ఆశల పల్లకిలో..

ఆశల పల్లకిలో.. - Sakshi


డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి:  తాను గెలిచీ.. పార్టీ అధికారంలోకి వస్తే  సీఎం పీఠం ఎక్కవచ్చన్న ఆశ ఒకరిది. చట్టసభల్లో అడుగిడాలన్న వాంఛ మరొకరిది. కలగా మారిన మంత్రి పదవులను దక్కించుకోవాలనే ఆకాంక్ష ఇంకో ఇద్దరిది. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల బరిలో ఉన్న ఆ నలుగురికి ప్రస్తుత ఎన్నికలు కీలకంగా మారాయి. టీఆర్‌ఎస్ తరఫున పరిగిలో పోటీ చేస్తున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, తాండూరు నుంచి పోటీచేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థులుగా ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బరిలో ఉన్న ఆర్.కష్ణయ్య, తీగల కృష్ణారెడ్డిలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే ఈ పోరులో విజయం కోసం వారు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు.  

 

 పరిగి.. మంత్రి పదవిపై గురి

 రెండు దశాబ్ధాలుగా ఓటమెరుగని హరీశ్వర్‌రెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. మంత్రి పదవి కలగానే మారింది. చ ంద్రబాబు సర్కారులో డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఈసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే  కేబినెట్ బెర్త్ ఖాయమని భావిస్తున్న ఆయన జోరుగా ప్రచారం చేస్తూప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల  ఓట్ల చీలికతో ప్రజావ్యతిరేకత నుంచి గట్టెక్కుతాననే ధీమాతో ఉన్నారు.  

 

 కాంగ్రెస్ తరఫున టి.రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కమతం రాంరెడ్డిలు హరీశ్వర్‌కు పోటీ ఇస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి కూడా నిర్ణయాత్మక శక్తిగా  మారడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒకప్పుడు తనకు కుడిభుజంగా ఉన్న రుక్మారెడ్డి ప్రత్యర్థిగా బరిలో దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలంటున్న హరీశ్వర్  గెలిస్తే వుంత్రి కావాలన్న కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నారు.   

 

 తాండూరు.. పార్టీ మారినా.. రాత మారేనా?

 తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ముందే పసిగట్టిన తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరారు. మంత్రి కావాలనే కోరిక టీఆర్‌ఎస్‌తో నెరవేరుతుందని భావిస్తున్నారు.  టీడీపీ శ్రేణులు తన వెంట రాకపోవడంతో విజయం కోసం శ్రమించాల్సిన వస్తోంది. ఎం.నారాయణరావు (కాంగ్రెస్), ప్రభుకుమార్(వైఎస్సార్ సీపీ), ఎం.నరేశ్(టీడీపీ) బరిలో ఉన్నారు. దీంతో  ఇక్కడ చతుర్ముఖ పోటీ హోరాహోరీగా  సాగుతోంది. ఉద్యమకాలంలో  ఉద్యోగులతో ఘర్షణ పడ్డ ఆయనను అప్పట్లో టీజేఏసీ   తెలంగాణ ద్రోహిగా పేర్కొనడం ఇబ్బందికరంగా మారింది. నానాటికీ ప్రజల మద్దతు కూడగట్టుకంటున్న ప్రభుకుమార్‌పై తాజాగా దాడి చేయించడం  వ్యతిరేకతను పెంచుతోంది.   

 

 మహేశ్వరం.. ఒక్క ఛాన్స్!


 శాసనసభలో అడుగిడాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకునేందుకు తీగల కృష్ణారెడ్డి చెమటోడుస్తున్నారు. 1989,1996లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి, 2009లో మహేశ్వరం అసెంబ్లీకి టీడీపీ తరుఫున బరిలో దిగిన ఆయనకు పరాభవమే ఎదురైంది. తాజాగా మరోసారి మహేశ్వరం నుంచి అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరున్న కృష్ణారెడ్డికి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గతంలో తనకు దక్కాల్సిన మలక్‌పేట టీడీపీ టికెట్టును ఎగురేసుకుపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి(కాంగ్రెస్)తో హోరాహోరీగా తలపడుతున్నారు.

 

  పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా రంగారెడ్డికి బీ ఫారం ఇచ్చి సీపీఐకి షాక్ ఇచ్చిం ది. సీపీఐతో పెద్దగా పోటీ ఉండదని భావిం చిన తీగలకు కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో దిమ్మ తిరిగింది. మరోవైపు ఈసా రి ఎన్నికలకు దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఎంపీగా బరిలో దిగిన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఇక్కడి నుంచి మంచి మెజార్టీ తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులను సబితాఇంద్రారెడ్డి తమవైపు తిప్పుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. దీంతో ఇక్కడ పోటీ టీడీపీ-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా నెలకొంది. సొంత మండలమైన సరూర్‌నగర్‌పై గంపెడాశలు పెట్టుకున్న కృష్ణారెడ్డి తాడోపేడో తేల్చుకునే  దిశగా ముందుకు సాగుతున్నారు.  

 

 ఎల్బీనగర్.. ఒత్తిడిలో సీఎం అభ్యర్థి

 తెలంగాణ రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధికారికంగా ప్రకటించిన ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్‌లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన వర్గాల కోసం ప్రజాక్షేత్రంలో పోరాడిన ఆయన తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యమ బాట వీడి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.  

 

 సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి పెరిగింది. కొంచెం అటూ ఇటూ అయినా ఇన్నేళ్ల ఉద్యమ జీవితంలో సంపాదించుకున్న ప్రతిష్ట మసకబారుతుందని భావిస్తున్నారు. స్థానికేతరుడైన ఆయనను ఇక్కడ పోటీకి దింపడంపై మండిపడ్డ ‘దేశం’ శ్రే ణులు నామినేషన్ రోజే దాడికి దిగాయి. పలువురు సీనియర్ టీడీపీ నేతలు  కాంగ్రెస్ గూటికి చేరడం ఆయునకు ప్రతికూలంగా మారింది. సొంత పార్టీ నేతలను బుజ్జగించడం కత్తిమీద సామైంది. కాంగ్రెస్ అభ్యర్థి  సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ ఆయనమీద పోటీలో ఉన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top