తీర్పు నేడే


సార్వత్రిక మహా సంగ్రామానికి నేటితో తెరపడనుంది. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో 143 మంది, రెండు లోక్‌సభ స్థానాల్లో 23 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉదయం 8 గంటలనుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు.

 

 సాక్షి, కడప : సార్వత్రిక మహాసంగ్రామానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నానికి వెల్లడి కానున్నాయి. జిల్లాలో 21,61,324 మంది ఓటర్లు ఉండగా, 16,58,392 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో 8,11,197 మంది పురుషులు, 8,47,189 మంది మహిళలు ఉండటం విశేషం. పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 143మంది అభ్యర్థులు, రెండు లోక్‌సభ స్థానాలకు 23 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.




 కడప లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, కడప అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జేఎంజే కళాశాలలో జరగనుంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల లెక్కింపు రిమ్స్ ప్రాంగణంలోని దంత వైద్య కళాశాలలో జరగనుంది. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.

 

 కడప లోక్‌సభ పరిధిలో 15 వేల పోస్టల్ బ్యాలెట్లు ఉన్నందున ప్రత్యేకంగా ఓ గదిలో పది టేబుళ్లను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ పర్యవేక్షణలో ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్‌తోపాటు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. లెక్కింపు కేంద్రంలో గది వసతిని బట్టి ఎనిమిది నుంచి పన్నెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు. గదిలో ఎడమవైపున అసెంబ్లీ, కుడివైపున పార్లమెంటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూము నుంచి సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఉదయం 6 గంటల్లోపే చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 పది నిమిషాల్లోనే ఓ రౌండ్ ఫలితం

 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ముగియగానే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓ రౌండ్ ఫలితం పది నిమిషాల్లోనే వెల్లడి కానుంది. ప్రతి రౌండ్‌లో ర్యాండమ్‌గా రెండు టేబుళ్ల లెక్కింపును సరిచూసిన తర్వాత ఓట్ల వివరాలను షీట్‌లో నమోదు చేస్తారు. ఈ ఏడాది కొత్త విధానం ‘పాడు’ (ప్రింట్ అండ్ ఆక్జలరీ యూనిట్), కంట్రోల్ యూనిట్ ద్వారా ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు 206 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

 

 రైల్వేకోడూరు నియోజకవర్గంలో 20, రాజంపేటలో 21, రాయచోటిలో 22, పులివెందులో 27, కమలాపురం 23, జమ్మలమడుగు 29, ప్రొద్దుటూరు 26, మైదుకూరు 26, బద్వేలు 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జిల్లాలో తొలి ఫలితం రైల్వేకోడూరు నియోజకవర్గం ఫలితం వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వెలువడుతుంది. మొత్తం మీద పది అసెంబ్లీలతోపాటు రెండు లోక్‌సభ స్థానాల ఫలితాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటలోపు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అభ్యర్థుల తరుపున ఏజెంట్లు ఉదయం 7 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

 

 కట్టుదిట్టమైన భద్రత

 పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు ఉండే చుట్టుప్రక్కల ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో కలిపి 600 మందికి పైగా పోలీసులను బందోబస్తుకు నియమించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. సెల్‌ఫోన్లను లోనికి అనుమతించబోమని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి కడపకు తరలివచ్చి కౌంటింగ్‌కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా ఉండాలని సూచించారు. ఇంట్లోనే ఉంటూ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. 18వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని సడలిస్తామని తెలిపారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top