సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యం


  వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి

 

 అర్ధవీడు, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని...సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అర్ధవీడులో ర్యాలీ నిర్వహించి..అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.

 

కరెంటు బిల్లులు కట్టలేదని జైళ్లలో పెట్టించిన ఘనత చంద్రబాబుదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా..అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించాడన్నారు. జగన్ జైల్లో ఉండి కూడా సమైక్య రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అమ్మ ఒడి పథకం, రైతులను ఆదుకునేందుకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్నారు. డ్వాక్రా మహిళల కోసం వారు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.

 

గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు సాధ్యంకాని హామీలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసే మొదటి ఐదు సంతకాలతో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.

 

మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు  వైవీ సుబ్బారెడ్డి, అశోక్‌రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు చేగిరెడ్డి లింగారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర బాలిరెడ్డి,  వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏరువ రంగారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి నన్నెబోయిన రవికుమార్, పెద్దకందుకూరు సర్పంచ్ భర్త చేగిరెడ్డి సుబ్బారెడ్డి, కార్యకర్తలు నారు అశోక్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు పీవీ రంగారెడ్డి, అర్ధవీడు సర్పంచ్ గుల్లా పుల్లారెడ్డి, పాప కాశిరెడ్డి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ అభ్యర్థులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top