గోదావరి రాజకీయాల్లో కుటుంబాల జోరు

గోదావరి రాజకీయాల్లో కుటుంబాల జోరు - Sakshi


పశ్చిమగోదావరి జిల్లాలో కుటుంబ రాజకీయాల హవా చాలాకాలంగా కొనసాగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబం కొన్నేసి తరాల పాటు రాజకీయాలు చేసిన చరిత్ర ఈ జిల్లాలో ఉంది. సమితుల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా.. కుటుంబానికి ఉన్న మంచిపేరు గానీ, తొలినాళ్లలో పనిచేసిన నాయకులు కొంతలో కొంత నిస్వార్థంగా వ్యవహరించడం వల్ల గానీ ప్రజల గుండెల్లో ఆయా కుటుంబాలకు సుస్థిరమైన స్థానం ఉండిపోయింది. దాంతో ఆ కుటుంబాల వారసులను కూడా ఆయా ప్రాంత ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. అయితే, ఈ తరం వచ్చేసరికి మాత్రం అన్ని కుటుంబాలూ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి. కొందరు మాత్రమే తమ తాతముత్తాతల నాటి విలువలను కాపాడుకుని రాజకీయాల్లో మనగలుగుతున్నారు.



మాగంటి, ఈలి హవా

మాగంటి కుటుంబం దశాబ్దాల తరబడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఉంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జడ్పీ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేశారు. రెండోసారి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి మంత్రి వర్గంలో ప్రమాణస్వీకారం చేసినరోజే ఆయన గుండెపోటుతో మరణించారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలిచారు. ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వాళ్ల కుమారుడు మాగంటి వెకంటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. తాడేపల్లిగూడెం రాజకీయాలపై ఈలి కుటుంబం ముద్ర ఉండేది. 1967లో మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఈలి ఆంజనేయులు 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది ఆయన మరణించడంతో ఆయన భార్య వరలక్ష్మి పోటీచేసి గెలిచారు. 1985లో ఓడిపోయి, తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచి 1990లో టీడీపీలో చేరారు. 2008లో ఆమె తనయుడు ఈలి నాని పీఆర్పీలో చేరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు.



తణుకులో చిట్టూరి.. ముళ్లపూడి

తణుకు రాజకీయాల్లో చిట్టూరి కుటుంబం ముందు నుంచి ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ కుటుంబ నాయకులు అంతగా లేరు. 1891 నుంచి ఈ కుటుంబీకులు సమితి అధ్యక్షులుగా చేశారు. 1946లో జస్టిస్ పార్టీ తరఫున తణుకు నుంచి చిట్టూరి ఇంద్రయ్య  ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈయన సోదరుడు సుబ్బారావు చౌదరి 1960 ప్రాంతాల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1952లో ఇంద్రయ్య కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ఇదే కుటుంబానికి చెందిన చిట్టూరి సుబ్బారావు చౌద రి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1983లో ఇంద్రయ్య కుమారుడు వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 ప్రాంతంలో సుబ్బారావు చౌద రి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో ఇంద్రయ్య కుమారుడు బాపినీడు వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముళ్లపూడి కుటుంబం ఒకానొక సమయంలో చక్రం తిప్పినా.. ఇప్పుడు మాత్రం అంతగా లేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గ్రామసర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించి మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1955, 1962లో గెలుపొందారు. 1967లో స్వతంత్ర అభ్యర్థి గన్నమని సత్యనారాయణపై పోటీచేసి ఓటమి చెందారు. ఈయన కుమారుడు నరేంద్రనాథ్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. చిన్నల్లుడు వైటీ రాజా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగాను, ఆయన సమీప బంధువు ముళ్లపూడి కృష్ణారావు 1985 నుంచి 1994 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో వైటీరాజా ఎమ్మెల్యేగా ఎన్నికైనా తర్వాత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు.



ఏజెన్సీ కింగ్ కరాటం

ఏజెన్సీ ప్రాంత రాజకీయాల్లో కరాటం కుటుంబం ముద్ర ఎప్పటి నుంచో ఉంది. పోలవరం నియోజకవర్గానికి చివరి గిరిజనేతర ఎమ్మెల్యేగా కరాటం బాబూరావు వ్యవహరించారు. ఇదే కుటుంబం నుంచి కరాటం కృష్ణమూర్తి సమితి అధ్యక్షుడిగా చేశారు. అప్పట్లో ఈయనకు ఏజెన్సీ టైగర్‌గా పేరుగాంచారు. కరాటం రాంబాబు డీసీసీబీ అధ్యక్షుడిగా పనిచేస్తూ పోలవరం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కృష్ణమూర్తి కుమారుడు జానకిరాం ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మనువడు కరాటం కృష్ణ స్వరూప్ వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top