విశ్వసనీయత ఏది బాబూ!


సాక్షి, ఏలూరు: విశ్వసనీయత.. నీతి ఉంటే పార్టీ కోసం కష్టపడిన వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు, గోపాలపురం, ఏలూరు నియోజకవర్గాల్లో బుధవారం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి తణుకు చేరుకున్న చంద్రబాబు అక్కడి కల్యాణ మండపంలో బస చేశారు. ఆ సమయానికి తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ కార్యకర్తలు తరలివెళ్లి అసెంబ్లీ గూడెం సీటును బీజేపీకి ఇవ్వ వద్దని, టీడీపీ అభ్యర్థినే పోటీలో నిలపాలంటూ ఆందోళన చేశారు.

 

 బుధవారం ఉదయం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు కల్యాణ మండపానికి చేరుకున్నారు. కొవ్వూరు అసెంబ్లీ టిక్కెట్టు టీవీ రామారావుకు ఇవ్వాలంటూ కొందరు, పాలకొల్లు సీటు బాబ్జికి ఇవ్వాలని మరికొందరు, ఆ సీటును నిమ్మల రామానాయుడికే ఇవ్వాలని మరో వర్గం పోటీపడి నినాదాలు చేశారుు. ప్ల కార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారుు. కృష్ణాజిల్లా అవనిగడ్డ సీటును తమ నాయకుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు కేటాయించలేదని, కనీసం నూజివీడు టిక్కెట్టయినా ఇవ్వాలని ఆయన వర్గీయులు ప్ల్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. వీరంతా ఓ వైపు ఆందోళన చేస్తుంటే మరోవైపు సీటు రాకపోయినా ఏ గొడవా చేయని వైటీ రాజాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ కొందరు ప్ల్లకార్డులు ప్రదర్శించారు. ఈ గందరగోళం కారణంగా చంద్రబాబు తణుకు నియోజకవర్గ కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశం నిర్వహించలేదు. పార్టీ శ్రేణుల నిరసనను ఏమాత్రం పట్టించుకోని ఆయన రోడ్ షోకు వెళ్లిపోయూరు.

 

 హైదరాబాద్ రండి.. ప్రచారం చేయండి : తణుకు, దేవరపల్లి, ఏలూరులో చంద్రబాబు నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చదువులు మానేసి.. వారం రోజులు  కళాశాలకు సెలవు పెట్టి హైదరాబాద్ రావాలని.. తనకోసం ప్రచారం చేయాలని కోరారు. ప్రజలు కూడా పనులు మానేసి అవసరమైతే రాత్రి పనులు చేసుకుంటూ పగలంతా పార్టీ ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, తాను చాలా తెలివైన వాడినని చెప్పుకున్నారు. తనను మర్చిపోవడం వల్లే కష్టాలొచ్చాయని ప్రజలను తప్పుబట్టారు. ఈసారైనా ఓట్లు తన కోసం అడగడం లేదని, తనకు పదవులు కొత్తేమీ కాదని.. తనకు ఓట్లు వేయకపోతే మీకే నష్టమని బెదిరించినట్టు మాట్లాడారు. దీంతో ఆయన ప్రసంగం వినేందుకు ఆగిన కొద్దిపాటి జనం ప్రసంగం పూర్తికాకముందే వెనుదిరిగారు.

 

 నేతలతో చర్చలు : తణుకులో రోడ్ షోకు బయలుదేరేముందు ఎంపీ తోట సీతారామలక్ష్మి, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి మురళీమోహన్, బీజేపీ తరఫున నరసాపురం లోక్‌సభ సీటు దక్కించుకున్న గోకరాజు గంగరాజు, నిడదవోలు అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు, తాడేపల్లిగూడెం బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే కలవపూడి శివ, నాయకులు కొట్టు సత్యనారాయణ, ఈలి నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మోషేన్‌రాజు, చినమిల్లి సత్యనారాయణ తదితరులతో కొద్దిసేపు చంద్రబాబు చర్చించారు. అనంతరం రోడ్ షో ప్రారంభించి తణుకు నరేంద్ర సెంటర్ వరకూ కొనసాగించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌పై దేవరపల్లి వెళ్లారు. సాయంత్రానికి ఏలూరు చేరుకుని సీఆర్‌రెడ్డి కళాశాల నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకూ రోడ్ షో చేశారు. బుధవారం రాత్రి ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు ఇంట్లో బస చేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top