జిల్లాలో చిరం‘జీవం’ ఎక్కడ?

కృష్ణాలో చిరం‘జీవం’ ఎక్కడ? - Sakshi


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ అయిన చిరంజీవికి  కృష్ణాజిల్లాలో సొంత వర్గం లేకుండా పోయింది.  2009 ఎన్నికల్లో  ప్రజారాజ్యం తరఫున విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నుంచి యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనంతో  యలమంచలి రవికి మంత్రిపదవి వస్తుందన్న ప్రచారం సాగింది.


అయితే ఆయనకు ఆ పదవి దక్కకపోగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో కష్టాలు తప్పలేదు. ప్రతి విషయంలోనూ పార్టీలో   నెహ్రూ మాట చెల్లబడి అయ్యింది. ఆఖరికి డివిజన్ అధ్యక్షుల ఎంపిక, మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ రవికి మొండిచెయ్యి దక్కింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.  



విజయవాడ పశ్చిమం నుంచి ఎన్నికైన వెల్లంపల్లి శ్రీనివాస్ది భిన్నమైన కధ. ఆయన ఏం చేసినా చిరంజీవి చూసీ చూడనట్లు వదిలేశారు. దుర్గగుడిపై పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులొచ్చినా పల్లెత్తు మాట అనలేదు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా సీటు ఇప్పించారు. తీరా సీటు వచ్చిన 24 గంటల్లోపే వెల్లంపల్లి తనదారి  చూసుకున్నారు.  తిరువూరులో కాంగ్రెస్ సీటు ఆశించి అది దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన నంబూరి శ్రీనివాసరావు చిరంజీవిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇప్పిస్తానని చెప్పి రెండున్నర ఎకరాల పొలాన్ని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 2014లో కూడా సీటు ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆరోపించారు.  



 వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యాన్ని పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన కాంగ్రెస్‌లో కలవకుండా ఉండిపోయారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా వైఎస్సార్ సీపీలో,  2009లో గుడివాడ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశంలో చేరిపోగా, కైకలూరులో కామినేని శ్రీనివాస్ బీజెపీ తీర్థం పుచ్చుకుని అభ్యర్థిగా బరిలోకి దిగారు. జిల్లాలో ఏ నాయకుడు కూడా చిరంజీవిని నమ్ముకునే సాహసం చేయకపోవడం తగ్గిపోయిన ఆయన ప్రాభవానికి అద్దం పడుతోంది. 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top