కోటరీ చేతిలో ‘కీ’లుబొమ్మ


కార్పొరేట్ మాటే బాబుకు వేదం

కార్యకర్తలకు, నేతలకు దూరమైన పార్టీ

బినామీల రాజ్యంగా టీడీపీ


 

 యాచమనేని పార్థసారథితెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం చర్చలకు  వెళ్లండి. ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడండి . తన కోటరీలోని పారిశ్రామికవేత్తలు సీఎం రమేశ్, సుజనా చౌదరిలకుబాబు పురమాయింపు. విశాఖలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య విభేదాలు మరీ పెరిగాయి. సర్దుబాటు చేయండి .తన సన్నిహితుడైన విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పి.నారాయణకు బాబు ఆదేశం (నారాయణకు టీడీపీలో ఏ పదవీ లేదు) .



కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్‌సీపీలో చేరజూస్తున్నారు, వారిని ఎలాగోలా మన పార్టీలో చేరేలా ఒప్పించండి. అవసరమైతే ‘నిధులు’ సర్దుబాటు చేయండి .తన కోటరీలోని సుజనా, నామా నాగేశ్వరరావులకు చంద్రబాబు నిర్దేశం.  ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలో తేల్చారా, లేదా? .మరో పారిశ్రామికవేత్త గరికపాటి మోహనరావుకు బాబు ప్రశ్న . ‘సీట్లు అడుగుతున్నారు సరే, అసలు మీ దగ్గర దండిగా నోట్లున్నాయా?’ పొత్తు చర్చల్లో బీజేపీ నేతలకు టీడీపీ కార్పొరేట్ బినామీలు సంధించిన తొట్టతొలి ప్రశ్న.


 

 

టీడీపీ పూర్తిగా కార్పొరేట్ మయమైపోయింది. బడా బాబుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలకు, నేతలకు ఏనాడో దూరమైంది. టీడీపీ ఇప్పుడు ఆద్యంతం బాబు బినామీలుగా చలామణీ అవుతున్న వారి కనుసన్నల్లోనే నడుస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో ఎవరు అందెవేసిన చెయ్యి అయితే వారిదే హవా! మరో నాయకుడి మాటకు పూచికపుల్ల పాటి విలువైనా లేని పరిస్థితి. పార్టీపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బడాబాబులదే పెద్ద పాత్ర.



బీసీ, ఎస్సీ తదితర వర్గాల నేతలకు గానీ, జనాదరణ ఉన్నా ఆర్థిక బలం లేని నేతలకు గానీ చోటే లేదు. వెరసి టీడీపీలో వ్యవహారాలన్నీ కార్పొరేట్ క్రయ విక్రయాలను తలపించేలా సాగుతున్నాయి! బాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో రకంగా లబ్ధి పొందిన బడా బాబులే నేతల అవతారమెత్తి పార్టీని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. పార్టీని ఒక పెట్టుబడి యం త్రంగా మలిచారన్న విమర్శ ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచే బలంగా విన్పిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

  

గుంటూరు జిల్లాలో ఒక కాంగ్రెస్ నేతను టీడీపీలో చేర్పుకుని లోక్‌సభ టికెట్ కట్టబెట్టేందుకు బాబు కోటరీలోని కార్పొరేట్లే రంగంలోకి దిగారు. మంతనాలు జరిపారు. లావాదేవీలు నడిచాయి. సదరు కాంగ్రెస్ నేత టీడీపీలో చేరారు. లోక్‌సభ టికెట్ ఖరారైంది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపుగా రూ.100 కోట్ల ప్యాకేజీ కుదిరినట్టు చెబుతున్నారు. పైగా లోక్‌సభ టికెట్ ఇచ్చినందుకు ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు మొత్తాన్నీ ఆ నేతే భరించాలి. వీటిన్నింటికీ బదులుగా... టీడీపీ అధికారంలోకి వస్తే గిస్తే రాయితీలే రాయితీలు! ఇదీ డీల్.



గుంటూరు జిల్లా నుంచే మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో కూడా ఈ కోటరీ ముఖ్యులే మంతనాలు జరిపారు. లోక్‌సభకు పోటీ చేసేందుకయ్యే ఖర్చుతో పాటు, ఆ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరి ఖర్చూపెట్టుకోవాలని ప్రతిపాదించారు. అందుకాయన సరేననడమే గాక వార అడిగినంత మొత్తం చూపించిన తర్వాతే చేరికకు బాబు పచ్చజెండా ఊపారు. అలా సదరు కాంగ్రెస్ ఎంపీ ఇటీవలే తన సోదరుడితో కలిసి టీడీపీలో చేరారు. కోటరీ చెప్పి మేరకు ఆయన కోసం టీడీపీ సిట్టింగ్ ఎంపీని కూడా పక్కకు తప్పించారు బాబు!



