దేశాన్ని కాంగ్రెస్ అప్రతిష్టపాలు చేసింది

దేశాన్ని కాంగ్రెస్ అప్రతిష్టపాలు చేసింది - Sakshi


* తూర్పుగోదావరి జిల్లా రోడ్‌షోలో టీడీపీ అధినేత చంద్రబాబు

* అడుగడుగునా నిరసనలు కనిపించని జనాదరణ


 

 సాక్షి, రాజమండ్రి : కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, దేశాన్ని అప్రతిష్టపాలు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ఆయన మధురపూడి విమానాశ్రయం నుంచి రోడ్‌షో నిర్వహించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మండపేట చేరుకున్న చంద్రబాబు అక్కడ బహిరంగసభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ పెట్టుకోవాలో తెలీని అయోమయంలో ప్రస్తుతం ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం గాలి వీస్తోందన్నారు. ప్రజాసంక్షేమం కోసమే తమ పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుందన్నారు. ఒక్కసారి అధికారమిస్తే.. అడిగినవన్నీ చేసేస్తామని పేర్కొన్నారు.

 

 అడుగడుగునా నిరసనలు: చంద్రబాబునాయుడు 4.20 గంటలకు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి వచ్చారు. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చిన వెంటనే మాదిగల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. సీట్ల కేటాయింపులో జిల్లాలో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పిస్తానన్న బాబు మాట నెరవేర్చుకోలేదంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజానగరం నియోజకవర్గంలోని కొండగుంటూరు గ్రామంలో కూడా మాదిగలు బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పి.గన్నవరం సీటు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

 

 ఈ సందర్భంగా బాబు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చెప్పినట్టు నేను వినాలా..’ అని ప్రశ్నించారు. అనంతరం ఒక ఎమ్మెల్సీగానీ, ఎమ్మెల్యేగానీ ఇస్తానంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతకుముందు బొమ్మూరు జాతీయ రహదారి సెంటర్ వద్ద కాపులు, బీసీలు రాస్తారోకో చేసి బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సామాజిక సమన్యాయం అంటున్న చంద్రబాబుకు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలు, కాపులు పట్టలేదా అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి రూరల్ సీటు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఇవ్వవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యకర్తల గోడు పట్టించుకోకుండా బాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు సాగారు.

 

 పేలవంగా రోడ్ షో: చంద్రబాబు ముందుగా రాజానగరం నియోజకవర్గం గాడాల వద్ద ఆగి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడ వందల సంఖ్యలో జనం హాజరయ్యారు. ఆ తర్వాత వేలాదిగా జనం స్వాగతం పలుకుతారని భావించిన బాబు టాపులేని జీపులో రెండు కిలోమీటర్లు ముందుకు సాగారు. ఎక్కడా జనాలు లేకపోవడంతో అసహనానికి గురై మళ్లీ తన కారులో కూర్చుండిపోయారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top