ఇంతకీ చంద్రబాబు సాధించిందేమిటి?

ఇంతకీ చంద్రబాబు సాధించిందేమిటి? - Sakshi


టీడీపీ ఎన్నికల పొత్తు అనే కొండను తవ్వింది. ఇచ్ఛాపురం అనే ఎలకను పట్టింది. ఈ మధ్యలో మాత్రం టీవీ సీరియల్ లో ఉన్నన్ని ట్విస్టులను చూపించింది. ఇంతా చేసి చంద్రబాబు ఇంత గొడవ చేసింది ఒక్క ఇచ్ఛాపురం కోసమేనా? మిగతా అన్ని చోట్లా బిజెపి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనకు ఎలాంటి అభ్యంతరమూ లేదా? ఈ ఒక్క సీటు కోసమే పొత్తును వదులుకునేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానమేమీ రాలేదు.

చివరికి  'అబ్బే  ఇప్పటి వరకు  జరిగిందంతా  కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే' అంటూ చెప్పడం  వారి డ్రామాకు కొసమెరుపు.  పురందేశ్వరికి టిక్కెట్ ఇవ్వడం , నరసాపురం స్థానం రఘురామరాజుకు ఇవ్వకపోవడమే అసలు డ్రామాలకు మూలకారణం అనేది సగటు ప్రజలకూ  తెలిసిన  నిజం. అంతేకాక నరేంద్ర మోడీ సికింద్రాబాద్ బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొంటున్నా సీమాంధ్రలో జరగబోయే సభల్లో పవన్ కల్యాణ్ నే వెంట పెట్టుకుంటున్నారన్నది టీడీపీకి షాకిచ్చింది. మోడీ పక్కన బాబు లేకపోతే సీమాంధ్రలో రాజకీయ లబ్ధి ఉండకపోవచ్చునన్నది బాబు భయం. అయితే టీడీపీ వైఖరితో విసిగిపోయిన బిజెపి కూడా ఒంటిరిపోరుకు సై అనేసరికి చంద్రబాబు వెనువెంటనే దిగొచ్చారు. బిజెపి కేంద్ర నాయకత్వం కూడా దృఢంగా వ్యవహరించడంతో ఆయన ఖంగుతిన్నారు.

అయితే ఈ డ్రామా అంతా జరిగిన తరువాత బిజెపి, టీడీపీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తారా? వారి మధ్య విభేదాలను తొలగించడం సాధ్యమౌతుందా? ఇరు పార్టీల మధ్య సమన్వయానికి ఏర్పాట్లేమైనా చేశారా? ఇప్పటికీ తెలంగాణలో ఈ పొత్తు పనిచేయడం లేదని వార్తలు వస్తున్నాయి. పలు చోట్ల బిజెపికి టీడీపీ సహకరించడం లేదన్న రిపోర్టులు వస్తున్నాయి. తెలంగాణలోనూ ఇరు పార్టీల మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పైస్థాయి పొత్తు క్షేత్రస్థాయిలో చిత్తు అయిపోతోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఇప్పటికే తెలంగాణలో అసలు టీడీపీతో పొత్తు వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదని బిజెపి నేతలు ఇప్పటికే భావిస్తున్నారు.

2004 లో చంద్రబాబు పరిస్థితికీ, నేటి పరిస్థితికీ చాలా తేడా ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అప్పుడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబుకి, ఇప్పుడు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి పోలిక లేదని. అప్పట్లా రాజకీయాలను చంద్రబాబు శాసించే స్థాయిలో లేరని బిజెపి నేతలు భావిస్తున్నారు. 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top