సమరోత్సాహం

సమరోత్సాహం - Sakshi

తొలి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రె స్ ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. వెల్లువెత్తుతున్న ప్రజాదరణకు తోడు పకడ్బందీ ఎన్నికల వ్యూహం ఆ పార్టీకి అదనపు బలం. ఇటీవల నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల ఓటింగ్ సరళి పార్టీ శ్రేణులకు  గెలుపు కిక్ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వైఎస్సార్ సీపీకి అత్యంత సానుకూల అంశంగా మారింది. జిల్లాలోని ప్రధాన సామాజికవర్గాలకు సమన్యాయం చేస్తూ పార్టీ అధినేతజగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ విషయంలో ముందు నుంచే స్పష్టత ఇస్తూ అసమ్మతికి తావు లేకుండా చేశారు. అందుకే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత ఎక్కడా ఎలాంటి అసమ్మతి తలెత్తలేదు. 

 

   జిల్లాలో తూర్పుకాపు సామాజికవర్గానికి మూడు సీట్లు కేటాయించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి, ఎచ్చెర్ల, పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థులుగా గొర్లె కిరణ్, కలమట వెంకట రమణలను ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గం ఆమోదాన్ని పొందారు.   కాళింగ సామాజికవర్గానికి మూడు స్థానాలు కేటాయించారు. తమ్మినేని సీతారాం(ఆమదాలవలస), దువ్వాడ శ్రీనివాస్(టెక్కలి), వజ్జ బాబూరావు(పలాస)లకు అవకాశం కల్పించి ఆ వర్గానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు.   వెలమ సామాజికవర్గానికి చెందిన ధర్మాన సోదరులు కృష్ణదాస్, ప్రసాదరావులకు నరసన్నపేట, శ్రీకాకుళం   యాదవ సామాజికవర్గాన్ని గుర్తిస్తూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్తు రామారావును ఎంపిక చేశారు. రిజర్వేషన్ ప్రకారం రాజాం, పాలకొండలలో ఎస్సీ, ఎస్టీలకు అవకాశమిచ్చారు. ఆ విధంగా సామాజిక సమతూల్యాన్ని సాధించారు. 

 

   ముందునుంచీ స్పష్టత ఉండటం వల్లే టిక్కెట్టు కేటాయించనప్పటికీ పలాస సిట్టింగ్ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సానుకూలంగా స్పందిం చడం విశేషం. మత్స్యకారవర్గానికి చెందిన ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ సామాజికవర్గంలో సానుకూలత వ్యక్తమవుతోంది.   ఇప్పటికే ప్రచారంలో ముందున్న పార్టీ అభ్యర్థులు ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ముహుర్తాల ప్రకారం నామినేషన్లు వేసిన తరువాత ఎన్నికల రథాన్ని  పరుగులెత్తించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top