సీమాంధ్రలో బీజేపీతో పొత్తు లేదు:చంద్రబాబు

సీమాంధ్రలో బీజేపీతో పొత్తు లేదు:చంద్రబాబు - Sakshi


గజపతినగరం: అవకాశవాద రాజకీయాలకు టీడీపీ మరోసారి తెరలేపింది. బీజేపీతో పొత్తుకు తొలుత అర్రులు చాచిన టీడీపీ..నామినేషన్ల పర్వం వచ్చే సరికి దానికి పంగనామం పెట్టింది. సీమాంధ్రలో బీజేపీతో తెగతెంపులు చేసుకుంటన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ రోజు విజయనగరం జిల్లాలోని గజపతినగరం ఎన్నికల రోడ్ షోలో పొత్తు ఇక లేదంటూ బాబు పేర్కొన్నారు. కాగా, బీజేపీతో పొత్తు లేదంటూనే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వెనుకేసుకొచ్చారు. బీజేపీ కొన్నిచోట్ల బలహీన అభ్యర్థుల్ని నిలపడం వల్లే మిగిలిన పార్టీలు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. అలా జరిగితే పొత్తుల ఉద్దేశం నెరవేరదంటూ బీజేపీపై ప్రేమ కురించారు. కాగా, తెలంగాణలో నామినేషన్లు ప్రక్రియ ముగిసిన అనంతరం బాబు ఈ ప్రకటన చేయడంపై బీజేపీ మండిపడుతోంది.





బీజేపీ-టీడీపీ పొత్తు అంశం ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. టీడీపీలో రెబల్ అభ్యర్థులు క్రమేపీ పెరుగుతుండటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తోంది.  బీజేపీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో చంద్రబాబు నాయుడి వైఖరిపై అనుమానాలకు పొత్తు తెగతెంపులు మరింత బలం చేకూర్చాయి. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టీడీపీ పొత్తు ధర్మం తెలుసా?అంటూ నిలదీశారు. టీడీపీ అభ్యర్థుల గురించి బీజేపీ అడగనప్పుడు వారు తమ స్థానాల్లో పోటీకి దింపడమేమిటని జవదేకర్ ప్రశ్నించారు.  టీడీపీ నాయకుల గురించి తమ నాయకులు ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ పార్టీకి చెందిన మీడియాలో లీకులివ్వడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



బీజేపీ-టీడీపీల పొత్తు అనంతరం సీమాంధ్రలో రెబల్ అభ్యర్థులు పొత్తుపై నిరసన గళం వినిపించారు. ఇప్పటికే పలుచోట్ల  తిరుగుబాటు బావుటా ఎగురవేసిన టీడీపీ అభ్యర్థులు.. నామినేషన్ల కార్యక్రమంలో రెబల్స్ గా మారి  చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీకి 14 స్థానాలు కేటాయించారు. బీజేపీకి కేటాయించిన స్థానాలకు గాను ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థలు నామినేషన్లు వేశారు. ఇదంతా చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీజేపీ-టీడీపీల పొత్తుకు ఆదిలోనే హంసపాదు ఎదురుకావడంతో.. సీమాంధ్రలోని అన్నిస్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top