ఇద్దరు డాక్టర్లను డిశ్చార్జ్ చేసిన బాబు

ఇద్దరు డాక్టర్లను డిశ్చార్జ్ చేసిన బాబు - Sakshi


పాలకొల్లు: టీడీపీ అధినేత చంద్రబాబు డెల్టాలోని ఇద్దరు ప్రముఖ వైద్యులను డిశ్చార్జ్ చేశారు. ఇదేంటీ పేషెంట్లు కదా డిశ్చార్జ్ అయ్యేది అనుకుంటున్నారా.. వైద్యులను డిశ్చార్జ్ చేసింది ఆసుపత్రి నుంచి కాదండీ.. ఎన్నికల బరిలో నుంచి. బాబు దెబ్బకు వారు బలయ్యారు మరి. హస్తవాసి మంచిదని పేరుపొందిన ప్రముఖ వైద్యులు పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), నరసాపురం పట్టణానికి చెందిన డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావులను గతంలో చంద్రబాబు బలవంతంగా టీడీపీలోకి తీసుకువచ్చారు.



రాజకీయాలంటే వారికి ఇష్టం లేకున్నా  ‘మీరు వస్తేనే టీడీపీకి మీ నియోజకవర్గాల్లో ఉనికి ఉండేది.. మీరు లేకపోతే నా పార్టీ లేదాయే. మీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే కాకుండా మిగిలిన విషయాలను నేను చూసుకుంటా’ అంటూ 2004లో డాక్టర్ బాబ్జీని, 2012లో నరసాపురం ఉప ఎన్నికలో చినిమిల్లి సత్యనారాయణరావును టీడీపీలోకి లాక్కొచ్చారు.



డాక్టర్ బాబ్జీ 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాలకొల్లు నుంచి గెలుపొంది నీతి, నిజాయితీలతో పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. పీఆర్పీ అధినేత చిరంజీవి 2009లో పాలకొల్లు నుంచి బరిలో దిగినా ైధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆదుకుంటానన్న బాబు చేయివ్వడంతో ఆర్థికంగానూ ఎంతో నష్టపోయారు. అయినా ఇప్పటి వరకూ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారడంతో చుక్కాని లేని నావగా మారిన టీడీపీని బతికించేందుకు డాక్టర్ చినిమిల్లిని బాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఉపఎన్నికలో ఓటమి పాలైనా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేశారు.



ఈ ఇద్దరికీ ప్రజల్లో మంచి పేరూ, పలుకుబడి ఉన్నా ఈ ఎన్నికల్లో చంద్రబాబు వారికి టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపించారు. వీరు వైద్యులుగా ఉన్నప్పుడు ఎంతోమందికి ఆపరేషన్లు, చికిత్స చేసి వైద్యం నయం కాగానే పేషెంట్లను డిశ్చార్జ్ చేసేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వీరిని వాడుకున్నంత వాడుకుని పార్టీ నుంచి డిశ్చార్జ్ చేశారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.   

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top