రామేశ్వరం పోయినా..

రామేశ్వరం పోయినా.. - Sakshi


పురందేశ్వరిని  వెన్నాడుతున్న ‘బాబు ఫ్యాక్టర్’    

 

 సవ్యసాచి

 

జెమాలజిస్ట్ అయిన దగ్గుబాటి పురందేశ్వరి, ఇప్పుడు తన వద్దనున్న రత్నాలు, రాళ్లు వగైరా వగైరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవి ఏ మేరకు తన అదృష్ట గతిని మార్చగలవో అంచనా వేసుకోవాలి! ఎందుకంటే, ఆమె రాయలసీమలోని రాజంపేట నుంచి లోక్‌సభకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే, అక్కడ్నుంచి పోటీకి ఆమె బలమైన అభ్యర్థి అని బీజేపీ నాయకత్వం నిర్ణయిస్తే, బలహీనమైన అభ్యర్థి అని పొత్తు భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. నిజంగా ఆమె బలమైన అభ్యర్థా? బలహీనమైన అభ్యర్థా? ఈ మీమాంసకు ముందు, అసలామె ఎందుకు అక్కడ్నించి పోటీ చేయాల్సి వచ్చింది అన్నది ఆలోచించాలి. ఆ నియోజకవర్గాన్ని ఆమె ఎంపిక చేసుకొన్నారా? లేక విధి లేక అక్కడ్నించి పోటీ చేయాల్సి వస్తోందా? పెనం మీది నుంచి బయటపడాలని కోరుకుంటారు తప్ప, ఆ ప్రయత్నంలో పొయ్యిలో పడాలని ఎవరూ అనుకోరు.



పురందేశ్వరయినా అంతే! కాంగ్రెస్‌లో ఉంటే గెలుపు కష్టమే కాదు, దాదాపు అసాధ్యమని భావించిన తర్వాతే ఆమె పార్టీ మారి బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున లోక్‌సభకు వెళ్లాలనుకున్నారు. మోడీ రూపంలో అదృష్టం కలిసొస్తుందనుకుని ఉంటారు తప్ప బాబు రూపంలో దురదృష్టం తిరిగి వెన్నాడుతుందని ఊహించి ఉండరు. సన్నటి పొరతో వేరు చేయబడే అదృష్ట-దురదృష్టాలు పక్కపక్కనే ఉంటాయని, పాపం ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అనుకుని ఉండరు. కాంగ్రెస్ నుంచి పార్టీ మారడానికి పురందేశ్వరి కన్నా ఆమె భర్తే ఎక్కువ కారణమని బయట జరుగుతున్న ప్రచారమే నిజమైతే, వెంకటేశ్వరరావు తన తోడల్లుడు చంద్రబాబు చేతిలో మరోమారు భంగపడ్డట్టే లెక్క! ఎన్టీరామారావు తనయగా ఒక మంచి ‘రాజకీయ వనరు’ అవుతారని పార్టీలోకి ఆహ్వానించిన నుంచి దాదాపు పదేళ్లు వీసమెత్తు గౌరవం తగ్గకుండా చూసుకున్న కాంగ్రెస్‌ని కాదని బయటకొచ్చినందుకు ‘ఇదా ఫలం!’ అనిపించి, ఇప్పుడు దంపతులిద్దరికీ బాధ కలగవచ్చు! రాష్ర్ట విభజన కారణం చూపి కాంగ్రెస్ నుంచి బయట పడేందుకు దారి దొరికినప్పుడు, వెంకయ్యనాయుడు వంటి కులపెద్దల అండతో బీజేపీలో చోటు లభించినప్పుడు... ‘హమ్మయ్య!’అనుకుని ఉంటారు. అంతేగానీ, ఇంత తొందర్లోనే బీజేపీ-టీడీపీ మధ్య బంధం ఏర్పడి, వీడని పాత కుటుంబ వైరమేదో వెన్నాడి, తాడు కూడా పామై కాటేసినట్టు కాలం ఇలా వక్రిస్తుందని ఎలా ఊహించగలరు? తానాశించిన విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్వయంగా బరిలోకి దిగుతానంటే, తన తండ్రి స్వస్థలమైన విజయవాడ కోరుకున్నా, పొత్తు భాగస్వామి టీడీపీ ససేమిరా అంటే... ఒక దశలో పురందేశ్వరికి నియోజకవర్గమే లేని స్థితి వచ్చింది.





