒక్కరయినా పోరాటాలు చేశారా?  నిరాహార దీక్షలు చేశారా.?ప్రజల సమస్యలు తీర్చేప్రయత్రం చేశారా? ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై పోరాడింది. రాత్రనక, పగలనక జగన్న మాత్రమే పేద విద్యార్థుల ఫీజుల కోసం వారం రోజుల పాటు మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష చేశాడు.పోరాడాడు.



రైతులు, చేనేతలు, ఫీజుల తగ్గింపు కోసం రోజుల తరబడి దీక్ష చేశాడు. ఇచ్చిన ఓదార్పు అనే ఒక్క మాటకోసం.. పదవిని వదులుకుని విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డాడు. మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రజల పక్షాన నిలిచాడు. చేయని నేరానికి జైలుకు వెళ్లాడు.   బోనులో ఉన్నా.. సింహం సింహమే. అలాంటి నాయకుని, మనం అలాంటి నాయకత్వాన్ని బలపర్చాలి.  రాష్ట్ర విభజన ఒక వాస్తవం. ఎన్నికల సమయంలో మనం ఒక విషయం ఆలోచించాలి.   వైఎస్‌ఆర్ లాగా ప్రజలను ప్రేమించే మనసు ఎవరికి ఉంది.



 ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలను అమలు చేసే పెద్దమనసు ఎవరికి ఉంది? అన్ని అద్భుత సంక్షేమ పథకాలు అమలు పరుస్తూనే ఒక్క రోజు కూడా, ఒక్క రూపాయి కూడా ఛార్జీలు, పన్నులు పెంచకుండా పాలించే పెద్దమనసున్న పరిపాలన ఎవరు చేయగలరు? రాజన్న  ఆశయం కోసం పుట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కే ఇది సాథ్యం. మీ రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వండి.



ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటేసేటపుడు మీగుండెల నిండా ఒక్కసారి రాజన్నను గుర్తు తచ్చుకోండి. మనస్ఫూర్తిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తోపాటు ఎన్నికల అవగాహనలో భాగంగా సీపీఎం అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.  రాజన్న రాజ్యం కోసం వైఎస్‌ఆర్ సీపీని ఆశీర్వదించండి. ఫ్యాను గుర్తుకే మన  ఓటు. పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనన్నకు ఫ్యాను గుర్తుపై, పాలేరు అసెంబ్లీ అభ్యర్థి పోతినేని సుదర్శన్ అన్నకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేయండి. మాకోసం.. ఇక్కడికి వచ్చిన మీ అందరి ప్రేమకు, అభిమానానికి, ఆప్యాయత కు, ఆనురాగానికి శిరస్సు వంచి పేరుపేరునా.. చేతులు జోడించి మనస్ఫూర్తిగా  నమస్కరిసుతన్నా.’ అని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు షర్మిల.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top