చంద్రబాబు పాలన భయానకం:వైఎస్ జగన్

చంద్రబాబు పాలన భయానకం:వైఎస్ జగన్ - Sakshi


కడప: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆనాటి పాలనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయమేస్తోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ పాలనకు ముందు చంద్రబాబు పాలనంతా భయానకంగానే సాగిందని విమర్శించారు. ఈ రోజు జిల్లాలోని మైదుకూరు ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన జగన్.. బాబు వైఖరిపై మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లి దండ్రులు పడే కష్టాలను ఆయన ఎప్పుడూ పట్టించుకున్నపాపాన పోలేదని తెలిపారు. చంద్రబాబు తన పాలనలో వృద్ధులకు ముష్టివేసినట్టు 75 రూపాయలు ఇచ్చేవారన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తింటాడని జగన్ మరోమారు గుర్తు చేశారు.


 


ఎన్నికల ముందు చంద్రబాబు అన్నీ ఫ్రీ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేయడానికి వస్తున్నారని, ఆ విషయాన్ని అంతా గమనించాలని ప్రజలకు సూచించారు. ఆయనలా విశ్వసనీయతలేని రాజకీయాలు తాను చేయలేనని జగన్ స్ఫష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రమాణస్వీకారం రోజునే  ఐదు సంతకాలు చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అమ్మఒడి పథకం ఫైలుపై మొదటి సంతకం చేస్తానని, అవ్వాతాతల పెన్షన్‌ రూ.200 నుంచి 700 చేస్తూ రెండో సంతకం, రైతన్నలకు అండగా ఉండేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిపై మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేయడమే కాకుండా, అన్ని రకాల కార్డుల జారీ చేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఐదో సంతకం చేస్తానని జగన్ తెలిపారు.  రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయతకు కట్టుబడి ఉండే వైఎస్సార్ సీపీనే గెలిపించాలని విన్నవించారు.


 


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top