వంకర రాజకీయాలకు శంకరరావు బలి

వంకర రాజకీయాలకు శంకరరావు బలి - Sakshi


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నయవంచనతో గిరిజన నేతకు అన్యాయం జరిగింది. టిక్కెట్ ఇస్తానని నమ్మిస్తూ చివరకు నట్టేట ముంచేశారు. పదేళ్లగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మాజీ ఎంపీ డీవీజీ శంకరరావును కరివేపాకులా తీసిపారేశారు. టిక్కెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపారు.  గుమ్మడి సంధ్యారాణికి అరకు లోక్‌సభ స్థానాన్ని దాదాపు ఖరారు చేశారు. ఈ విష యం తెలిసిన డీవీజీ తీవ్ర మనస్థాపానికి గురయ్యా రు. యూజ్ అండ్ త్రో పాలసీ అవలంభించినందు కు పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.  

 

 గత ఎన్నికల్లో సీపీఎంతో పెట్టుకున్న పొత్తుల కారణంగా డీవీజీ శంకరరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. ఈసారి పొత్తుల ఒప్పందాల్లో అరకు పార్లమెంట్ లేకపోయినా ఆయనకు మొండి చేయి చూపారు. పదేళ్లుగా వాడుకుని  ఇప్పుడు వదిలేశారు. పార్టీనే నమ్ముకున్న డీవీజీ శంకరరావు అగమ్యగోచరంలో పడ్డారు. అధినేతపై తీవ్రంగా మండి పడుతున్నారు. విశ్వసనీయత, నిజాయితీ రాజకీయాలు పక్కన పెట్టి, డబ్బుకు దాసోహమై చంద్రబాబు... క్రమశిక్షణతో పనిచేసే తనకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పార్టీలో ఉండడం మంచి ది కాదన్న ఆలోచనకొచ్చేశారు.

 

 గత ఎన్నికల్లో వామపక్షాల పొత్తుతో నిరాశ

 డీవీజీ శంకరరావు పార్వతీపురం లోకసభ నుంచి 1999లో తొలిసారిగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో అదే లోకసభ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఇంతలోనే నియోజకవర్గ పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పాటైన అరకు లోకసభ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకోవ డం వల్ల సీపీఎంకు ఆ సీటుదక్కింది. దీంతో లోకసభపై ఆశలు వదులుకున్నారు. కనీసం ఎమ్మెల్యేగానై నా బరిలోకి దిగాలని యోచించారు. అప్పటికే కుల వివాదం కారణంగా వేటుకు గురైన ఆర్.పి.భంజదేవ్ స్థానంలో పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ రాత్రికి రాత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన  సంధ్యారాణికి టిక్కెట్ ఇచ్చి డీవీజీకి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. దీంతో నిరాశకు గురయ్యా రు. అయినా పార్టీని వదలకుండా పనిచేస్తూ వచ్చారు.

 

 ఈసారి ఏకంగా విస్మరించారు

 2014 ఎన్నికలే లక్ష్యంగా క్రియాశీలకంగా డీవీజీ శంకరరావు పనిచేస్తూ వచ్చారు. అరకు లోకసభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ బాధ్యతల్ని మోశా రు. గత ఎన్నికల్లో జరిగిన అన్యాయం దృష్ట్యా ఈసారి గ్యారెంటీగా ఆయనకే టిక్కెట్ ఇస్తానని అధినేత హామీ ఇచ్చారు. దీంతో తప్పనిసరిగా తనకే టిక్కెట్ వస్తుందని, బరిలోకి దిగాల్సి ఉంటోందని రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ చంద్రబాబు షాక్ ఇచ్చారు. కుల వివాదం నుంచి బయటపడ్డ ఆర్.పి.భంజ్‌దేవ్‌కు సాలూరు అసెంబ్లీ టిక్కెట్ కేటాయిం చాలన్న  ఉద్దేశంతో అక్కడ నియోజకవర్గ ఇన్‌చా    ర్జ్‌గా పనిచేసిన గుమ్మడి సంధ్యారాణిని అరకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

 

 తొలి నుంచి ప్రతికూల సంకేతాలు

 ఎన్నికల సీజన్ ప్రారంభమైన దగ్గరి నుంచి డీవీజీ ప్రతికూల వార్తలే వింటున్నారు. ఎస్.కోట ఎమ్మెల్యే గా పోటీకి తనకు అవకాశమివ్వాలని లేదంటే అరకు లోకసభ అభ్యర్థిగా తన కుమార్తె స్వాతీరాణిని నిలబెట్టాలని శోభా హైమావతి డిమాండ్ చేశారు. ఎమ్మె ల్యే టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు లేని కారణంగా ఎంపీ టిక్కెట్ ఆమె కుమార్తెకు ఇచ్చేందుకు పోటీ చేసేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతలోనే జిల్లా పరిషత్ ఎన్నికలు రావడంతో శోభా హైమావ తి కన్ను జెడ్పీ పీఠంపై పడింది. దీంతో తూచ్ అం టూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని తన కుమార్తెకు ఇవ్వాలని కొత్త డిమాండ్ చేశారు. పోటీ తగ్గుతుందని చంద్రబాబు సరే అన్నారు. దీంతో స్వాతీ రాణి పోటీ తప్పిందని డీవీజీ ఊపిరిపీల్చుకున్నారు. అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారు.

 

  దీంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతలోనే కుల వివా దం నుంచి బయటపడ్డ ఆర్.పి.భంజ్‌దేవ్ తెరపైకి వచ్చారు. తనకు సాలూరు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో సంధ్యారాణిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిం చి, డీవీజీ శంకరరావును పక్కన పెట్టేశారు. తీవ్ర మనస్తాపం గత ఎన్నికల్లో పొత్తుల కారణంగా, ఈ ఎన్నికల్లో చంద్రబాబు తీరుతో తనకు టిక్కెట్ రాకుండా పోయిందని, వాడుకుని వదిలేయడం పార్టీకి పరిపాటిగా మారిందని డీవీజీ శంకరరావు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నమ్ముకున్న పార్టీ అన్యాయం చేసిందని,  అధినేత తమను పూర్తిగా విస్మరించింద ని మనస్తాపం చెందుతున్నారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. అధినేత తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనా మా చేస్తానని ‘సాక్షి ప్రతినిధి’ వద్ద స్పష్టం చేశారు. అనుచరులతో మాట్లాడి  తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.   

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top