వస్తున్నదెంత? ఇస్తున్నదెంత?

వస్తున్నదెంత? ఇస్తున్నదెంత? - Sakshi


' పార్టీలకు వస్తున్నదెంత?

' అభ్యర్థులకు ఇస్తున్నదెంత?

' వారికి నిజానికి ముట్టుతున్నదెంత?

' వాళ్లు లెక్కచెప్పుతున్నదెంత?

' అసలు లెక్కెంత? అందులో తిక్కెంత?




ఇచ్చిన డబ్బు, ముట్టిన డబ్బు ఒకటిగా ఉండకపోతే లెక్క తప్పినట్టే. అంటే ఏదో తిరకాసు ఉన్నట్టే. తమ అభ్యర్థికి పార్టీలు ఇచ్చామని చెబుతున్న మొత్తం, తనకు ముట్టిందని అభ్యర్థి చెబుతున్న మొత్తం ఒకటి కాకపోతే... ఎన్నికల ఖర్చుల లెక్కల్లోనే తిరకాసు ఉన్నట్టే. పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు లెక్కలు మ్యాచ్ కావడం లేదు. వారి ఖర్చుల స్టేట్ మెంట్లు చెబుతోంది ఇదే.




ప్రణబ్ దా - పదిహేను లక్షలు - ఎన్నికల్లో పారదర్శకత, అవినీతి రహిత సంస్కరణల కోసం పోరాడుతున్న అహ్మదాబాద్ కి చెందిన అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ జరిపిన అధ్యయనంలో ఈ విషయమే వెలుగు చూసింది. 2009 ఎన్నికల ఖర్చుల లెక్కల ప్రకారం అభ్యర్థులకు పార్టీ నుంచి పొందినది 7.46 కోట్లు. కానీ పార్టీలు తాము అభ్యర్థులకు ఇచ్చామని చెబుతున్నది 14.19 కోట్లు. మరి మిగతా ఏడు కోట్లు ఏమైనట్టు.




కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే - ఈ లెక్కల గజిబిజి గందరగోళంలో జాతీయ పార్టీలన్నీ భాగస్వాములే. కాంగ్రెస్ కి చెందిన 123 మంది అభ్యర్థుల వ్యయపత్రాలను ఏడీఆర్ పరిశీలించింది. వీరిలో 81 మంది తమకు పార్టీ నుంచి ఒక్క పైసా రాలేదని చెప్పారు. వీరిలో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు. అయితే ప్రణబ్ దాకి పదిహేలు లక్షలు ఇచ్చినట్టు పార్టీ ఖాతాలో ఉంది. మరి ఈ మొత్తం ఏమైనట్టు?




ఆ సొమ్ములు ఏమైనట్టు?: ఇక కాంగ్రెస్ నాయకత్వం 33 మంది కేంద్ర మంత్రులకు 3.45 కోట్లు ఇచ్చినట్టు లెక్కల్లో చూపించింది. కానీ వీరిలో 22 మంది మంత్రులు తమకు పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పారు. మరి సొమ్ములు ఏమైనట్టు?




ఇక బిజెపి సంగతికొస్తే పార్టీ మా అభ్యర్థులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వ్యయపత్రంలో తెలిపింది. కానీ ఆ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలు తమకు పార్టీ నుంచి నిధులు అందాయని తమ వ్యయపత్రాల్లో లెక్కలు చూపించారు. ఆ మొత్తం 2.75 కోట్ల రూపాయలు. పార్టీ ఇవ్వని డబ్బులు అభ్యర్థులకు ఎలా చేరాయి?




కిరణ్ పార్టీకి ఎంతో సౌకర్యం: ఇంకా తమాషా ఏమిటంటే గుర్తింపులేని పార్టీలకు ఈ ఖర్చుల లెక్కలు చూపించాల్సిన అవసరమే లేదు. అంటే మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీకి తమ తమ అభ్యర్థులకు ఎంత డబ్బిచ్చారో చెప్పనవసరం లేదు. అలాగే పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేయడం లేదు. క్యాష్, చెక్, డీడీ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ వంటి వివిధ పద్థతుల్లో ఇస్తున్న విరాళాల వివరాలేవీ పార్టీలు ఎన్నికల సంఘానికి చెప్పడం లేదు.




కాబట్టి వస్తున్నదెంత? ఇస్తున్నదెంత? ముట్టుతున్నదెంత? లెక్క చెప్పుతున్నదెంత? ఈ విషయంలో మరింత పారదర్శకత కావాలంటోంది అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top