స్లిప్పుంటే చాలు..!


ఎన్నికల్లో గుర్తింపు కార్డుల బెడదనుంచి వెసులుబాటు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటరు కార్డు తరహాలో ఉండే స్లిప్పులను అందించి పోలింగు సజావుగా జరిగేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వీటిని కూడా ఓటర్లకు బాధ్యులైన సిబ్బంది నేరుగా అందజేయనున్నారు. ముద్రణ కూడా పూర్తవ్వడంతో ఇక పంపిణీ చేయడమే మిగిలింది. అనుకున్నట్లు జరిగితే ఈ ఎన్నికల్లో ఇది మంచి వెసులుబాటుగానే భావించ వచ్చు.

 

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా, ఓటర్ స్లిప్‌తోనే ఓటు వేసేలా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఇంత వరకు నిర్వహించిన ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో 21గుర్తింపుకార్డుల్లో ఏదో ఒక దానిని తీసుకొచ్చి ఓటు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు కొత్త ఓటర్ స్లిప్ప్‌లను అధికారులు రెడీ చేస్తున్నారు. దీనిపై ఓటరు జాబితా వరుస క్రమంతోపాటు, గుర్తింపు కార్డు ఐడి నెంబర్, పోలింగ్ కేంద్ర పేరుతోపాటు, అభ్యర్థి పూర్తి వివరాలు, పోలింగ్ జరిగే తేదీని ముద్రిస్తారు. వీటిని ధ్రువీకరిస్తూ ఆర్డీఓ సంతకం ఉంటోంది.



వీటిని ఇంటింటికెళ్లి ఓటరుకు అందించేటప్పుడు బూత్ లెవల్ అధికారులు సంతకం చేసి ఇస్తే చాలు దీనిని ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఇక ఓటర్ స్లిప్ వెనుక భాగంలో గుర్తింపు కార్డుగా పరిగణించాలనే దానితోపాటు, ఎన్నికల నిబంధనల్ని ముద్రించనున్నారు. ఈ విధానంతో ఓటర్లకు ప్రతీ ఎన్నికల్లో ఎదురయ్యే గుర్తింపు కార్డు సమస్యకు ఈ ఎన్నికల్లో విముక్తి కలగనుంది. గత వారం రోజులుగా అధికారులు చేపట్టిన కసరత్తును ఎట్టకేలకు పూర్తి చేసుకొని ఈ నెల 17న ముద్రణకు కూడా ఓకే అయ్యింది. సంబంధిత కాంట్రాక్టరుతో ఏర్పడిన సమన్వయ లోపం వల్ల ఒక్క రోజు ఆలస్యంగా ముద్రణ ప్రారంభమైనా 18వ తేదీనాటికి పూర్తిచేసి 19వ తేదీనుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు.

 

 చకచకా ముద్రణ

 జిల్లా ఓటర్లు 28లక్షల 94వేల 981మంది ఓటర్లకు గాను ఓటర్ స్లిప్‌లను అందించేందుకు గాను టెండరు ఖరారై ముద్రణ దశలో ఉంది. ఇవి నిర్దేశిత కాలానికి అంటే ఒక్క రోజులో ముద్రణ పూర్తిచేశాక అధికారులు సంబంధిత కాంట్రాక్టరునుంచి వాటిని తీసుకొని పంపిణీకి చర్యలు తీసుకుంటారు.  ఇందు బాధ్యులైనవారు వాటిని పర్యవేక్షిస్తున్నారు.

 

 కొత్త నిర్ణయం అమలయ్యేనా.....

 అధికారులు కొత్తగా తీసుకొన్న నిర్ణయంతో గుర్తింపు కార్డు సమస్య పరిష్కారం అవుతుందనుకోగా, ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో దాన్ని అధికారులు అమలు చేయగలరా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే నిర్వహించిన, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ స్లిప్‌లు 50శాతమైనా ఓటర్లకు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈసారి అదే పరిస్థితి నెలకొంటోందా, లేక అందరికి అందించగలరా లేదా అనేది ఈనెల 30వరకు ఆగితే తేలనుంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top