ఏమంటే, ముందు ఇవ్వజూపిన అరకు (ఎస్టీ), తర్వాత ఖరారు చేసిన తిరుపతి (ఎస్సీ)ల్లో ఆమె ఎలాగూ పోటీ చేయలేరు. నరసాపురంలో అప్పటికే, ‘సంఘ్’కు, ‘సరుకు’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న హోరాహోరి పోరు సాగుతూనే ఉంది, ఇంక ఆమెకెక్కడ చోటు? అసలు పోటీకి సీ(చో) టే లేని ఈ విపత్కర పరిస్థితుల్లో రాజంపేటకు ఆమె రాజీపడితే కూడా, అదీ దక్కకుండా కుట్రలు జరిగినపుడు పాపం వారు ఇంకెంత బాధపడ్డారో! లోలోపల కుటుంబపరమైన వైరం కారణం కాకపోతే, అక్కడ ఆమె బలహీనమైన అభ్యర్థి అని చెప్పే చంద్రబాబు ఇంకో ‘బలమైన’ అభ్యర్థి ఎవరో ప్రతిపాదించలేని దుస్థితి. ఏదయితేనేం, చివరకు  ఇతరేతర కారణాలు బలంగా పనిచేయడం వల్ల బాబు మాట ఈ ఒక్క విషయంలో చెల్లుబాటు కాక, ఆమె అక్కడి అభ్యర్థిగా మిగిలారు. శనివారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ, చంద్రబాబు ఇంతటితో ఊరుకుంటారా? ఆయన మనస్పూర్తిగా పురందేశ్వరి విజయాన్ని కోరుకుంటారా? ఆ మేరకు కృషి చేస్తారా? తమ అధినేత మనసెరిగీ, తెలుగుదేశం శ్రేణులు బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం అహరహం కష్టపడతారా? ఇవన్నీ జనబాహుళ్యంలో జవాబు దొరకని సందేహాలే!

 

డాక్టర్‌కు తొలిసారి కాదు

 

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇది తొలిసారి ఎదురైన పరాభవం కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల కింద ఎదురైన దాదాపు ఇటువంటిదే ఓ చేదు అనుభవం ఇప్పుడు కూడా ఆయన మనసును తొలుస్తూ ఉండి ఉంటుంది. 1995లో మామ ఎన్టీరామారావును చంద్రబాబు కోరస్ అన్యాయంగా పదవీచ్యుతున్ని చేసినపుడు, ఆ కోరస్‌కు తెలిసో తెలియకో డాక్టర్ దగ్గుబాటి వంతపాడారు. తర్వాత తప్పు తెలుసుకొని, చెంపలేసుకొని బాబుకు దూరమయ్యారు. దూరదృష్టి గల చంద్రబాబు మాత్రం, అలా జరగడం తన మంచికే అనుకున్నారు. అటుపై రాజకీయ పరిణామాల్లో దగ్గుబాటి బీజేపీలో చేరారు. 1999 ఎన్నికల ముందు ఇటువంటి రాజకీయ పునరేకీకరణ జరిగి బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పటికి మాటామంతి లేకపోయినా, ఎవరూ నియోగించకపోయినా... బాబుతో మంతనాలు జరుపుతానని పిలవని పేరంటంగా వెళ్లి అవమానానికి గురయ్యారు. గది ముందు ఎంతసేపు నిరీక్షించినా, కలుస్తానని అడిగినా బాబు అనుమతించకపోవడంతో డాక్టర్ దగ్గుబాటి తోడల్లుడ్ని కలువకుండానే, ఒఠ్ఠి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. దటీజ్ బాబు! హితులైనా, సన్నిహితులైనా కడకు బంధువులైనా... బాబు ఉపయోగించుకొని వదిలిచ్చుకునే రకమే! ఇది దగ్గుబాటి దంపతులకు మాత్రమే పరిమితమైంది కాదు. అది బాలకృష్ణ, హరికృష్ణ, తర్వాతి తరానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్‌కైనా వర్తిస్తుంది. కాకపోతే, పురందేశ్వరిలాగా కాసింత దూరాన్ని, అభిమానాన్ని కనబర్చిన రోజు... వాళ్లదీ అదే పరిస్థితి!

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top