ఆ ఇద్దరూ రాష్ట్రద్రోహులు

ఆ ఇద్దరూ రాష్ట్రద్రోహులు - Sakshi

  • చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిపై జూపూడి మండిపాటు

  • ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

  •  టంగుటూరు, న్యూస్‌లైన్ : చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రద్రోహులని వైఎస్‌ఆర్ సీపీ కొండపి నియోజకవర్గ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. వారిద్దరూ కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధిలో గల తేటుపురం, అనంతవరం, తాళ్లపాలెం, వెలగపూడిలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రధాన సెంటర్లలో ప్రజలనుద్దేశించి జూపూడి మాట్లాడుతూ పదవీకాలం చివరి వరకూ సీఎంగా అధికారాన్ని అనుభవించిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. అనంతరం రాజీనామా డ్రామా ఆడి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

     

    అదే విధంగా ప్రతిపక్షనేతగా ఉండి కూడా అధికార పార్టీకి కొమ్ముకాసి పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండేందుకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దారుణమైన పరిస్థితులకు వారిద్దరే కారణమన్నారు. వారిద్దరికీ బుద్ధిచెప్పేందుకు వైఎస్‌ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని జూపూడి కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి అన్నీ ఉచితంగా ఇస్తానని చెబుతున్న చంద్ర బాబు.. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారం కోసం అమలుసాధ్యం కాని హామీలిస్తూ మరోసారి మోసం చేయాలని చూస్తున్న ఆయన్ను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

     

     జగన్ పథకాలు అద్భుతం...

     నిత్యం జనం మధ్యనే తిరిగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేగుచుక్క అని జూపూడి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించిన పథకాలు అద్భుతమని తెలిపారు. క్షేత్రస్థాయిలో చిన్నచిన్న సమస్యలకు కూడా జగన్ పథకాలతో పరిష్కారం లభిస్తుందని వివరించారు. అమ్మ ఒడి, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, పింఛన్ల పెంపు, 24 గంటల్లో అన్ని కార్డుల మంజూరు, తదితర పథకాలు రాష్ట్ర ప్రజల తలరాత మారుస్తాయని జూపూడి వివరించారు.



    ప్రచార కార్యక్రమంలో టుబాకో బోర్డు డెరైక్టర్ రావూరి అయ్యవారయ్య, పార్టీ మండల కన్వీనర్ బొట్లా రామారావు, నాయకులు పోతుల నరసింహారావు, ఉప్పలపాటి నర్సరాజు, సర్పంచ్ కసుకుర్తి సుందరరావు, పార్టీ ఎస్సీసెల్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కసుకుర్తి ప్రసాద్, బొమ్మిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరాజు పాల్గొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top