దాచేస్తే.. దాగునా!


కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: అక్రమ నిల్వల గుట్టు రట్టయింది. రైతుల కష్టం దోచుకుంటున్న వ్యాపారులు, దళారుల దందా బుధవారం వెలుగులోకి వచ్చింది. గోదాముల్లో అక్రమంగా దాచిన ‘బస్తాల’ బాగోతం విజిలెన్స్ అధికారుల దాడితో బట్టబయలైంది. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో రైతులు ఏటా అధిక విస్తీర్ణంలో పప్పు శనగ, వరి, జొన్న పంటలను సాగు చేస్తున్నారు.

 

 గిట్టుబాటు ధర వచ్చే వరకు దిగుబడులను నిల్వ చేసుకోలేని రైతులు.. వ్యాపారులు, దళారులు చెప్పిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. ఇలా తక్కువ ధరకు వ్యాపారులు, దళారులు కొనుగోలు చేసి.. మంచి రేటు రాగానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కొన్న పప్పుశనగలను గోదాముల్లో నిల్వ చేస్తున్నారు.  కోవెలకుంట్ల పరిసర ప్రాంతాల్లోని పది గోదాముల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ డీఎస్పీ రాజేశ్వరరెడ్డి  నేతృత్వంలో సీఐలు శ్రీనివాసులు, పవన్‌కిషోర్ తనిఖీలు నిర్వహించగా అక్రమ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గోదాముల్లో రికార్డులు లేని సుమారు రూ.50 కోట్ల విలువ చేసే శనగ బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

 

 ప్రస్తుత మార్కెట్‌లో బస్తా ధర రూ.2800 ఉండగా.. ఆ ధర ప్రకారం సుమారు 1.78 లక్షల శనగ బస్తాల అక్రమ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ మేరకు ఏ గోదాములో ఎన్నెన్ని బస్తాల అక్రమ నిల్వలు ఉన్నాయో విజిలెన్స్ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని పలు గోదాముల్లో ధాన్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు ఆరు నెలల క్రితమే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించడంతో వ్యాపారులు, దళారుల బాగోతం వెలుగులోకి వచ్చింది. కాగా రాత్రి బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో రెండు గోదాములపై దాడులు చేసి రూ. 10 కోట్ల విలువ జేసే పప్పుశనగ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top