కృష్ణా జిల్లా నుంచి  ఒక ఎమ్మెల్యే సోదరుడి కూడా టీడీపీ కార్పొరేట్ గ్యాంగ్ గాలమేసింది. ఎమ్మెల్యే టికెటిస్తామనే హామీతో జిల్లా టీడీపీ వ్యవహారాలు చూస్తున్న బాబు కోటరీ ముఖ్యుడొకరు ఆయన నుంచి కోట్లలో వసూళ్లు చేసినట్టు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో  ఎమ్మెల్యే కూడా ఇటీవల ఇదే పద్ధతిలో టీడీపీలో చేరారు. అదే సీటు కోసం కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు ప్రయత్నించగా, ‘నీవెంత ఖర్చు పెడతావ్? ఇంత పెట్టగలిగితేనే చేర్చుకుంటాం. లేదంటే నీ దారి నువ్వు చూసుకో’ అని సదరు కార్పొరేట్ బినామీ సూటిగానే చెప్పేశారు!



సీమాంధ్రలో కాంగ్రెస్ పనైపోయిందని, వైఎస్సార్‌సీపీలో ఎటూ ఖాళీ లేదని తెలిసే, తప్పనిసరిగా టీడీపీలోకి రావాల్సిందేనన్న ధీమాతోనే బాబు బినామీ ఇలా గొంతుపై కత్తి పెటి మరీ బేరాలాడుతున్నారట. ఇలాగే గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ సీటును గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేసిన నేతకు ఇచ్చేందుకు బాబు కోటరీ ముఖ్యుడొకరు తనకు సంబంధించిన ఒక వ్యాపార ప్రయోజనాన్ని నెరవేర్చాలని షరతు విధించారు. అది కుదిరాకనే టికెట్ ఖాయం చేశారు. సదరు కోటరీ ముఖ్యుడికి రంగారెడ్డి జిల్లాలో వైద్య కళాశాలతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున ఆసుపత్రులున్నాయి.

 

 

కోటరీ + లోకేశ్ = టీడీపీ!

చంద్రబాబు పార్టీకి సంబంధించి ఏ చిన్న పని చేయాలన్నా కార్పొరేట్ కోటరీ సూచనలుండాల్సిందే. వాటిని మాత్రమే తూచా తప్పకుండా పాటిస్తారాయన. ఇప్పుడు టీడీపీలో నామా నాగేశ్వరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, డాక్టర్ పి.నారాయణ వంటి ధనవంతుల మాటకు తిరుగులేదు. వీరిలో నామా మినహా మిగతా వారంతా పరోక్షంగా పదవులు ఆశించిన వారే. ఎన్నికల్లో టికెట్ల పంపిణీ వ్యవహారాలన్నీ వీరే కనుసన్నల్లోనే సాగుతున్నాయి! వీరంతా చంద్రబాబు కుమారుడు లోకేశ్ పర్యవేక్షణలో గుట్టుగా వ్యవహారాలు నడుపుతారు. బాబు సైతం తానుగా జోక్యం చేసుకోకుండా వారు చెప్పిందానికే తలూపుతున్నారని ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తోంది. పొత్తులు, ఎత్తులు మొదలుకుని డబ్బూ దస్కం పంపిణీ దాకా సర్వం కార్పొరేట్ కోటరీ నిర్ణయాలకు అనుగుణంగానే నడుస్తోంది.



ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ వాళ్లే ఇప్పుడు బాబుకు ఆత్మ, అంతరాత్మ. పార్టీలో ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా సరే, వీరిముందు జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇది గమనించిన చాలామంది నేతలు ముందుగా వీరి దర్శనమే చేసుకుంటున్నారు. తాజాగా జిల్లాలవారీగా పార్టీపరంగా ఎన్నికల వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతను కూడా బాబు వారికే అప్పగించారు. సీమాంధ్రలోని ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో పార్టీ పనులను గరికపాటి పర్యవేక్షిస్తున్నారు. రాయలసీమ జిల్లాలను సీఎం రమేశ్, మిగతా జిల్లాలను సుజనా చౌదరి, నారాయణ, నామా చూసుకుంటున్నారు. ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరికి టికెటివ్వాలి, ప్యాకేజీలు ఎవరికివ్వాలి, ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి వంటి సర్వ వ్యవహారాలనూ వీరే తేల్చేస్తారు!



గత ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటు చేయడంలోనూ వీరిదే కీలక పాత్ర! డబ్బులు గుప్పిస్తే పొత్తుకు రాని నాయకుడు గానీ, పార్టీ గానీ ఉండవన్నది వారి నమ్మకం.  తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికీ వీరే మధ్యవర్తిత్వం నెరిపారు. పొత్తుల విషయం గతంలో ఆయా పార్టీ కార్యాలయాల్లోనో, నేతల ఇళ్లలోనో చర్చలు జరిగేవి. కానీ ఈ కోటరీ హవా విస్తరించాక ఈ చర్చలకు కూడా స్టార్ హోటళ్లే వేదికవుతున్నాయి. బీజేపీతో పొత్తు చర్చల్లో కూడా, ‘మీరు పెద్దగా ఖర్చు పెట్టలేరు’అనే వాదన సాయంతోనే వారికి వీలైనన్ని తక్కువ సీట్లతో సరిపెట్టేందుకు ప్రయత్నించారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top