టీడీపీలో రాజుకుంటున్నముసలం

టీడీపీలో రాజుకుంటున్నముసలం - Sakshi


పది మంది బాగు కోసం ఒక్కడు నష్టపోయినా ఫర్వాలేదనిదే జగమెరిగిన సత్యం. ఒక్కడు బాగు కోసం ఎంతమంది నష్టపోయినా ఏం కాదనేది మన టీడీపీ అధ్యక్షుడు నారా వారి సిద్ధాంతం.  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరుతో ఇప్పటికే విసుగుపోయిన తెలుగు తమ్ముళ్లకు మరో షాక్ తగిలింది.  బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీ కోసం కష్టపడిన వారికి  అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల టీడీపీలో చోటు చేసుకున్న విభేదాలు తాజాగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు కూడా పాకాయి. నరసరావు పేట టికెట్ ను బీజేపీకి కేటాయించడంతో స్థానిక నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇక పార్టీలో ఉండి ఏమీ ప్రయోజనం లేదని భావించిన టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైయ్యారు.


 


రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఒకప్రక్క పొత్తుతో పార్టీలో తిరుగుబాటు బావుటా, మరోప్రక్క అప్పుడే పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి టికెట్లు కేటాయించడంతో అసంతృప్తి సెగలు టీడీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజకీయాలకు గుండె కాయగా ఉన్న విజయవాడ లోక్ సభ సీటు అంశం కూడా టీడీపీని మరింత చిక్కుల్లోకి నెట్టింది.ఈ స్థానానికి సంబంధించి కేశినేని శ్రీనివాస్ (నాని), పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ల మధ్య పరోక్షంగా మాటల యుద్ధం జరిగింది.  చివరకు విజయవాడ్ టికెట్ ను నాని దక్కించుకోవడంతో తాత్కాలికంగా సమస్యకు ఫుల్ స్టాప్ పడింది.

 


ఇదిలా ఉండగా టికెట్ పై గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం విశాఖ నేతల్లో అసహనం కల్గిస్తోంది. తాజాగా చంద్రబాబు తీరుతో భంగపడ్డ నేతల జాబితాలో అనిత సక్రు కూడా చేరిపోయారు. విశాఖ జిల్లాలోని భీమిలి అసెంబ్లీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నఅనితకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చకున్న గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ కేటాయించడంతో వివాదం రాజుకుంది. గంటా వల్లే తనకు టికెట్టు రాలేదని ఆమె మీడియా ముందు ఏకరువు పెట్టారు. పార్టీకి సేవ చేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా పార్టీలో అప్పుడే చేరిన వారికి టికెట్టు ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు.  గంటాను ఓడించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ఇక తనముందు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగటమేనని టీడీపీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు.

 

తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన రామకృష్ణారెడ్డికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అక్కడి టికెట్ ను ఆయనకు వేరేవారికి ఇవ్వడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ టికెట్ ను రాష్ట్ర సర్పంచ్ లు మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి సతీమణి సునీతకు  కేటాయించడంతో రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం ఆందోళన బాటపట్టారు. పార్టీ కోసం కష్టపడే వారికి బాబు టికెట్లు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలా వరుసగా ఒకదానివెంట ఒకటి బాబును చుట్టుముట్టుడంతో ఆయన పరిస్థితి కొండనాలుకకు వలవేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top