ఉద్యమకారులెవరో తేల్చుకుందాం?

ఉద్యమకారులెవరో తేల్చుకుందాం? - Sakshi


పొన్నాలా వస్తావా..?: కేటీఆర్ సవాల్

 


హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులెవరో పొన్నాల సొంత గ్రామంలోనే తేల్చుకుందామని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. బుధవారం పార్టీ నేతలు బొంతు రామ్మోహన్, సామల వెంకటరెడ్డి, పి.ఎల్.శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అమెరికాకు పారిపోయిన పొన్నాల లక్ష్మయ్య వంటివారు కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు.‘‘ కేసీఆర్‌ను ఉద్యమ ద్రోహి అంటూ విమర్శించిన పొన్నాల లక్ష్మయ్యా నీ సొంత గ్రామం ఖిలాషాపూర్‌లోనే దీనిపై తేల్చుకుందాం.. సిద్ధమేనా?’’ అని పొన్నాలకు కేటీఆర్ సవాల్ చేశారు.



‘‘2004లో తెలంగాణ ఏర్పాటుచేస్తామని హామీనిచ్చిన సోనియాగాంధీ 10 ఏళ్ల పాటు జాప్యం ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి. నష్టపోయి, పోరాడి, గోసపడిన తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ఆంధ్రాకు ఇస్తే టీ పీసీసీ నేతలు ఏం చేస్తున్నారు. తెలంగాణలోని ఏడు గిరిజన మండలాలను ముంచుతున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాను రద్దుచేయించి, ప్రాణహితకు జాతీయ హోదాను తీసుకువచ్చే సత్తా పొన్నాలకు ఉందా? పోలవరం డిజైను మారుస్తానంటూ సోనియాగాంధీతో చెప్పించగలరా?’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ఇవ్వాల్సి వచ్చిన రాజకీయ అనివార్యత సోనియాగాంధీకి వచ్చిందని చెప్పారు. తెలంగాణకోసం త్యాగాలు చేసిన కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను తిడితే సహించేది లేదని, ఇటుకలతో వస్తే రాళ్లతో సమాధానం చెబుతా (ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేయింగే)మని కేటీఆర్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్  తన జనసేన పేరును మోడీ భజనసేనగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top