సీపీఐ వర్సెస్ సీపీఎం


ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం వామపక్షాల మధ్య చిచ్చు రేపింది. ఆ రెండు పార్టీల మధ్య ఐక్యతను దెబ్బతీస్తోంది. ఎవరికివారు ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో రెండు పార్టీల క్యాడర్లలో అయోమయం నెలకొంది. గెలుపు మాట ఎలాగున్నా పోటీ చేయడమే ప్రధానంగా ఆ రెండు పార్టీలు ముందుకు కదులుతున్నాయి. ఒంగోలు ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపై చూపుతుందన్న ఆందోళన ఇరుపార్టీల్లో నెలకొంది. ఈ నెల 17వ తేదీ సీపీఎం అభ్యర్థి జీవీ కొండారెడ్డి, 19వ తేదీ సీపీఐ అభ్యర్థి కరవది సుబ్బారావులు తమ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.



సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇతర పార్టీలతో సీపీఐ, సీపీఎం పార్టీలు విడివిడిగా పొత్తులు పెట్టుకున్నాయి. తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో మరో విధంగా పొత్తులు పెట్టుకున్నాయి. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు వేర్వేరు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిస్తే ఒకరికి ఒకరు స్నేహపూర్వకంగా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ నిర్ణయాన్ని ఇరు పార్టీలు తుంగలో తొక్కేశాయి. ఎవరికివారు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకున్నారు.



 ఈ క్రమంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసే విషయమై సీపీఐ, సీపీఎం జిల్లా కార్యవర్గాలు సమావేశమై రాష్ట్ర నాయకత్వాలకు నివేదికలు అందించాయి. సంతనూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో సీపీఎంకు మంచి పట్టు ఉంది. గతంలో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు శాసనసభ్యులుగా గెలుపొందారు. తాజాగా సంతనూతలపాడుతో పాటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా సీపీఐ కూడా ఈసారి ఎక్కువ నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. వాటిలో ఒంగోలు కూడా ఉంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top