అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాల్సిందే


కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాజకీయ నేతల ప్రవర్తన, సభలు, సమావేశాలు, ఊరేగింపులు తదితర వాటిని ఏ విధంగా నిర్వహించుకోవాలనే దానిని కలెక్టర్ వివరించారు.



- పార్టీలు, నేతలు, అభ్యర్థులు జాతి, కుల, మత ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను ఇంతకుముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయరాదు.



- రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మత పరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు.

     

- ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేయడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరోకరిని ఓటరుగా వినియోగించుకోవడం, పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయరాదు.

     

- గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం తిరిగి తీసుకెళ్లడం వంటివి నిషిద్ధం

     

- అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగురవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం

     

- పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాని బట్టి పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు.

     

- లౌడు స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి పార్టీలు, ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది. ఏ మార్గం గూండా వెళుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది తదితర వివరాలన్నీ ముందుగా సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించాలి.

     

- సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు

     

- ఒక పార్టీ వేసిన పోస్టరును వేరే పార్టీల వారు తొలగించరాదుఊరేగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు దాటితే ఎన్నికల వ్యయంలో చూపించాలి,గుర్తింపు పొందిన ప్రభుత్వ స్థలంలో మాత్రమే అనుమతించబడినటువంటి పోస్టర్లు, హోర్డింగ్‌లు కటౌట్లు, బ్యానర్లు మొదలగునవి స్థానిక సంస్థల చట్టాలకు లోబడి అనుమతించబడవు.

     

- అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో పైన పేర్కొన్న వాటిని ప్రదర్శించినచో అట్టి వారిని ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానాతో 1997 చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.

 

- పైవేటు భవన యజమాని నుంచి రాత మూలకంగా అనుమతి పొందకుండా ఎటువంటి రాతలు గాని, బ్యానర్లు మొదలయినవి ప్రదర్శించినచో వారికి 3 నెలల వరకు జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top