కుమ్ములాట

కుమ్ములాట


లోకేష్ పర్యటనతో మరింత బహిర్గతం దామచర్లకు వ్యతిరేకంగా

పావులు కదిపిన ప్రత్యర్థి వర్గం

ఒంగోలులో ప్రచారం చేయకుండానే  వెళ్లిన లోకేష్

ఆవేదనకు లోనైన అభ్యర్థి జనార్దన్


 

 ఒంగోలు



 జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒక రోజు పర్యటన నిమిత్తం జిల్లాకు రావడంతో పార్టీలో విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి.  లోకేష్ ఒక రోజు ముందు రాత్రి జిల్లాకు చేరుకున్నా, అతని పర్యటనను ఆలస్యం చేయించేందుకు ఒక వర్గం ప్రయత్నించి, సఫలీకృతం అయ్యింది. తద్వారా ఒంగోలు పర్యటనలో ఆయన ప్రసంగించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. షెడ్యూలు ప్రకారం జిల్లాలో మార్టూరు, అద్దంకి, ఒంగోలు సభల్లో లోకేష్ ప్రసంగించాల్సి ఉంది. మొదటి సమావేశం   మార్టూరులో సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. రెండవ సమావేశం అద్దంకిలో ముగిసేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది. అక్కడి నుంచి ఒంగోలుకు రాత్రి 9.55 గంటలకు చేరుకున్నారు. ఎన్నికలకోడ్ అమలులో ఉండటంతో ఒంగోలులో ఆయన ప్రచారం చేయలేక పోయారు.

 1.ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ శాసనసభ అభ్యర్థిగా రంగంలో ఉన్న విషయం తెలిసిందే.

 2.దామచర్లపై వ్యతిరేకత ఉన్న ఒక వర్గం ఒంగోలులో లోకేష్‌ను ప్రచారం చేయ నీయకుండా చేసినట్లు తెలిసింది.

 3. నగర శివారు ప్రాంతానికి వచ్చిన లోకేష్, అక్కడ నుంచే వెనుదిరిగి నెల్లూరు వెళ్లారు. దీంతో అసహనానికి గురైన దామచర్ల  పోలీసులపై తన ప్రతాపాన్ని చూపించి, వారే  సభను అడ్డుకున్నార ంటూ, దుర్భాషలాడారు.

 4.ఇదిలా ఉండగా, జనార్దన్ కూడా జనసమీకరణ చేపట్టే బాధ్యతను తమ  పార్టీ వర్గాలకు ఇవ్వలేదని తెలిసింది.

 5.అంతర్గత కుమ్ములాటల వల్ల తమ పార్టీనాయకులను నమ్మే పరిస్థితిలో ఆయన లేరని సమాచారం.

 6.దీంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా జన సమీకరణ చేయించినట్లు సమాచారం.

 7.ఈ విషయం తెలుసుకున్న  పార్టీ నాయకులు ఆయనపై వ్యతిరేకత పెంచుకున్నట్లు తెలిసింది.

 8.జనార్దన్ నిజానికి కందుకూరు నియోజకవర్గం కోరుకున్నారు.ఒంగోలులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఢీకొని గెలిచే శక్తి లేదని భావించిన ఆయన, కందుకూరులో పోటీ చేయాలని భావించారు. దీనిపై పలు మార్లు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకున్నట్లు తెలిసింది.

9.కందుకూరును దివి శివరాంకు కేటాయించి, వద్దన్న ఒంగోలును జనార్దన్‌కు కేటాయించారు.

10.పార్టీ కోసం కృషి చేస్తున్న తనకు కోరిన సీటు ఇవ్వక పోవడంపై  జనార్దన్ ఒకింత కినుక వహించారు.

11.దీనికితోడు లోకేష్ ఒంగోలుకు ప్రాధాన్యం ఇవ్వకుండా వెళ్లడం మరింత ఆవేదనకు గురి చేసినట్లు సమాచారం.

12. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మంగళవారం జరగాల్సిన ఓ సమావేశానికి గైర్హాజరయ్యారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top