శాంతిభద్రతలకు పూర్తి భరోసా

శాంతిభద్రతలకు పూర్తి భరోసా


‘టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి

 

మోడీ ప్రధాని అయితే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ

సీమాంధ్రులకు పూర్తి భద్రత

టీడీపీ హాయాంలోనూ తెలంగాణకు అన్యాయం

అభివృద్ధి కోసమే టీడీపీతో పొత్తు    


 

 హైదరాబాద్: ‘మోడీ ప్రధాని అయితే మతవిద్వేషాలు పెరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. గుజరాత్‌లో ఎక్కువ మంది ముస్లింలు మోడీని ప్రధానిగా చూడాలని ఆశపడుతున్నారు. తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మోడీ ప్రధాని అయితే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తి నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే వచ్చే పదేళ్లపాటు హైదరాబాద్ పోలీసు వ్యవస్థ మోడీ (ప్రధాని హోదాలో) చేతిలో ఉంటుంది. నగరంలో ఉంటున్న సీమాంధ్రులకూ పూర్తి రక్షణ ఉంటుంది’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.



 2019లో సొంతకాళ్లపై...



 తెలంగాణలో పార్టీ బలం పెంచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఈసారి జాతీయనేతలు పొత్తులను ఖరారు చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ, తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామన్నారు. 2019 ఎన్నికలను  సొంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అనుకూల పరిస్థితి తెలంగాణలోనే ఉందన్నారు. మోడీ ప్రధాని అయితే, తెలంగాణ అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, అభివృద్ధి చేసిన పార్టీగా బీజేపీకి గుర్తింపు వస్తుందని చెప్పారు. బీజేపీలో వ్యక్తికి ప్రాధాన్యం ఉండదని, అన్నీ సమష్టి నిర్ణయాలే ఉంటాయని, అగ్రనేతగా ఎల్.కె.అద్వానీ ఉన్నప్పటికీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడమే దీనికి నిదర్శనమన్నారు.

 

టీడీపీ హయాంలో అన్యాయం జరగలేదనలేను..



 తెలంగాణ వెనకబాటులో ప్రథమ ముద్దాయి కాంగ్రెసేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అలా అని చంద్రబాబు హయాంలో అన్యాయం జరగలేదని చెప్పలేనన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో టీడీపీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసునని, అయితే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అంశం ఒకటే ఎజెండాగా ఉంటుందనుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధే ప్రధానాంశమని, ఇందుకోసమే తాము టీడీపీతో పెట్టుకున్న పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు.



 ఎల్‌బీ స్టేడియుంలో సభకు అనువుతి



 నగరంలో సభ కోసం ప్రధాన మైదానాలన్నింటినీ నిబంధనల పేరుతో తిరస్కరించారని, ప్రధాని కాబోయో వ్యక్తి వస్తే మైదానం ఇవ్వమనడం సరికాదని గట్టిగా ఒత్తిడి చేస్తే శనివారం అర్ధరాత్రి దాటాక ఎల్‌బీ స్టేడియంలో అనుమతినిచ్చినట్టు చెప్పారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top