తొలిఘట్టానికి రేపటితో తెర

తొలిఘట్టానికి రేపటితో తెర


 సాక్షి, కాకినాడ :గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో.. ఇక సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు శనివారం ఒక్కరోజే మిగిలింది. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు జాతర్లను తలపించే రీతిలో నామినేషన్లు దాఖలు చేస్తుంటే.. టికెట్లు ఖరారవుతాయో లేదో తెలియక తెలుగుదేశం పార్టీ ఆశావహులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పొత్తుల తలనొప్పులు, మరోవైపు టిక్కెట్ల ఖరారులో అధినేత చంద్రబాబు విపరీత వైఖరి వారిని నిస్పృహలో ముంచెత్తుతున్నాయి. ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. వైఎస్సార్ సీపీ దాదాపు అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసింది.

 

 కాంగ్రెస్, లోక్‌సత్తాలతో పాటు కొత్తగా పుట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తమకు బలమున్న చోట్ల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తున్నాయి. కాగా పొత్తులో భాగంగా తొలుత రాజమండ్రి సిటీ, రాజోలు నియోజకవర్గాలను బీజేపీకి కేటాయిస్తున్నట్టు ప్రకటించిన తెలుగుదేశం ఆ తర్వాత రాజమండ్రి సిటీతో సరిపెట్టింది. తొలుత అమలాపురం ఎంపీ టికెట్ ఖరారు చేసిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు స్థానాన్ని కేటాయించగా, పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల విషయంలో ఇంకా అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల ఆశావహుల్లో ఉత్కంఠ క్షణక్షణానికీ రెట్టింపవుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయడమే కాక ప్రచారంలో కూడా ముందున్నారు.  

 

 ప్రత్తిపాడులో వరుపుల నామినేషన్

 ప్రత్తిపాడు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నామినేషన్ వేశారు. స్వగ్రామం లింగంపర్తి నుంచి పార్టీ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఏలేశ్వరం, ఎర్రవరం మీదుగా ప్రత్తిపాడు చేరుకున్న వరుపుల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. అక్కడ నుంచి శంఖవరం మీదుగా రౌతులపూడి వరకు మళ్లీ ర్యాలీగా వెళ్లారు. ఆయన వెంట కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎండీ అధికారితో పాటు ఓ డమ్మీ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు.

 

 జనసంద్రమైన మండపేట

 మండపేట చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు గురువారం నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ఊరేగింపుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు.   గిరజాల వెంట వీవీఎస్‌ఎస్ చౌదరి, బిక్కిన కృష్ణార్జున  చౌదరి, సీఈసీ సభ్యుడు రెడ్డిప్రసాద్, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఊరేగింపులో పాల్గొనగా, నామినేషన్ కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిట్టబ్బాయి, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

 

 నామినేషన్ వేసిన పళ్లంరాజు

 కాకినాడ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు నామినేషన్ వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, కాకినాడ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ తదితరులతో  ర్యాలీగా వచ్చి జిల్లా ఆర్వో, కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నియోజకవర్గం నుం చి ఆమ్‌ఆద్మీ అభ్యర్థిగా దంగేటి శ్రీనివాస్, మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ అభ్యర్థిగా బర్రే కొండబాబు, మరో ఇండిపెండెంట్ నామినేషన్లు వేశారు. అమలాపురం ఎంపీ స్థానానికి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి వడ్డి విల్సన్ సర్టిల్, మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు.

 జోరుగా నామినేషన్లుతెలుగుదేశం అభ్యర్థులుగా అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, రంపచోడవరం నుంచి శీతంశెట్టి వెంకటేశ్వరరావులతో పాటు టికెట్ ఖరారు కానప్పటికీ గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు రాజమండ్రిసిటీ, రూరల్ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు.

 

 జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం నుంచి నెల్లి కిరణ్‌కుమార్, పి.గన్నవరం నుంచి జీవీ శ్రీరాజ్, కాంగ్రెస్ తరఫున రాజమండ్రి సిటీకి వాసంశెట్టి గంగాధర్, కాకినాడ రూరల్‌కు వీవై దాసు, రాజమండ్రి రూరల్‌కు రాయుడు రాజవెల్లి, లోక్‌సత్తా తరఫున రాజమండ్రి రూరల్‌కు అత్తిలి రాజు, కాకినాడ సిటీకి సీపీఐ తరఫున తాటిపాక మధు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ తరపున పిఠాపురం నుంచి సన్నపు కిషోర్‌కుమార్, తుని నుంచి గొల్లపూడి బుచ్చిరాజు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అమలాపురం నుంచి మురిపిరి శ్రీనివాస్, తుని నుంచి ఏఎన్‌ఎస్ ప్రసాద్, కాకినాడ రూరల్ నుంచి గుత్తి రాధాకృష్ణ, రామచంద్రపురం నుంచి వానపల్లి వెంకటలక్ష్మి నామినేషన్లు వేశారు. రాజమండ్రి సిటీ నుంచి రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ తరపున బర్రే కొండబాబు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మహ్మద్ నసీరుద్దీన్ నామినేషన్లు వేశారు.

 

 అనపర్తి నుంచి బీజేపీ తరఫున మేడపాటి హరినారాయణరెడ్డి, రాజ్యాధికార పార్టీ తరపున నామాల శ్రీవెంకటపద్మావతి నామినేషన్లు వేయగా,  సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తరఫున పిఠాపురం నుంచి పిల్లా చంద్రం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తరఫున రాజానగరం నుంచి జనుపెల్ల సత్తిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నుంచి వడ్డి మల్లికార్జునప్రసాద్, కాకినాడ సిటీ నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున కె.కళ్యాణచక్రవర్తిలతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా గురువారం జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలకు 12, అసెంబ్లీ స్థానాలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటితో కలిపి ఇంతవరకూ మొత్తం ఎంపీ సీట్లకు 26, ఎమ్మెల్యే సీట్లకు 123 నామినేషన్లు పడ్డాయి.

 

 అట్టహాసంగా సాయి నామినేషన్

 ముమ్మిడివరం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గుత్తుల సాయి నామినేషన్ వేశారు. భట్నవిల్లి ఆలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌లతో కలిపి పూజలు చేసిన అనంతరం ఓపెన్‌టాప్ జీపుపై ఊరేగింపుగా ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొన్న సాయి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, యేడిద చక్రం, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యిల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి జై సమైక్యాంధ్ర, లోక్‌సత్తా అభ్యర్థులుగా తిరుమాని స్వామినాయకర్, పెండ్యాల ప్రభాకర సుబ్రహ్మణ్యం, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top